Wednesday, May 27, 2020

OM NAMAH SIVAAYA ---04


ఓం నమ: శివాయ -04
 ****************

నెత్తిమీది గంగతప్ప నెత్తుటి బంధము ఏది
పొత్తు నీకు హరికితప్ప పొత్తిళ్ళలో సుఖము ఏది
లలాటమున కన్ను తప్ప బాలానందములు ఏవి
హెచ్చైన ఎద్దు తప్ప అచ్చట ముచ్చటలు ఏది
పిలవని పేరంటము తప్ప పెళ్ళికి సందడి ఏది
దక్షుని నిర్లక్ష్యము తప్ప లక్షణ మర్యాద ఏది
మింగుడుపడని విషము తప్ప మెరుగు అగు సంగతులేవి
పుక్కిటి పురాణములు తప్ప పురుషార్థములు ఏవి
అపాత్ర వరములు తప్ప ఈషణ్మాత్రపు ఈవి ఏది
పరుగుతీయు భయము తప్ప పరమపదము నీకు ఏది
లయముచేయు లయ తప్ప నాకు వలయునది లేదని,నే
నొక్కి చెప్పాలిరా ఓ తిక్క శంకరా.
   శివునికి రక్త సంబంధీకులు లేరు .అమ్మ పొత్తిళ్లలో పరుండలేదు.చిన్నపిల్లల ఆటపాటలు లేవు.పెరుగుచున్నప్పుడు జరుగు ముద్దుముచ్చటలు జరుగలేదు.పెళ్ళికి దక్షుని ఆహ్వానము లేదు.కనుక మగపెళ్ళివారి సందడి లేదు.అత్తింటి మర్యాదలు లేవు.మింగక దాచిన విషము తప్ప చెప్పుకోదగ్గ విశేషములు లేవు.కాలక్షేప పురాణములే కాని కైవల్యమును ఈయలేవు.శివుడు అర్హత లేని వారికి వరములు ఇచ్చుటచే కొంచమైనను కీర్తిలేదు.తన వర ప్రభావమునకు తానే భయపడి పరుగులు తీయు శివుడు పరమపదమును ఎలా అందీయ    గలడు?లయ ప్రథానముగా ఆడుచు లయముచేయు శివుని వద్ద భక్తునికి కావలిసినది లేదని భక్తుని మాట - నింద.

     గిరిజా కళ్యాణము సదాశివుని లీల.మన కొరకు ధరించిన లీలా మానుషరూపము కాని రక్త-మాంస శరీరము కాదు.
జననము,జాడ్యము,జర(ముసలితనము) లేని శివుడు గుణాతీతుడు,కాలాతీతుడు,భక్త పరాధీనుడు.తన వరములద్వారా గ్రహీతలకు తరుణోపాయమును సూచించుటయే చమత్కారము. అని - స్తుతి.
   ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...