Saturday, September 16, 2023

KURYAAT KATAAKSHAMKALYAANI-08




   కుర్యాత్ కటాక్షం కళ్యాణి-08

   *************************




 ప్రార్థన

 ****





 వహత్యంబ స్తంబేర మదనుజ కుంభ ప్రకృతిభిః


 సమరబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికా


 కుచాభోగ బింబాధర రుచిభిరంత శబలితాం


 ప్రతాప వ్యామిశ్రాం పురదమయితః కీర్తిమివతే.





  శ్లోకము

  ****





  జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచసంభావ్య హార లతికా


  రంభాకరీంద్ర దంభాపహోరు గతి డింభా అనురంజితపదా


  శంభా ఉదార పరిరంభా కురాత్ పులక దంభానురాగ పిశునా


  శం భాసుర ఆభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా.


 స్తోత్ర పూర్వ పరిచయము

 ****************



        మహాకవి ఆరు శ్లోకములో అమ్మనుకోరినవరములకు భిన్నముగా ఏడవ శ్లోకములో ఉపాధి నైజమును వివరిస్తూ-ప్రత్యేకతను వ్యక్తి పరముగా ఎలా ఉపయోగపడుతుందో-అమ్మ పాదారవిందములనుచేర్చుటకు ఏకైక సాధనము సుమా అని తెలియచేశారు. 

   కాని అంత వేదాంతమును-పరమార్థమును సెలవిచ్చిన మహాకవి తరువాతి శ్లోకములో అమ్మ యొక్క కామరాజకూటమైన వక్షములను-వాటిపై ధరించినముత్యాలహారమును,శక్తికూటమైన ఊరువుల


వైభవమును స్తుతించారు. అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చిందా అన్న సందేహము అజ్ఞానమునకు కలుగక మానదు.


 కాదు-కాదు


.జగదంబ బీజాక్షరదాత-మహాకవి గ్రహీత.వారి రచనము పురోభివృద్ధి సూచకమే కాని తిరోధానము ఉండనిది కదా అని వివేకము హెచ్చరిస్తుంది.


 ప్రస్తుత శ్లోక పరిచయము.


***********************


  నిజమే.విజయమువివేకముదే.వ్యక్తివికాసమును సూచించిన మహాకవి విశ్వ వికసనమును సూచిస్తున్నారు.అదియును అమ్మ రూప-లావణ్య విభవమును సంకీర్తిస్తూ.


    జగదంబ 


 సర్వారుణ అనవద్యాంగి-సర్వాభరణభూషితా.


విశ్వమే ఆభరణములుగా-అలంకారముగాధరించిన "విశ్వభూషిణి" ఆ అమ్మలగన్న అమ్మ. 


 కనుకనే ఆదిశంకరులు సదాశివుడు తన నుండి విడివడి సర్వాంగ సుందరముగా పంచభూతములు-పంచతన్మాత్రలను అలంకరించుకుని,ఛిచ్చక్తిగా తేజరిల్లుతున్న అమ్మను చూస్తూ" ఆహో పురుషికా" అంటూ అభినందించారు.


  ముమ్మాటికిని సకల మంత్ర విశేషములే అమ్మధరించినవిగా ప్రకటింపబడుతున్న సర్వాభరణములు.బ్రహ్మాందమునందలి సకల చరాచర సమిష్టి రూపములే సర్వాభరణములు.


  అదేవిషయమును  ఆదిశంకరులు,


అమ్మవారి జఘనభాగ స్తోత్ర విషయములో,  హిమవంతుడు తన కుమార్తె కు అరణముగా/హరనముగా , విశాలమైన-గొప్పవైన కొండచరియలను కానుకగా ఇచ్చాడేమో  అన్నట్లుగా 


 "గురుత్వము విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజాత్


  నితంబాదాచ్చిద్య త్వయి హరణరూపేణ నిదధౌ" భావించారు..


 పద విన్యాసము


 ***********




1. జగదంబ-అర్థనారీశ్వరి-




 " శంకరార్థాంగ శరీరాయై నమోనమః"


  పిశునా-సూచనయైనది


  అనురాగ- పిశునా-


 అనురాగమునకు సూచనయైనది


  దంభ-అనురాగ-పిశునా


  గాఢమైన-అనురాగమునకు-సూచన యైనది


  పరిరంభ-దంభ-అనురాగ-పిశునా


  ఆలింగనమందు- గాఢమైన- అనురాగమునకు- సూచన యైనది.


  పులక-పరిరంభ-దంభ-అనురాగ-పిశునా


  పులకాంకితత-ఆలింగనమందు-మిక్కిలి-అనురాగమునకు -సూచన యైనది.


