Tuesday, November 16, 2021
MANA KAMCHARA NAYANAR
మన కంచార నాయనారు
*******************
స్వార్థ సంహార సంకేతముగాగ గజచర్మము
శాశ్వతత్త్వ పునీతముగాగ గంగావతరణము
మనోవికార మర్దనము గద మన్మథ సంహరణము
మరువకే ఓ మనసా! శివ నామస్మరణము.
శ్రీ వేదసార శివస్తోత్రము.
కంచార-సఖుడు.
మన కంచార-మనసులో నిండిన సఖుడు.
పరమేశుని తన మనసులో నిండిన సఖునిగా భావించి పూజించుట వలన ఈ నాయనారు కంచార నాయనారు/మన కంచార నాయనారుగా ప్రసిధ్ధిపొందినాడు.(ఆంతరంగికము)
కాంచారూరు పట్టణములో భూస్వాముల కుటుంబమునందు జన్మించిన వాడగుటచే మన కాంచార నాయనారు అని కూడా భావిస్తారు.(బాహ్యము)
వంశానుగతముగా లభించిన/వారసత్వముగా లభించిన చోళ సేనా నాయకత్వమును వృత్తిగాను/
షడ్వర్గ సేనలను సమర్థవంతముగా శివభక్త పాదసేవార్పనమునకు పరమార్థవంతముగా పనిచేయించు ప్రవృత్తిగాను కాలమును సద్వినియోగము చేసుకునే వాడు.
మన నాయనారును శివానుగ్రహము గృహస్థాశ్రమములోనికి ప్రవేశింపచేసినది.
కాలముతో పాటుగా సాగుతున్న శివుని మాయాజాలము మనలను ఆశ-నిరాశలను ఊయలలో ఊగిస్తుంది కదా.
నాయనారు ఇంట ఊయలలో బిడ్డ ఊగే తరుణము కరుణను మరచినదా యన్నట్లుగా తాత్సారముచేస్తూ,శరణాగత రక్షకుని చరణసేవాసక్తతకు నాయనారును ఉపక్రమింపచేసినది.
అపుత్రస్య గతిః నాస్తి- అన్న ఆర్యోక్తి నాయనారుని అర్థిని చేసింది
.
పరమేశుని అనుగ్రహము పుణ్యవర్ధిని అను పుత్రిక పేర తరలివచ్చినది తల్లితండ్రుల కన్నులపండుగగా.అపురూప సౌందర్యరాశి.అతులిత సుగుణాల నిధి.పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా చిన్నతనమునుండియే శివభక్తి తత్పరతతో దినదినప్రవర్థమానమైనది.
పుణ్యవర్ధిని కపర్ది కరుణాలవాలమేమో తుమ్మెదరెక్కలవంటి నల్లని చిక్కని పొడవైన కేశపాశముతో
శుభలక్షణములతో నడయాడసాగెను.
కుమార్తెకు వివాహసమయమాసన్నమైనదని,తగిన శుభలక్షణుడైన,అయర్కోన్ కలికామ నాయనారు తో వివాహమును చేయ నాయనారు సంకల్పించెను.
మంగళతోరణములు,భూమియంత పీట-ఆకాశమంత పందిరి,అంగరంగ వైభవముల అలంకారములు,ఆనందముగా ఆడపెళ్ళివారు అన్ని పనులను జరుపుకుంటున్నారు.
అపరంజి పుణ్యవతిని పెళ్ళికూతురును చేయుటకు ముత్తైదువులు ఆయత్తమవుతున్నారు.
ముడికి అందని కేశములను చూసి మురిసిపోతున్నారు.నిడివితనమును చూపిస్తూ పొగుడుతున్నారు.కేశపాశము విరజిమ్ముతున్న సుగంధములకు తోడు
గా సుందరత్వమును అద్దుటకు తొందరపడుతున్నారు.మూడుపాయలుగా ముడులు లేకుండా విడదీసి జడను అల్లుతున్నారు.జడకుప్పెలను అలంకరించారు.ముత్యాల దండలను ముడిచారు నవరత్న హారములతో నగిషీలను అద్దారు.కన్నులు తిప్పుకోలేనంత కనికట్టు
నున్నది ఆమె వాలుజడ.ఇది బాహ్యము.
మూడు పాయలుగా విభజించుట అనగా దేవుడు జీవుడు ఆ రెండింటిని జతచేయు జగన్నాటక సూత్రధారుడు.జడ మూడుపాయలుగా విభజింపబడి యున్నప్పటికిని బాహ్య నేత్రములకు రెండుగా మాత్రమే కనిపించును.మూడవది ఉన్నప్పటికిని అది అవ్యక్తముగానే ఉంటుంది.
