Tuesday, February 11, 2020

namoestu sooryaaya sahasra raSmayae



నమోస్తు సూర్యాయ సహస్ర రశ్మయే
*************************
  *****************


 కిరతి అనగా వెదజల్లుట.వెదజల్లుస్వభావము కలవి కిరణములు.కిరణములు అగ్ని కిరణములు-జలకిరణములు-హిమకిరణములుగా ఋతుచక్రమును నడిపించుచున్నవి.వస్తుజ్ఞాన లక్షణము కలిగించేవి కనుక కిరణములను "కేతవః" అంటారు.

 సూర్య గమనము అంటే కిరణములద్వారా సూర్యకాంతి ప్రసరణము.కిరణాలే సూర్యునికి మనకు గల బాంధవ్యాలు.
.

 సూర్యుని వేయి కిరణములు చాలా గొప్పవి.అవి ఉషః కాలమునందు అంతవరకు కమ్మిన చీకటిని నశింపచేయును.ఆకాశమును విస్తరింపచేయును.దిక్కులను మరింత పొడవుగా గోచరించునట్లు చేయును.సముద్రమును దాని చెలియలి కట్టను జలప్రకాశ భరితముగా చేయును.ఆకాశాంతరాళము నుండి ప్రసరిస్తు అవనిని ఆనందభరితము చేయును.


 లోపల-బయట వ్యాపించే లక్షణము కల కిరణములను "అంశువులు" అంటారు.సూర్య కిరణములలో ఉండే వికసన శక్తిని " పద్మిని" అంటారు.మద్యాహ్న కిరణములను మరీచులు అంటారు.


  హంస-ప్లవంగ-కపి-వరాహం-సింహం-హరితశ్వం మొదలగునవి కొన్ని కిరణముల పేర్లు.వేదము కిరణముల స్వరూప-స్వభావములను-బట్టి వాటికి గౌణ నామములను చేసినది.


 ఉదాహరణకు నవగ్రహకారక శక్తులుగల కిరణములను హరికేశములు అంటారు.కం-పిబతి  జలమును త్రాగు సూర్య కిరణమును కపి అంటారు.తైల సంపదను అనుగ్రహించే సూర్య కిరణమును మిత్ర అంటారు.దూకు స్వభావము కల కిరణములను ప్లవంగములు (కోతులు) అంటారు.వ్యాపిచే లక్షణము కల కిరణములను అశ్వ అంటారు.

 ఆకుపచ్చని వర్నముతో భూమినంతటిని ఆకుపచ్చగా మలచుటకు వేగముగా వ్యాపించు కిరణమే హరిదశ్వము.పోషకత్వము-రక్షకత్వము కలవి ఈ కిరణములు.అన్నప్రదానమున్-లు.అంతే కాదు కొన్నిటిని హరించే స్వభావము కలవి హరిదశ్వ కిరణములు.జగత్కళ్యాణమునకు ఆటంకమును కలిగించు చీకటి-మంచు-క్రిములు-రోగములు-దుఃఖము-దరిద్రమును హరించునవి ఈ హర్దశ్వ కిరణములు.

  కిరణములను గరుత్తులు/రెక్కలు అని కూడ అంటారు.కాంతి-వేడి అను రెక్కలను విదుల్చుతు విశ్వమును జాగృతపరచు విశేషశక్తులు.అంతదాక ఎందుకు? సూర్య కిరణములలో రోగహరణశక్తులే "అశ్వనీదేవతలు" గా ఆరాధింపబడుచున్నవి.

  కిరణములు అంటే బీజశక్తులు.భూగృహములో నిక్షిప్తమైన సర్వసంపదలను తమ కిరణప్రసరణము ద్వారా చైతన్య భరితము చేసి సంపత్ప్రదము గావించును.

 సూర్యకిరణములను వృషభములు అని కూడా అందురు.వర్షించేవి వృషభములు.పాదతలము నుండి మస్తకము వరకు మనలను తాకుతు,ప్రచోదనము చేస్తూ,ప్రభాభరితము చేస్తాయి.జడత్వము జాడ కానరాకుండా చేస్తాయి.

 కిరణములు సప్తవర్ణ కారకములు.అష్టసిధ్ధి ప్రదములు.ఏడు రోజులు ఏడు గ్రహముల హోరలలో ఉదయిస్తు పాలనముచేయుచున్న అనుగ్రహములు.



 ఉపాధి లక్షణమును బట్తి జీవజాలము సౌరశక్తిని గ్రహించి,తనకు అనుగునముగా మలచుకుంటుంది.  ఉదాహరణకు వృక్షములు పత్రహరితమును,ఖనిజములు తమ సంపదలను,ఔషధములు తమ రోగ హరణశక్తిని,సక్లచరాచరములు మేథను ద్విగుణీకృతము-త్రిగుణీకృతము చేసుకుంటు భూమండలమును సుసంపన్నము చేస్తున్నాయి.ఇది కాదనలేని నగ్నసత్యము.సూర్యనారాయణుని స్థితికారక నిత్యకృత్యము.సూర్యమండలము నుండి తమ ప్రసరణను ప్రారంభించి హృదయమండల రశ్ములలోనికి(నాడులలోనికి) ప్రవేశించి,ప్రాణశక్తి రూపములో శరీరమంతటిని-బుధ్ధిని ప్రకాశింపచేస్తాయి.

            తన కిరణములను కరములతో మనలను స్పృశిస్తూ,మనకు సౌష్టవమును కలిగిస్తూ,సంస్కారమును నేర్పించే కర్మసాక్షికి,కరములు జోడించి నమస్కరించుట తప్ప,తిరిగి మనమేమీయగలము?


   పరమాత్మ పరముగా వేదమంత్రములు-మండల పరముగా కిరణములు-శరీర పరముగా నాడులు కిరణ ప్రసాదమును స్వీకరిస్తూ," అహం భోక్త" అని కృతజ్ఞతతో సూర్యునికి నమస్కరిస్తు " తం సూర్యం ప్రణమామ్యహం" అందామా!.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...