  ఉదార-పులక-పరిరంభ-దంభ-అనురాగ-పిశునా


 ఉత్కృష్టమైన//సాటిలేని- పులకాంకిత-ఆలింగనమందు-అనురాగమునకు -సూచనయైంది.


 విశ్వశ్రేయస్సే  ఆ ఉదార పులక-పరిరరంభ అనురాగ సూచనము.జగత్రక్షణమునము మిక్కిలి అనురాగము కలది ఆ పరమేశ్వరి.


 




  ప్రకాశ-విమర్శ రూపకలయికయే ఆ దివ్య పరిష్వంగము.


  జడశక్తి-చిచ్ఛక్తుల సంగమమే ఆ దివ్య పరిష్వంగము.


  బిందు-రూప మమైకత్వమే ఆ దివ్య పరిష్వంగము.


  జీవాత్మ-పరమాత్మ అద్వైతమే ఆ దివ్య పరిష్వంగము.


"భూతేశాలింగనోభూత పులకాంగై నమోనమః" అని కీర్తింపబడుచున్నది.




2.జగన్మాత-పాదపద్మములు

 ****************


 "పారిజాతగుణాధిక్య పదాంబుజాయై నమోనమః"


  సౌకుమార్యములో-సాముద్రికములో-సౌభాగ్యప్రదానములో పారిజాత కుసుమములను మించిన సుగుణములు కలవి తల్లి పాదపారిజాతములు.


 పదా-ప్రకాశించుచున్న పాదపద్మములు కలది


 అనురంజిత-పదా-/కరుణమనే అరుణిమతో ప్రకాశించుచున్న పాదపద్మములు కలది.


 గతి-అనురంజిత -పదా


 గమనముచే/అరుణిమతో-ప్రకాశించుచున్న-పాదపద్మములు కలది


 డింభ-గతి-అనురంజిత-పదా


 పసిపిల్లల సౌకుమార్యవంతమైన-నదకచే ఎరుపెక్కిన-కెందామరల వంటి పాద పద్మములు కలది


  కనుకనే


" పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమోనమః" అనికీర్తింపబడుచున్నది.


3.జగన్మాత-దివ్యభూషణ సందోహ రంజిత

  ***************************


 గుంభా-కూర్పుకలది


 ఆభరణ  గుంభా-ఆభరణముల కూర్పు కలది.


 భాసుర-ఆభరణ-గుంభా


 ప్రకాశిస్తున్న ఆభరణములకూర్పు కలది.


 లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 హారములవరుసలతో -ప్రకాశిస్తున్న-ఆభరణముల -కూర్పుకలది.(108)


 హార-హార-లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 ముత్యాల హారములతో ప్రకాశిస్తున్న-ఆభరణ సౌందర్య -కూర్పు కలది.


 సంభావ్య-హార-లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 సమున్నతమైన-ముత్యాల హార-ప్రకాశముతో-నేర్పుతో కూర్చబడిన సౌందర్యము కలది.


కుచ-సంభావ్య-హార లతికా-భాసుర-ఆభరణ-గుంభా


 స్తనసీమపై-సమున్నత.సమున్నతస్తన సీమపై-ప్రకాశిస్తున్న-ముత్యాల హార కూర్పు కల తల్లీ.


 స్థూల ముక్తా ఫలోదార సుహారాయై నమోనమః.


  అమ్మ నాసిక సూక్ష్మ మౌక్తిక బులాకీతో ప్రకాశిస్తున్నది.విశ్వపోషకమైన స్తనసీమ స్థూల ముక్తాహారముతో కాంతులీనుచున్నది.


సాధనతో సద్గతిని పొందిన సత్పురుషులను, అమ్మ తన హృదయసీమలో అలంకరించుకొనినది అని కూడా మరొక భావన.


 'వహత్యంతర్ముక్తాః శిశిరకర నిశ్వాస గలితః


  సమృద్ధ్యా యత్తాసం బహిరపిచ ముక్తావళిధరః"


 సౌందర్యలహరి.


స్వాతి కార్తె వర్షబిందువు సముద్ర ముత్యపుచిప్పలో బడి ఫలముగా  మారిన సమర్థవంతమైన/పరిపక్వతనొందిన.పరిణామముదాల్చిన ముత్యముల హారమును అమ్మ ధరించినది. 


 




 ముత్యములు ఆరువిధములుగా పెద్దలచే వర్గీకరింపబడినవి.అమ్మధరించినవి తల్లి /విశ్వ శ్వాస ప్రక్రియను సంకేతించిన/స్థితికార్యమును సూచించిన బులాకి ముత్యముగా సంకేతిస్తున్న చిన్నముత్యముగా ఆదిశంకరులు భావించారు.మహాకవి అమ్మ పయ్యెదపై ముత్యాల హారమును "స్థూల ముక్తా ఫలోదారమును" ఉదారమైన ఉత్కృష్తమైన ముత్యములను తన అనుపమానహృదయసీమపైధరించింది.


  నాసికాముత్యము శ్వాస (విశ్వ) సంకేతముగాభావిస్తే, స్థూలముక్తాఫల హారమును విశ్వ గుండె చప్పుడుగా మహాకవి భావించారేమో.


 కాలసంకేతముగా మరొకపాఠాంతరమును చెబుతారు.  ఎందరో ముక్త సంగులను అనుగ్రహించి శుద్ధసత్వ శోభితులుగా తన యెదపై ప్రకాశింపచేస్తున్నదని


 మరికొందరి భావన.


 "యద్భావం తద్భవతి"కదా. 






4."కరీంద్రాణాం శుండాన్ కనకకదళీ కాండ పటవీం


  ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపినిర్జిత్యభవతి."సౌందర్య లహరి.


4.జగదంబ-ఉరువుల శోభ


  ******************




 ఊరు-తొడలు కలిగినది


 అపహ-ఊరు


 అపహసించే-తొడలుకలది


 దంభ-అపహ-ఊరు


 గర్వమును-అపహసించే-తొడలుకలది


 కరీంద్రకర-దంభ-అపహ-ఊరు


 ఏనుగు తొండపు గర్వమును అపహసించే తొడలు కలది.


 రంభా-కరీంద్రకర-దంభ-అపహ-ఊరు


 అరటిబోదె మరియును ఏనుగు తొండము యొక్క పోలికను అపహసించే సౌందర్యము కలవి అమ్మ  ఉరువులు.


 గణపతిని/కుమారస్వామినికూర్చుండబెట్తుకొనునవి.మనలనుసైతము కూర్చుండబెట్టుకొని లాలించునవి అమ్మ ఊరువులు.




 చిదగ్ని కుండ సంభూత సుదేహాయ నమ






 


    తల్లిదివ్యమంగళ విగ్రహమును దర్శింపచేస్తున్నారు మహాకవి.


   హారలతికా-


 పరమేశ్వరి తన పయ్యెదపై పరమపవిత్రమైన ముత్యాల హారమును ధరించియున్నది.ఆ హారము దేవేంద్రుని ఐరావత కుంభస్థలమును పరిహసించుచున్నదా యన్నట్లున్న అమ్మ కుచకుంభముపై అలంకరింపబడి అతిశయించుచుచున్నది.


 ఆ హారములోని ముత్యములుసామాన్యమైనవి కావు కనుకనే వాటికి ఆ సౌభాగ్యము.

పరమేశ్వరుడు గజాసుర సంహారము వేళ వాని శరీరములోని అణువణువునకు లోక పూజత్వమును అనుగ్రహించిన వాని కుంభస్థలములోనుండి వెలువడినవి.అమ్మవారికి కానుకగా స్వామిచే బహూకరించబడినవి.


  సహజముగా అహంకారభరిత ప్రదేశమునుండి వెలువడినప్పటికిని వాటి పురాకృత పుణ్యమేమో కాని అవి అమ్మ స్పర్శను పొంది సత్వగుణసంశోభితములగుచున్నవి. 




:" గజాసుర కుంభస్థలము అహంకారభరితము.అమ్మ కుచకుంభస్థలము అవ్యాజ కరుణాభరితము."


.ఇక్కడ మనము అమ్మ హృదయ భావనను స్వీకరించకలగాలి.ఏ విధముగా ముత్యములు /ముక్తసంగులు


  అనుగ్రహ సంకేతములుగా మారినవో అదేవిధముగా మన చిత్త వికారము సైతము చిత్త వికాసముగా పరిణామము చెందాలి.దానికి అమ్మ అనుగ్రహించాలి.




  ".అమ్మవారి వక్షోజ సందర్శనములో మనము ప్రతి రోజుస్వీకరించుచున్న ఆహార-పానీయములను దర్శించగలగాలి:".సత్వగుణశీలికి కాని ఆ దర్శనము లభించదు.


  అలంకార (మౌక్తికశాస్త్ర) శాస్త్ర ప్రకారము,ముత్యములు ఏనుగు కుంభస్థల నుండి,వెదురు నుండి,పాముపడగ నుండి,మేఘముల నుండి,(స్వాతిచినుకు) ముత్యపు చిప్ప నుండి,చెరుకుగడ నుండి వివిధవర్ణములతో,ఆకారములతో లభిస్తాయని పెద్దలు చెబుతారు.

