Tuesday, February 18, 2020

SAPTASVA RATHA SAMARUDHAM-TAM SURYAM PRANAMAMYAHAM.


   సప్తాశ్వ రథ సమారూఢము-తం సూర్యం ప్రణమామ్యహం
   ********************************************

"అశువ్యాప్తో"అను ధాతువు నుండి "అశ్వ" అను పదము ఉత్పన్నమైనది.అశ్వము అనగా శీఘ్రముగా వ్యాపించు లక్షణము కల గౌణ నామము కలది.

 " జయో జయశ్చ విజయో జితప్రాణోః జితశ్రమః
   మనోజవో జితక్రోధో వాజినః సప్తకీర్తితః."

  జయ-అజయ-విజయ-జితప్రాణ-జితశ్రమ-మనోజవ-జితక్రోధ అను సప్త సప్తికి నమస్కారములు.

 కాల రూపముగా-కాంతి రూపముగా-వేద రూపముగా-నాదరూపముగా-గ్రహ రూపముగా-మన ఇంద్రియ రూపముగా-ధాతు రూపముగా -దేహ చక్ర రూపముగా ఇలా ఎన్నో-ఎన్నెన్నో రూపములుగా ప్రకటింపబడుతూ,ప్రాణశక్తులుగా ప్రస్తుతింప బడుతున్న ,

  భాను మండల మధ్యస్థునికి మరి మరి నమస్కరిస్తూ,మచ్చునకు కొన్ని విషయములను తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాను.విజ్ఞులు దోషములను సవరించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

 పరమాత్మ అనేక రూపములను ధరించి,ఒక్కొక్క రంగు-ఒక్కొక్క రూపు,ఒక్కొక్క విలక్షణతను ప్రకటింపచేచు విశ్వపాలనము చేస్తుంటాడు.

 " కలయతి నియతి" - ఇతి కాలః. పరిణామం అనేది కాలము.ప్రతి రోజు సూర్యుని వలన ఏర్పడినది కనుక ప్రతి రోజు సూర్యునిదే.అహోరాత్రము లోని రెండు అక్షర పదము హోర.అహమునకు రాత్రికిని మధ్యనున్న సమయము.

 వారము అంటే మాటిమాటికి వచ్చునది.వారము యొక్క నామమునకు గ్రహములకు సంబంధము కలది.రాహు-కేతువులను ఛాయా గ్రహములుగా ఆర్యులు పరిగణిస్తారు.మిగిలిన ఏడు గ్రహములకు ఏడు వారముల పేర్లకు గల సంబంధమును పరిశీలిద్దాము.

1.సూర్య హోరలోసూర్యోదయమైన రోజు ఆదివారము/భాను వారము.
 2.చంద్రహోరలో సూర్యోదయమైన రోజు సోమవారము.
3.కుజ హోరలో సూర్యోదయమైన రోజు మంగళ వారము.
4.బుధ గ్రహ హోరలో సూర్యోదయమైన రోజు బుధవారము.
5.బృహస్పతి హోరలో సూర్యోదయమైన దినము బుధవారము.
6.శుక్రహోరలో సూర్యోదయమైన దినము శుక్రవారము.
7,శనిగ్రహ హోరలో సూర్యోదయమైన శనివారము.

  ఈ విధముగా పరణ్జ్యోతి గ్రహముల ప్రాముఖ్యతకు సంకేతముగా వాటి నామములనే వారముల యొక్క నామములుగా ప్రకాశింపచేస్తున్నాడు.

 సూర్యోదయము కాగానే సర్వ ప్రకృతి జాగృతమై తన పని తాను చేసుకుని పోతుంటుంది.

 మన శరీరములోని ఏడు గుఱ్రముల గురించి కొంచము పరిశీలిద్దాము.

1.మన శరీరములోని సప్తధాతువులైన మాంసము-మజ్జ-అస్థి-ప్లీహము-రక్తము-మేథ-శుక్ల సప్తాశ్వములే.

2.రెండు కన్నులు-రెండు చెవులు-నాసిక రెండు రంధ్రములు-నోరు (ముఖము) ఏడు రంధ్రములను ఇంద్రియ నిర్వహణ శక్తులు సప్తాశ్వములే.

3.సూర్య కిరణ పరముగా అన్వయిస్తే హరికేశ-సుష్మ్న-ఉదన్వసు-విశ్వకర్మ-ఉదావసు-విశ్వవ్యచస్సు-స్వర్రట్ వారములోని ఒక్కొక్క గ్రహమును శక్తివంతము చేయు ఏడుగుఱ్రములు.

4.మన శరీరములోని  మూలాధార చక్రము-స్వాధిష్టాన చక్రము-మణి పూరకము-అనాహత చక్రము-విశుధ్ధి చక్రము-ఆజ్ఞా చక్రము-సహస్రార చక్రము లను పేర ప్రచోదనమవు తున్న ప్రజ్ఞ సప్తాశ్వములే.

 5.కాంతి పరముగా ప్రసరణను గమనిస్తే సప్త వర్ణములే సప్తాశ్వములు.

  కాంతిని విశ్లేషిస్తే సప్తవర్ణములుగా మనకు కనపడునప్పటికిని ఏ వర్ణము లేని ఏక స్వరూపము.ఏక స్వరూపమును ఏడు వర్ణములుగా విశ్లేషింపచేయు శక్తులే ఏడుగుఱ్రములు.

 6 నాద పరముగా/వేద పరముగా సప్తాశ్వములను దర్శించే ప్రయత్నములో గాయత్రి-బృహతి-ఉష్ణిక్-జగతి-త్రిష్టుక్-అనుష్టుప్ -పంక్తి అను ఏడు ఛందస్సులు పరంజ్యోతి ఏడు గుఱ్రములు. ఛందస్సు అనగా వేద మంత్రములు.అపౌరుషేయములు.వేద నడకలు.

   నాద పరముగా గమనిస్తే స-రి-గ-మ-ప-ద-ని  అను సప్తస్వరములు  సప్తాశ్వములే.నాదమయములు.

7.సూర్యుని సప్తాశ్వములను విజ్ఞులు సప్తజ్ఞాన భూమికలుగా విశ్వసిస్తారు.

 1.  అవి బ్రహ్మజ్ఞానము కావాలనే కోరికను కలుగచేయు శుభేఛ్చ,

 2 బ్రహ్మజ్ఞానమును పొందుటకు కలిగించు విచారణ,

 3.విచారణ ద్వారా సాధన మార్గమును తెలిసికొని,తత్సాధనలో నిమగ్నమగు తను మానసము,

 4.తమో-రజో గుణములు శూన్యస్థిని చేరి,శుధ్ధ సత్వ స్థితిని సాధించ కలుగు సత్వాపత్తి,

 5.దివ్య చక్షువు మేల్కాంచి,సత్యద్రష్టను చేయ కలుగు అసంసక్తి,

 6.ప్రతిపద నిగూఢార్థమును,వస్తు భావనను కలిగించు సిధ్ధస్థితి,

 7.మానవుని పరిపూర్ణస్థితి,ఒక్కొక్కనిని ఒక్కొక్క యోగిగా మారుస్తూ,సహస్రదళ రేకులను వికసింపచేయు తురీయ స్థితి.

   అదియే నిర్వికల్ప సమాధిని చేర్చునవి సప్తజ్ఞాన మాతృకలైన సప్స్తాశ్వములు.

   ఇంత సహాయకారక గుఱ్రములను సౌరశక్తి రహస్యాలతో ప్రకాశిస్తున్న,

 " బృహత్వాత్ బృంహణత్వాత్ ఇతి బ్రహ్మా"

  ఉత్కృష్టమైనశక్తి బృహత్-వ్యాపకత్వ శక్తి బృంహణత్వము అయిన పరంజ్యోతికి ప్రణామములు సమర్పిస్తూ,

  సప్తాశ్వ రథ సమారూఢం-ప్రచండం కశ్యపాత్మజం
  ఏక చక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం."








No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...