Saturday, November 13, 2021

MURKHA NAYANAR

మూర్ఖ నాయనారు ***************** ఈ నాయనారు అసలు పేరు మరుగున పడినప్పటికిని,జూద నిపుణుడు కనుక నర్సూదన్ నాయనారు అని అన్నదానమునకు సప్తవ్యసనములలో మొదటిదైన జూదమును ఆధారముగా చేసికొనిన వాడు కనుక మూర్ఖ నాయనారుగా ప్రసిధ్ధిపొందెను. తొండైనాడు లోని తిరువెర్కుడం లో జన్మించిన నాయనారు, " అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః" అన్న సిధ్ధాంత ప్రకారము, యజ్ఞము చేత వర్షము వర్షము వలన అన్నము అన్నము వలన సమస్త ప్రాణకోటి ఏర్పడును. అన్నం అంటె అన్నమయకోశ శరీరముగా మనము భావించుకోవాలి. అంటే అణు-పరమాణు సముదాయమైన శరీరము. నాయనారు తన చిన్నతనము నుండి శివభక్తులను శివస్వరూప భావంతో సేవిస్తూ,వారికి మధురపదార్థములను అన్నముతో పాటు వడ్డిస్తూ,వారు తృప్తిగా తినిన తరువాతనే తాను భుజించేవాడు. అనవరతము ఆతంకములేకుండా దేనిని సాగనీయడు కదా ఆ సాంబశివుడు. హరుని ఆన దాటనంటూ నాయనారు సంపదలను హరించివేయసాగినది కాలము.ఉన్న వస్తువులన్నీ అమ్ముడుపోయి కిమ్మనకున్నాయి.అయినా ఏమాత్రము బాధపడకుండా, అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్నిదానములలో అన్నదానము మిన్న అన్న నమ్మకమును వీడక దానికి కావలిసిన సంపాదనకై ఉపాయమును ఆలోచించసాగినాడు నాయనారు. తనకి తెలిసినది ఒక్కటే.అదే జూదము.అది సప్త వ్యసనములలో మొదటిది. నాయనారు నల్ల సూదన్ గా గొప్ప జూదగాడుగా అప్పటికే పేరుపొందిఉన్నాడు.నల్ల సూదన్ కాలక్రమేణా నల్ సూదన్ గా/నర్ సూదన్ గా మార్పు చెందింది. అన్న సంతర్పనకు అన్యాయ మార్గమును ఎంచుకోక తనకు ఈశ్వర ప్రసాదితమైన జూదముపైన మనసును కేంద్రీకరించి మరింత సిధ్ధహస్తుడైనాడు. పందెము పై జూదము ఆడుట ప్రారంభించాడు.మొదటి ఆటను కావలియే ఓడి ప్రతిపక్షము వారికి మరింత ఆసక్తిని పెంపొందించేవాడు.వ్యామోహితులైన వారు పెద్ద పెద్ద మొత్తములను పందెముగా ఒడ్డి ,నాయనారుతో గెలువలేక సమర్పించి వెళ్లేవారు. అన్నదానము కోటి గోదానముల కన్న మిన్న యనుచు దారిని పోయే వారిని నయానో/భయానో ఒప్పించి జూదమాడుటకు కూర్చుండపెట్తేవాడు.వారిని చిత్తు చిత్తుగా ఓడించి వారిదగ్గర నున్న పైకమును మొత్తము లాగివేసుకొని ఆ ధనము మొత్తము శివభక్తుల అన్న సంతర్పణలకే వినియోగించేవాడు. తన స్వార్థమునకు అసలు ఉపయోగించేవాడు కాదు. కామేశుని పరీక్ష మరి కొంత పదునెక్కి గ్రామములో ఎవ్వరును జూదమాడుటకు (నాయనారుతో) రాకుండాచేసినది. ధర్మము తప్పని నాయనారు అన్నసంతర్పణమును అంతరాయమును కలిగించుటకు ఇష్టపడక తన మకామును కుంభకోణమునకు మార్చాడు.ఆ ఊరి ప్రజలను సైతము జూదములో గెలిచి అన్న సంతర్పనమును నిరాటంకముగా సాగించాడు. చేసేది ఈశ్వరారాధనా.ఈశ్వరభక్తులను ఈశ్వరులుగా భావిస్తూ పరమానందముతో,పరమ భక్తితో చేయు అన్న సంతర్పణము. కాని,అన్న సంతర్పనమునలు ఆధారమైనది అభ్యంతరకరమైన జూద సంపాదన. ఇది పాపమా/పుణ్యమా అను ధర్మ సంకటము. సమాధానము తోచని సందేహము. నిష్కల్మష భక్తి నిధనపతిని మెప్పించినది.నిర్వాణమును ఇప్పించినది. జూదగాడిని మెచ్చిన వేదపురీశ్వరుడు నాయనారును కటాక్షించి,శిలారూపములో తన దగ్గర నిలుపుకున్నాడు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...