PRAPASYANTEE MAATAA-09

" మాణిక్యవీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళా వతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే నమస్తే ! జగదేక మాతః." అని మహాకవి కాళిదాసుచే ప్రస్తుతింపబడిన తల్లిని,అశుభములలో-అశుభ్రతతో మిళితమైన కాలుష్యశక్తిగా భావించి,చండాలిక నామముతో గుర్తించుట అలుముకున్న మన అజ్ఞానమునకు ప్రతీకయే కాని మరొకటి కాదు.చీకటి-వెలుగులు తల్లి కనుసన్నల కదలికలు కనుకనే ఒక్కొక్కసారి నీలశ్యామలగా-మరొక్కసారి సరస్వతిగా ప్రకటింపబడుతూ,అంతర్-బహిర్ తత్త్వములకు అద్దముపట్టుతుంది అమ్మ. స్థూలజగతిలో మతంగ ముని కన్యగా ప్రస్తుతింపబడు తల్లి సంగీత-సాహిత్య సమలంకృత.సంపూర్ణ శబ్దస్వరూపము అయిన మాతంగి మనలను ఏ విధముగా శబ్దస్వరూపమై శాసిస్తుందో-మనలో శ్వాసిస్తుందో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. స్పందన గుణము కలది శబ్దము.స్పందనశక్తి శబ్దమును వివిధస్థితులలోనికి పయనింపచేస్తుంది.ప్రయాణములో వచ్చిన మజిలీలలో,శబ్దము తన సహజగుణమును కొంత విడిచిపెట్టి,కొత్తదనమును మరికొంత పుణికిపుచ్చుకొని,సరికొత్తరూపుతో సాగుతుంటుంది.సంపూర్ణ జ్ఞానస్వరూపిణి అయిన మాతంగి మాత అనుగ్రహమే ఈ శబ్ద పరిణామము మరియు ప్రయాణము.పరిణామము చెందుతూ ప్రయాణము చేస్తున్న శబ్దము తనలో కొంత దార్శనికతను-మరికొంత ధారణశక్తిని కలుపుకొను "విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అను నానుడిని నిజం చేస్తుంది. "అస్తి కశ్చిత్ వాగ్విశేషా? అని నన్నెవరైన ప్రశ్నిస్తే నా స్వాధిష్ఠాన వాసిని మాతంగి మాత,మేరుదండంలా ఉన్న వెన్నెముకలో తిరగబడిన ఆడఏనుగు తొండము వలె ప్రకాశిస్తూ,సరస్వతీ నాడియై నా తృతీయనేత్ర స్థానము నుండి బయలుదేరిన వాక్శక్తిని జిహ్వాగ్రమునకు చేరుస్తూ,నన్ను చేరదీస్తున్నదని నిస్సందేహముగా సమాధానమిస్తాను.ఈ వాక్సుధారసమంతా నీ ప్రకాశమే తల్లీ. నిన్ను నేనేమని ప్రస్తుతించగలను?నీ దివ్యచరణారవింద సంస్మరణము తక్క. ధన్యోస్మి మాతా ధన్యోస్మి.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI