Thursday, December 5, 2019

MARGALI MALAI-28

    మార్గళి మాలై-28
   ****************
  ఇరువది ఎనిమిదవ పాశురం
  *********************
కరవైగళ్ పిన్శెన్రు కానం శేరిందు ఉణ్ణోం
అరివొన్రుం ఇల్లాద అయ్ కులత్తు ఉందన్నై
ప్పిరవి పిరందననై పుణ్ణియం నుం ఉడైయోం
కురైవొన్రుం ఇల్లాద గోవిందా! ఉందన్నోడు
 ఉరవేల్ నమక్కు ఇంగు ఒళిక్క ఒళియదు!!
అరియాద ప్పిళ్ళైగళోం! అంబినాల్ ఉందన్నై
చ్చిరుపేర్ అళైత్తనవుం శీరి అరుళాదే
ఇరైవా! నీ తారాయ్ పరై ఏలోరెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 పశువుల మేపుటకు పచ్చిక వెంటను పరుగిడు వారము
 కర్మానుష్ఠానములెరుగని గొల్లకులము వారము

 శరణము-సందర్శనము-భోగము అను మూడిటితో
 నిన్నుచేరి యున్నాము శుధ్ధసత్వ గోపికలము

 భక్తి-జ్ఞానము-అర్హత ఏమాత్రము లేకున్నవారలము
 మా కులములో పుట్టినవాడవు నీవను సాకు తప్ప

 మనవ్రతమునకు మెచ్చెను మాధవుడు మనవాడేనట
 రమణీయమైన స్వామితో రాసలీలను పేరిట

 పండువెన్నెలలోన నేడు పరమార్థమునందుకొనగ
 యమునా తటికి రారాదో! ఓ రమణులారా!.

గోపికలు శ్రీకృష్ణునితో గొల్ల కులములో పుట్టిన వారమని,లోకానుసరణ తెలియని వారమని,స్వామిని చిన్న చిన్న పేర్లతో పిలిచి అపచారముచేసిన వారమని,అయినను శ్రీకృష్ణుడు వారిని నిరాదరించరాదని వేడుకుంటున్నారు.

గోపికలు ఆవులను అడవికి తీసుకుని వెళ్ళుటయే నిత్యకర్మలని,గోవులను మోక్ష సాధనమునకు గాక పాడికి మాత్రమే పెంచుతున్నామన భావన కలవారమని,నియమ-నిష్ఠలు లేని వారమని అమాయకముగా మాటాడుచున్న మహా మేధావులు..కనుకనే వారు అకారత్రయమును ఆశ్రయించినామని అంబే (ప్రియమైన స్వామిని)తో చెప్పుచున్నారు.అంత మహిమాన్వితమైనది ఆ అకారత్రయము అని గోపిక ఆలోచిస్తోంది అవి

అనన్య శరణము-అనన్య ఉపాయము-అనన్య భోగము.మన గోపికల పరిస్థితి.

వారికి కావలిసినవి స్వామి ఒక్కడే అందీయగలడని శరణువేడారు.వారి వ్రతమునకు కావలిసిన వస్తువులు-మనుషులు-వాయిద్యములు స్వామియే అందీయగలడని,

స్వామిని ఉపాయముగా అనుకున్నారు.భక్తి పరి పక్వమై స్వామిని ఉపేయముగా పొందకోరుతున్నారు.వారికి కావలిసినది,వారి కోరిక తీరుటకు కావలిసినది,వారిని సంపూర్ణ సంతుష్టులను చేయగలిగినది స్వామి యని తెలియచేయుటయే "అకార త్రయము".

వేదవ్యాస విరచితమైన " శ్రీమద్భాగవత" దశమ స్కంధములో (29-33) రాస పంచాధ్యాయి గా ప్రశస్తి గాంచినవి.జయదేవుని గీతగోవిందము మరొక మణిపూస.

"యద్భావం తద్భవతి" అన్న ఆర్యోక్తి రాసలీలను గురించి ముచ్చటించు సమయమున వర్తిస్తుంది కనుక మనం నిష్కళంక మనసుతో దీనిని భావించుదాము.

రాసలీల అంటే మంచి (ప్రయోజనముగల) పని అని అర్థమును పెద్దలు సెలవిచ్చారు.ఇది నవరసాతీత నవనవోన్మేష అలౌకిక ఆత్మానంద హేల." ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు" అనునట్లు ఒక్క రేడు పెక్కు నీడలుగా మారి చక్కని తాత్త్వనికతను తెలియచేయు ఆధ్యాత్మిక అనుగ్రహము.

రసము అను దానికి ఆస్వాదించు ద్రవ పదార్థము అను అర్థమును కనుక అన్వయించుకోవాలనుకుంటే పరమాత్మ కృష్ణ భక్తి అను మధుర రస పానముతో పునీతులైన జీవాత్మల (గోపికల) తాదాత్మిక నృత్యహేల మన కృష్ణుని రాసలీల.

మన గోపికలు శుద్ధ తత్త్వముతో నున్నారని అనుకున్నాము.కనుక వారు తమో-రజో గుణములతో నున్న వారి కుటుంబ సభ్యులను వీడి,నల్లని చీకటి తమోగుణ ప్రధానమైనది(రాత్రి).దానిని వీడి తేజోరూపమైన పరమాత్మను దర్శించి-సేవించుటయే లీల.(మనుషులు చేయు పనులను కర్మలు అని దైవము చేయు పనులను లీలలు అని అంటారు)."త్వమేవాహం" (నీవే నేను-నేనే నీవు) తారాస్థాయిలో నున్న తపస్సు.

 ఎంతటి ధన్యులో గదా వారు.
 ****************************

 కన్నని చూచునొక్కతె-కనుసన్నల దాచునొక్కతె
 బింకముపోవు నొక్కతె-బిగి కౌగిట దాచునొక్కతె
 జలమును చల్లు నొక్కతె-జలజంబును తురుమగ కోరునొక్కతె
 దరహాసము చేయుచు దాగునొక్కతె-దరిచేరగ పిలుచు నొక్కతె
 పరిహాసముచేయుచు నొక్కతె-పర్యంకమున పరుండబెట్టొకతె
 తనవాడే-తనవాడే -తనావాడేననుచును తాదాత్మ్యము తోడుగ
 పరవశులైన పడతులతో -పలు-పలు లీలల ప్రకటనములతో
 యదుకులభూషణుని పొదివిన యమునాతటి ఎంతటి 

      భాగ్యశాలియో
 రసరమ్యతనొంది తరించెను రమణీరమణుల రాసలీలలన్.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)








No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...