రాబోవు/జరుగబోవు సంఘటనకు దీనిని సూచనగా కనుక మనము అనుకుంటే ,
" నమో కపర్దినేచ-వ్యుప్తకేశాయచ"
నాయనారు మనసులో ఒకటే వెలితి.తన సఖుడు ఇంకా వధువును ఆశీర్వదించుటకు రాలేదు.వేయి కన్నులతో ఎదురుచూస్తున్నాడు ఏలినవాని రాకకై.
కదులుతున్నాడు కాముని కాల్చినవాడు.జటలను అందముగా ముడివేసుకున్నాడు.విభూతిని తీరుగా పూసుకున్నాడు.యజ్ఞోపవీతము సిధ్ధమైనది స్వామి ఆటకు పావుగా మారటానికి,కపాలమాలలు కదులుతున్నాయి కాగల లీలను చూడాలని.
రానే వచ్చాడు మహావ్రత శివయోగి
తేజో కిరణములను వికిరిస్తూ/వెదజల్లుతూ.
నాయనారు ఆనందమునకు అవధులు లేవు.సాదరముగా స్వాగతించాడు సఖుని.సమస్త ఉపచారములను సంతోషముగా/సంతృప్తిగా
చేశాడు.
.పుణ్యవతిని పాదనమస్కారమాచరించి,ఆశీర్వచనమును పొందుటకై పిలిచాడు.
పాములు మెడలో నున్నవాడు అదే అదననుకున్నాడు.కదిలి వచ్చింది పుణ్యవతి కళ్యాణమునకు పెళ్ళికూతురుగా ముస్తాబయి,కదులుతున్నది వయ్యారముగా వాలుజడ ఆటకు నాగినిలా.
పరమపూజ్య భావముతో పవిత్రపాదములకు వంగి నమస్కరించినది పుణ్యవతి.
వంగిన ఆమె వెనుకభాగమున సింగారముగా నున్న జడను మోహముతో చూస్తున్నాడు మోహినిని వెంబడించినవాడు.
ఎంతటి పరమాద్భుత దృశ్యము.కాముని చంపిన వాని మనసులో కోరిక వేడుక చేసుకుంటున్నది.నాయనారును వేడుకునేలా చేస్తున్నది.
స్వామి వధువును ఆశీర్వదించండి అన్నాడు నాయనారు.జడ చేస్తున్న చమత్కారమా లేక జటాధారి చేస్తున్న పరీక్షా రూపమా అన్నట్లుగా శివయోగి కదలక మెదలక ఉన్నాడు.
స్వామి నా ఆతిథ్యములోని లోపములను సవరించుకుంటాను.మీరు సంతుష్టాంతరంగులై మా సాలంకృత కన్యను ఆశీర్వదించండి శరణు శరణు అంటున్నాడు నాయనారు.
కరుణాంతరంగుడు తనకు కావలిసినది కోరుకొనుటకు ,నిశ్చయించుకొని,
మన కంచార,తో
నేను వ్రతదీక్షలో నున్నాను.ఆ దీక్షా సమయమున సుగంధ-సులక్షణ కేశ పాశముతో " పంచవటి" అను పవిత్ర యజ్ఞోపవీతమును నేను ధరించవలసి యున్నది.నీ కన్య పుణ్యవతి కేశపాశమును కనుక కత్తిరించి నాకు ఇచ్చివేస్తే నేను దాన్ని తీసుకుని,సంతోషముగా ఆశీర్వదించుతాను అన్నాడు అమాయకముగా.
మంగళకర సమయమున అమంగళము ప్రతిహతమగుగాక.
పుణ్యవతి జన్మసంస్కారమేమో,నాయనారు పుణ్యమేమో కాని ఏ మాత్రము సంశయించక తక్షణమే కేశములను కోసి వేసి ,అర్పించి,ఆశీర్వచనమును పొందినది..కేశపాశముతో పాటుగా అంతర్ధానమయ్యాడు క్లేశములను తొలగించువాడు.
పెళ్లి ఆగిపోయినది పేచీలతో.ధీటైన భక్తి ఆటను శుభప్రదము చేసినది.పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై పుణ్యవతికి సురుచిర సుగంధ కేశపాశమును ప్రసాదించి,పెండ్లి జరిపించి,నాయనారుకు ముక్తిని ప్రసాదించి,అనుగ్రహించినారు.
నమ్మిన నాయనారును అనుగ్రహించిన నాగరాజాభూషణుడు నగజను కూడి మనలనందరిని సంరక్షించును
గాక.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment