Tuesday, November 23, 2021

SOMASIRA MAARAN NAYANAR

సోమశిర నాయనారు ******* " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం." శివుని కరుణ అర్థముకానిది కాని అద్భుతమైనది. " యజ్" అను ధాతువుకు ఆరాధనచేయువాడు/అర్పణమును చేయువాడు అను అర్థమును కనుక గమనిస్తే యజ్ అను కర్త చేయు కార్యమును యజ్ఞముగాపరిగణింపవచ్చును.అగ్నిసాక్షిగా,అగ్ని సహాయమును కోరుతూ,యాగాగ్నిని ఉద్దీపింపచేసి అర్చించే వైదిక కార్యక్రమము. ఇందులో అగ్నిహోత్రుడు మనము అర్పించిన పదార్థములను దైవసమర్పణ మునకు అనుకూలమగు హవిస్సుగా మార్చి వారికి అందచేస్తాడు.వారు హవిస్సును స్వీకరించి ఆశీస్సులతో సుభిక్షమును కలుగచేస్తారు. ఇక్కడ మహేశ్వరత్వమే మహేంద్రత్వము.అది పరిపూర్ణమైనది విరాత్పురుషుని అవయవములే దేవతలుగా మనచే పిలువబడు శక్తులు.మహేశ్వరుడు కరుణాంతరంగుడై కర్తవ్యపాలనకై కొన్ని శక్తులను తననుండి ఆవిర్భవింపచేసి,వాటికి చేయవలసిన పనులను-విధానమును ఆదేశించి,వాటిచే అమలు చేయిస్తున్నాడు.సాధకుల ప్రయత్నములను (యజ్ఞములను) సమర్థవంతము చేస్తున్నాడు .ఈ విషయమును గ్రహించిన జిజ్ఞాసువులు తమ యజ్ఞ హవిస్సులను,తమ మనస్సులను,తమ సాధనలను బీజమైన వానికి-ఫలప్రదము చేయువారికి సగము సగము సవినయముగా సమర్పించుచున్నారు. యజ్ఞప్రక్రియలు బహువిధములు గా భాసిల్లుతూ బహుళార్థ ప్రయోజనములనందించుచున్నవి.అట్టివానిలో ఒకటి సోమరసమును హవిస్సుగా అర్పిస్తూ,వేదమంత్రములతో అగ్నిసాక్షిగా చేయు వైదిక ప్రక్రియ.సోమలతలు ముంజవత పర్వతములో ఆవిర్భవించినవని ఒక దివ్య పక్షి ద్వారా సోమలతలు స్వర్గమునుంది భూ మికి తేబడినవని ఋగ్వేదములో చెప్పబడినది.వీటి ఆకులను అరచేతిలో పెట్టుకుని రసమును తీసి దేవతలకు హవిస్సుగా అర్పించే విధానమును సోమసి అని అంటారు. స-ఉమ-సోమ ఆరాధనా అగ్నికార్యము , " పూర్ణంచమే-పూర్ణతరంచమే అక్షితిశ్చమే-అన్నంచమే" అని చమకము యజ్ఞము యొక్క ప్రశస్తిని వివరిస్తున్నది. అంతే కాకుండా, " శక్వరీరంగుళయో దిశశ్చమే" అంటూ విరాత్పురుచుని వేల్లుగా గా దిక్కులు-విదిక్కులు తమ కార్యములను శక్తితో నిర్వర్తించును అన్న నమ్మకముతో సోమసి యజ్ఞమును నిష్కళంక మనముతో నియమానుసారముగా నిర్వర్తించు, సోమశిర నాయనారు, తిరువంబారులోని బ్రహ్మణ కుటుంబములో జన్మించెను.బ్రహ్మజ్ఞాని కనుక ప్రతిఒక్కరిలో బ్రహ్మమును దర్శించగలవాడు. మారన్ అను నామాంతరమును కలిగిన నాయనారు సోమసి అను యజ్ఞ/అగ్నికార్యమును అనన్య భక్తితో నిత్యము సలుపుటచే సోమసి/మన తెలుగులో సోమయాజిగా ప్రసిధ్ధికెక్కెను. సోమసి యజ్ఞ అనుగ్రహముగా పరిసరములు పరిశుభ్రమై,పర్యావరణము రోగనిరోధక శక్తితో రాజిల్లుచుండును. భూమాత అన్నముతో పాటు ఔషధములను కూడ అత్యంత అధికస్థాయిలో ఉత్పత్తి చేసే సామర్థ్యమును కలిగి ఉంటుంది.తత్ఫలితముగా అకలిదప్పులు అగుపడని ఆనందము అన్యాయమును-అపార్థములను దరికి రానీయదు. సోముని శిరమున ధరించిన వాని కరుణ మన నాయనారుని సుందరారుతో జత చేసింది.జనులను చైతన్యవంతులను చేసింది. సొమశిర నాయనారు కులవ్యవస్థను ధిక్కరించటం అప్పటి ఛాందసవాదులకు నచ్చలేదు.వారిని నమ్మించదలచాడు నాయనారు ద్వారా పరబ్రహ్మము.సుందరారు అరోగ్యమును సహకరించనీయలేదు. వారు నాయనారును పరీక్షించదలచి,యజ్ఞహవిస్సును పరమేశ్వరునికి నాయనారు తమ సోమసి ద్వారా అర్పించగలిగితే సర్వజనుల సమానత్వమును అంగీకరిస్తామన్నారు , కాదు కాదు అనిపించాడు అర్థనారీశ్వరుడు. అత్యంత భక్తితో ఆదిదేవునికి హవిస్సును అర్పించాడు నాయనారు.అంబతో సహా ప్రత్యక్షమై అందరిని అనుగ్రహించారు ఆదిదంపతులు. శివాజ్ఞ మేరకు శివచింతనతో నుండి అంత్యమున శివసాయుజ్యమును పొందిన మన నాయనారుని ఆశీర్వదించిన ఆదిదంప తులు మనలనందరిని అనిశము రక్షించెదరు గాక. అంబే శివే తిరువడిగలే శరణం ఏక బిల్వం శివార్పణం

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...