Friday, September 11, 2020

Om nama ssivaaya

ఓం నమః శివాయ-108 ****************** కరుణరస పట్టిది కచ్చితము కనికట్టనలేనిది నేనేమరియున్నవేళ తానే నన్నుచేరినది మనోకలశము చూచినది మక్కువ తిక్కశంకరుని తక్కువచేసినగాని దయతలుచు దిక్కగువానిని సన్నుతిచేయుచు సంతోషపు జలమును నింపుచున్నది అనురక్తితో భక్తిదారమును చుట్లుగ చుట్టుచున్నది పదపదమని చేరినవి పరమేశుని పదములు మామిడాకులై అపరాధము తలంచుచు పలాయనమైనది నింద కుందుచు నా పశ్చాత్తాపము పరివర్తన చెందెను నారికేళమై నిను నిందించిన ఇంద్రియములు నిష్కృతి కోరెను పుణ్యహవచనము జరుగుచున్నది పునీతమవ్వగా వసియింపుము శివా నామది వాత్సల్యము వాసికెక్కగా. పరబ్రహ్మము ఒక్కటే.పైపై తొడుగులు వేరువేరుగా గోచరిస్తుంటాయి.పరమాత్మను అనుభవించాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన దర్శనశక్తిని కలిగియుండాలి.ఈ శక్తి అచేతనములను చైతన్యవంతము చేయు చిత్-శక్తి.దీనిని ఆత్మ యొక్క (పరమాత్మలోని చిన్ని మచ్చుతునక)అఖండశక్తిగా కూడ భావించవచ్చును.నేను-నాది అను అపరిమితమైన అహము అఖండశక్తిచే ప్రభావితమై మంచుకరిగినట్లు కరిగి,అంతఃకరణ శుధ్ధితో అసలు నిజము తెలుసుకోగలుగుతుంది.తాను నీడను మాత్రమేనని తెలుసుకొని నిజమైన పరమాత్మకు దూరముగా నుండి నడవలేక కదులుతున్న నేను కదిలిస్తున్న నేనులో కలిసిపోతుంది. అంతే, సర్వం శివమయం జగం.దీనిని అర్థము చేసుకొనేటట్లు చేయుటకు ఆదిదేవుడు తాను ఒక్కొక్క మెట్టు దిగుతు-నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు,అలసట రానీయకుండా ఆడిన ఆటయే శివసంకల్పమను ఈ నిందా-స్తోత్రముల మారేడు దళము. ...ప్రియ మిత్రులారా.నా ఈ చిన్ని ప్రయత్నమునకు ఊపిరినిచ్చినది మీ ఉన్నత సం స్కారమే కాని నా అర్హత కాదు.ఈ పవిత్ర " శివ సంకల్ప" పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా,తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా (ఫలశృతి) గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన. ( సవినయ ధన్యవాద కుసుమాంజలి) ఓం మంగళం- ఓంకార మంగళం జయము మంగళం-జగన్నాథ మంగళం శుభం మంగళం-శుభాకార మంగళం సత్య మంగళం-సచ్చిదానంద మంగళం నిత్య మంగళం-నిరాకార మంగళం మహాదేవ మంగళం-మహనీయ మంగళం అర్థనారీశ్వర అందుకో మంగళం. జయ మంగళం-నిత్య శుభ మంగళం జయమంగళం-నిత్య శుభ మంగళం. సర్వం సదాశివ పాదారవిందార్పణమస్తు

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...