Tuesday, October 5, 2021

INTRODUCTION KAAMAAKSHI TAAYI

" శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్" భగవత్స్వరూపులారా! నమస్కారములు. వాచక-కాయక-మానసిక పాపశేషములు జీవులను జన్మ అనే గుంజకు కర్మ అనే పాశముతో కట్టి,జనన-మరణ చక్రములో దారి-తెన్ను లేక తిరుగుతుండేలా నిర్దేశిస్తాయి.అమ్మలకన్న అమ్మ తన అవ్యాజకరుణతో (కరుణించుటకు మనకు ఏ అర్హత లేనప్పటికిని)మనలను ఉధ్ధరించుటకొక ఉపాధిని అనుగ్రహించి,మన కదలికలను ధర్మబధ్ధముగా జరుపుతు,మనలో మార్పులు తెస్తూ-తెస్తూ,ఏ మార్పులేని స్థితిని చేరుస్తుంది.పాశములను తొలగించివేసి,పశుపతితో/పశుపతిలో పరవశమయే భాగ్యమును ప్రసాదిస్తుంది. తల్లి నిర్హేతుక కృపాకటాక్షమేమో,ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకుని, ద్రవిడభాషా శిరోభూషణములైన కామాక్షి అమ్మ విరుత్తము-నటరాజ పత్తులను స్పూర్తులుగా అనుగ్రహించి,ప్లవ నామ సంవత్సర దేవీ సరన్నవరాత్ర పుణ్యసమయమున, తమిళము నా మాతృభాష(తాయి మొళి) కాకపోయినప్పటికిని,వాటి అద్భుతానుగ్రహములను అందరికి పంచవలెనను చిన్న కోరికను నా మనసులో చిగురింపచేసి, " కామాక్షి-కామదాయిని" అను తెలుగు భాషారూపమును ప్రసాదించినది.నా ఈ దుస్సాహసమును మన్నించి,దీనిలో, నా అహంకారము చొచ్చుకుని చేసిన భావలోపములను-భాషాదోషములను సవరించి,నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థన. భక్తునకు-భగవతికి గల అనుబంధమును-అనుగ్రహమును చాటు ద్రవిడభాషా స్వేచ్చా భావ సంకీర్తనా సంప్రదాయములలోనిది విరుత్తము.రాగ-తాళ నిర్దిష్టత లేని కారణమున ,భక్తుని భావోద్వేగములను ప్రతిబింబిస్తూ,భగవతిని-ప్రశ్నిస్తూ-పశ్చాత్తాపపడుతూ,నిందిస్తూ-తనను తాను మందలించుకుంటూ,పరిపరి విధములుగా ప్రకటింపబడుతూ,ఫలితముగా పరమపదమునందిస్తుంది.ఇది కామాక్షి తాయి కరుణ. కామాక్షి అమ్మ విరుత్తము ఆశువో-వ్రాసినది తెలియదు. వ్రాసినవారి వివరములు తెలియదు. అమ్మను అడిగే హక్కే కాదు,అమ్మలో దాగిన అయ్యను ప్రశ్నిస్తూ"నటరాజ పత్తు" పేర మనకు అందించిన శ్రీ మునుస్వామి మొదలియరు అవర్గల్ కు,అజ్ఞాత అవర్గల్కు (జ్ఞాత-అజ్ఞాత కవులకు) సభక్తిపూర్వక నమస్కారములతో, మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...