NA RUDRO RUDRAMARCHAYAET-21


 




  న రుద్రో రుద్రమర్చయేత్-21


  ***********************






ఓం నమ శివాయ-నిందాస్తుతి


****************


 నారి ఊడదీయమనగానే జారిపోవచేసావు


 అమ్ములు దాచేయమనిన గమ్మున దాచేసావు


 విల్లుకనబడకూడనిన వల్లె యని అన్నావు


 పినాకమే కానరాని పినాకపాణివి నీవు


 మంచపుకోడును కూడ కనిపించకుండ చేసావు


 ఖట్వాంగధారివైన ఖండోబా దేవుడవు


 పరశును మొద్దుచేయమంటే పదును తీసేసావు


 ఖండపరశు కానరాని పరమేశుడివి నీవు


 లేశమైన లేకుండా ఆశాపాశమును తీస్తావు


 పాశుపతాస్త్రములేని  పశుపతివి నీవు


 రుద్రములో చెప్పారని వద్దనక చేస్తుంటే


 తెలితక్కువంటారురా ఓ తిక్కశంకరా.




 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 ఘోరేభ్యో-అఘోరేభ్యో -రెండును తానైన రుద్రునకు నంస్కారములు.




 


  


  ప్రియమిత్రులారా ఈనాటి మన బిల్వార్చనను ఘోరస్వభావమైన "క్రోధము" పదమును అర్థమునుతెలుసుకునే ప్రయత్నముగా చేద్దాము.








పరమాద్భుతము రుద్రనమక ప్రారంభమే,






 " నమస్తే రుద్ర"మన్యవ" ఉతో త ఇషువ నమః


 నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యాముతతే నమః".


 ఉభయనమస్కార ఋక్కుతో మన్య శబ్ద ప్రస్తావనముతో క్రోథమును సంబోధించి,ప్రస్తుతించునవి.స్వామీ నీ ఘోర రూపమును ఉపసంహరించుకొని,శాంతుడవై అఘోర రూపివై అఖిలపాలనను కొనసాగింపుము. స్వామి ఆయుధములను పక్కకు పెట్టుట అంటే అఖిలజగములలో ధర్మము నాలుగు పాదములలో నుండుట-స్తుతి.




  నిజమునకు స్వామి క్రోధ ప్రకటనమునకు ఆయుధములు-వాని పక్కకుపెట్టమనుట ఒకలీల. .ఏ ఆయుధములేకనే తన త్రినేత్రముతో మన్మథుని మసి చేసిన స్వామిని ఆయుధములను పక్కకు మెట్టమనుట మన అమాయకత.






  ఆరు అంతరంగ శత్రువులలో రెండవది ఇది.కామము నెరవేరకపోతే క్రోథముగా రూపును మార్చుకుంటుంది.


 కోపము దరిచేరినను దానిని వదిలివేయు సమయమును పట్టి జనులను ఉత్తములు-మధ్యములు-అథములు -మూర్ఖులు అని వర్గీకరిస్తారు.ఎంత తక్కువ సమయములో విడిచివేయగలిగితే అంత  ఉన్నతులు.


   అదే విధముగా కోపమునకు దాగిన కారణము సైతము దాని మంచి-చెడ్డలను నిర్ణయిస్తుంది.


  మంచిపనికై వచ్చిన కోపము సాధనగా మారి సాధ్యులుగా చేస్తుంది.


   కోపము ప్రకటితము-నిక్షిప్తముగా కూడా ఉంటుంది.ఒక మంచి పనికై ప్రయోగింపబదే కోపము ప్రయోజనకారి అవుతుంది.దీనిని ప్రకటించినవారికి కోపము వశమై యుంటుంది.మరొక వర్గము వారు కోపమునకు వశులై ఉంటారు.


   రుద్ర నమక ప్రారంభమే మన్య శబ్దముతో ప్రారంభమగుట దాని విశిష్టతను తెలియచేస్తుంది.శాంతమును అర్థము చేసుకోవాలంటే కోపమును గుర్తించవలసినదే.




   రుద్రములో క్రోధ ప్రస్తావనము,ప్రారంభములోనే కాకుండా,


 10 వ అనువాకము -4వ మంత్రమునందు


 "మృడానో రుద్రో తనోమయః-కృధి క్షయద్వీరాయ"  స్వామి నీ కోపము మా పాపములను ప్రక్షాళనము చేయించుచున్నది.రుద్రా నీకు నమస్కారములు అంటున్నారు.


 10-వ అనువాకము-8వ మంత్రము


 " భీమం ఉపహత్నుం ఉగ్రం"


 


  ప్రళయకాలమునందు లోకములను లీనముచేసుకొనుటకు/సంహరించుటకు ఉగ్రరూపునిగా/ఘోరరూపునిగా మారుతున్న రుద్రునకు నమస్కారములు.


  10వ అనువాకము-9వ యజస్సు


 " పరిత్వేసహ్స్య" దుర్మతిః అను పదములలో కోపమును వర్ణిస్తూ,ఆ కోపమును మా అఘములను-పాపములను తొలగించును అని నమస్కరిస్తున్నారు.


 10వ అనువాకము-10 మంత్రము


 స్వామి మమ్ములను అనుగ్రహించి,


 కృత్తిం వసాన-పులిచర్మాంబరధారి


 స్వామి కోపము లోకకళ్యాణమునకే .నమో నమః.


  భక్తుని విషయమునకు వస్తే కోపముతో స్వామిని తన వెనుక పరుగులు తీయించిన మహాభాగ్యశాలి.




 "ధావతే సత్వానాం పతయే నమః" భక్తులను రక్షించుటకు భక్తుల వెనుక ,భక్తులతో పాటుగా,భక్తులచే తరుమబడుతూ లీలలను ప్రదర్శించు శివునకు నమస్కారములు.


 విరాల్ మిండ విశ్వమంతా పరమాత్మయే అను భావమును నమ్మువాడు.భగవంతునికి మిత్రుడు అన్న అర్థమును కూడా చెప్పుకుంటారు. విరాల్మిండ నాయనారు చేర రాజ్యములోని,చెంగన్నూరులో వ్యవసాయ భూస్వాముల కుటుంబము నందు జన్మించెను. విరాల్ మిండ అనగా సకలజీవులు సర్వేశ్వరుడే అను నమ్మువాడు.




  భగవంతుని సేవించాలంటే,దర్శించాలన్నా,భక్తుని అంతే భక్తిప్రపత్తులతో సేవించాలన్న నియమము కలవాడు. శివార్చన ఎంతటి మహాభాగ్యమో శివభక్తార్చనయు అంతే అని నమ్మువాడు. విరాల్మిండ యొక్క భక్తితత్పరతలను విశ్వవిఖ్యాతము చేయదలిచాడు విశ్వేశ్వరుడు.శివపుణ్యక్షేత్ర సందర్శనమనే మిషను కల్పించి నాయనారును ఉన్నచోటునుండి కదిలించాడు. ఉన్న స్థితి నుండి ఉన్నతస్థితికి చేర్చదలచిన ఉమాధవుని కరుణ ఊహాతీతము కదా.




    హర హర మహాదేవ శంభో శంకర మహద్భాగ్యమునందించుటకు తిరువారూరు లోని త్యాగరాజ కోవెలను రంగస్థములనుగా సిధ్ధపరిచాడు ముందుముందు త్యాగరాజుగా నాయనారుచే తరుమబడాలన్న ముచ్చటపడ్డ ముక్కంటి. సుందరారుకు అందమైన బాధ్యతను అప్పగించాడు చేయవలసినపనికి ప్రేరణముగా. సమయము వేచిచూస్తున్నది శివుని మాయను చూడటానికి వేయి కళ్ళతో. 


   సందర్భము తొందరపడుతోంది ముందుముందుకు జరుగుతూ. అతియారు/శివభక్తి తత్పరులు తహతహలాడుతున్నారు తపఃఫలముగా ధన్యతను పొందాలని దేవాశ్రయ మండపములో తమదైన రీతిలో. ప్రవేశించాడు విరాల్మిండ వినయముతో.పరవశించాడు అతియారులను చూసి నిశ్చలమతితో. సభక్తిపూర్వక నమస్కారములను చేశాడు.తనివితీరా దర్శిస్తూ తత్త్వమును సంభాషించాడు.సంతసిస్తున్నాడు.


  స్వామి పరీక్షా సమయమాసన్నమయినదేమో


 రానే వచ్చాడు సుందరారు హడావిడిగా.భక్తులకు నమస్కరించకుండా హడావిడిగా ఆలయములోనికి ప్రవేశించాడు.అతిక్రమించాడు పద్ధతిని.అది యే యుద్ధమునకు దారితీస్తుందో చూడాల్సినదే..


    భక్తి ఒక్కొక్కసారి చక్కని రూపుని దిద్దుకుంటూ,భక్తునిలోని పంతమును అమాంతము పెంచుట తనవంతు అనుకుంటుంది. నిప్పుకన్ను వాని ఆనను తప్పదు కదా. నాయనారు మనసులోనికి ప్రవేశించి,తన పనిని తాను చేసుకుపోతున్నది శివమాయ. సుందరారు హడావిడిని తప్ప అన్యమును ఆలోచించనీయ కుండా చేస్తున్నది విరాల్మిండను . త్యాగరాజ మండపము లోని అతియారులను సుందరారు దర్శించలేదు.పూజించను లేదు.అసలు పట్టించుకోనేలేదు. స్వామి దర్శనమునకై సరాసరి పరుగులు తీస్తున్నాడు.

 ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు బేసి నవ్వులవాడు.గుస గుసలు మొదలైనవి విరాల్మిండ మనసులో. పసలేని భక్తుడు సుందరారు అంటూ,కసి కసిగా క్రోధము ముందుకు వచ్చింది నాయనారు మనసులో నుంచి మాటలుగా. అది సుందరారు నియమపాలన ధిక్కారమో లేక, విరాల్మిండకు జరుగబోవు సత్కారమో, అదియును కాక ఆదిదేవుని చమత్కారమో!




 ఏమనగలవారము ఏలినవాడి కరుణను శివోహం-శివోహం. -సుందరారు తప్పిదమును  తాను మాత్రము క్షమించలేనని,ఆ స్థలమును-స్వామిని తిరిగి దర్శించనని పంతముతో,వందైపలై లో శివభక్తునిగా,సకల ఉపచారములను చేస్తూ ,సమారాధనలను చేస్తూ ,స్వగతములో మాత్రము తన పంతమునకు సాయముచేస్తూ ఉన్నాడు నాయనారు. సుందరారు తేవారములను సుమధురములుగా మనకు అందించాలనుకొన్నాడు ఆ సుందరేశ్వరుడు.నేరుగా అడిగేకన్నా,నేర్పుగా అందించాలని పరీక్షగా, ఒకనాడు అన్న సంతర్పణకు తిరువారూరునుండి విరాల్మిండ ఆతిథ్యమునకు వచ్చాడు భక్తుని విడిచి ఉండలేని తండ్రి.


 విరాల్మిండ తిరువారూరు నుండి వచ్చిన వారికి ఆతిధ్యమునీయకుండుటయే  కాక కష్టపెట్టి కసితీర్చుకునే వాడు పరమసాధ్వీమణి అయిన నాయనారు ధర్మపత్ని పతిని ఎదిరించలేక వచ్చిన వారికి హితము చెప్పి వెనుకకు పంపించేది. ఆ తల్లి త్యాగరాజును కూడా వివరములడిగి విషయమును వివరించి,వెనుదిరిగి పొమ్మని వేడుకుంటున్నది.


  ఎంత ఆటగాడివయ్యా శివా


   విననే విన్నాడు విరాల్మిండ.పంచేంద్రియములు ఎంతటి పుణ్యమును చేసుకున్నావో మించిన కరుణ వాటిని ముంచెత్తుతోంది.

 భయమును నటిస్తు పరుగును ప్రారంభించాడు పరమేశ్వరుడు.


 కన్ను తన వంతుగా వచ్చిన త్యాగరాజుని చూపిస్తోంది.వాక్కు తన వంతుగా పరుషములను పలికిస్తోంది.స్పర్శ వానిని పట్టుకొమ్మని ఉసిగొల్పుతోంది. భస్మాసురుని బారిన పడిన వాని వలె భవుడు దవుడు తీస్తున్నాడు.భక్తుడు వానిని పట్టుకుని మట్టుపెట్టుటకు వెంబడిస్తున్నాడు. చుట్టుకున్న మాయ గట్టుదాటి పోతున్నది. 


 శివుని కరుణ గుట్టు విప్పేస్తున్నది.రానని ప్రతిన బూనిన ప్రదేశమునకు రానే వచ్చాడు విరాల్మిండ.






      నాలోన శివుడు గలడు-నీలోన శివుడు గలడు నాలోన గల శివుడు నీలోన గల శివుడు లోకంబులేల గలడు కోరితే శోకంబు బాపగలడు." చిదానందరూపా- విరాల్మిండ నాయనారు ఎంతసేపు పరుగులుతీశారో-ఎంతమందిని అనుగ్రహించారో,ఎవరికి తెలుసు. పొలిమేరదాటాడు విరాల్మిండ త్యాగరాజును వెంబడిస్తూ. అద్భుతము.మహాద్భుతము.పరమాద్భుతము. పారిపోతున్న త్యాగరాజు పరమేశ్వరునిగా ప్రత్యక్షమయ్యడు.'

 పట్టు విడిచాడు వానిని పట్టుకోబోయినవాడు.పశ్చాత్తపడ్డాడు.పదములు వదలనన్నాడు.


  పాహి-పాహి అని సన్నుతిస్తూ,సుందరారు తో కలిసి అంత్యము వరకు అర్చిస్తూ,ధన్యుడైనాడు విరాల్మిండ నాయనారు . నాయనారును అనుగ్రహించిన నటరాజు మనలనందరిని తప్పక అనిశము కాపాడును గాక.


  మరొక కథా కథనముతో రేపటి బిల్వార్చనములో కలుసుకుందాము.


        ఏక బిల్వం శివార్పణం.









     .


 







     .

 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)