    రంభాకరీంద్ర కర అంటూ,

 స్థూలముక్తఫలోదార సుహారయైన తల్లి కామరాజకూట కూటమును దర్శించచేసిన తరువాత,కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద్రవోరు ద్వయాన్వితను మహాకవి శక్తికూట దర్శనమును స్తుతిస్తున్నారు.

 శుభాంగియైన తల్లి ఉరువులు

1.నునుపు

2.గుండ్రనితనము

3.వెచ్చదనము

4.బరువు అను నాలుగు సాముద్రిక శుభలక్షణములకు నిర్వచనముగా నున్నవట.దయాంతరంగ యైన పరమేశ్వరి వాటిలోని నునుపును-గుండ్రనితనమును అరటిబోదెలకు,   (సౌకుమార్యము)వెచ్చన ,బరువును(సామర్థ్యమును)ఏనుగులకు  అనుగ్రహించినదా యన్నట్లు సంభావించబడుతున్నది.

 అలంకారికుల "ఊరు ద్వయమును" "ఉకార"-ఊకార" ద్వయముగావిభజించిరి.అమ్మమాతృకావర్ణరూపిణి.


 ఉకారము -


 అమ్మవారి కుడిఊరువుగాను-మార్దవ సంకేతము గాను భావించిరి.మానవ సృష్టి యందలి నాలుగు అందజ-బుద్బుజ-స్వేదజ-తదితర స్త్రీ-పురుష ప్రాణిని వర్గీకరణశక్తి గాను ఆరాధింతురు.

   ఊ కారమును-


 ఎడమఊరువుగాను,సౌభాగ్య చిహ్నముగాను-పంచభూతములు-మనోబుద్ధ్యహంకార  వర్గీకరణశక్తిగాను ఆరాధింతురు.


  శం-అనే పదమునకు అమరకోశము శాంతము-శుభము-శాస్త్రము-కీర్తి-స్వర్గము-శివుడు-శ్రేయస్సు-శక్తి-సుందరము మొదలగు భావమును విశ్లేషించినది.


  శం-సదా దిశతు-తల్లి తల్లి తనకృపావీక్షణములను నాపై ఎల్లప్పుడుప్రసరిస్తూ శం ను అనుగ్రహించును గాక.ఇది యొక అర్థము.


 సదా దిశతు-ఎల్లవేళల నన్ను సంతుష్టునిగా  అనుగ్రహించును గాక-ఇది ఒక అర్థము. 


2.సత్+ఆదిశతు


  సత్తు అనగా నిర్మలము-నిరాకారము-నిరంజనము-నిస్తులము అయిన ఒకేఒక సత్యము.అదియే పరబ్రహ్మము.


  పరమేశ్వరి కృపావీక్షణము నన్ను ఆ పరబ్రహ్మము వైపునకు నడిపించును గాక.ఇది పరమార్థము.


  ఎంత చక్కని కవితా చమత్కారము.


  అనన్వానయమైన ఆ నితాంత సచ్చిదానందము నన్ను అనుగ్రహించును గాక.

  కవితా చమత్కారము.

  ********************

  శంభుడు-శుంభుడు


      శంభుడు శుభంకరుడు కనుక అమ్మపరిష్వంగము లభించినది.

 ప్రతిజీవి శంకరుడు వానిలోనికి మాయ ప్రవేశించనంతవరకు.మాయమోహితుడైన వాని మనము ఎప్పుడు  కుటిలత్వమునకు దాసోహమవుతుందో,వాని స్వభావమునకు తగినట్లు వానినామముసైతము కొమ్మ్ను జతచేసుకుని శుంభనామిగా మారుతుంది.దానికి కావలిసినది అమ్మ ప్రసన్నత కాదు.ప్రహరణమే.

 అమ్మ వానిని సంస్కరించి తదుపరి సంహరిస్తుంది.


  మహాకవి డింభాను రంజిత పదా-అను దండాన్వయముతో తల్లి సౌకుమార్యమును,


  శుంభాసుర ప్రహరణా అను పదముతో శక్తి సామర్థములను సన్నుతించి,భావ మకరందముతో అమ్మను అభిషేకించారు.

జంభారి,కుంభాపహాసి,సంభావ్య,రంభాకరీంద్ర,దంభాప,డింభా,శంభా,పరిరంభా,దంభానురాగ,భాసుర,గుంభా,శుంభాసుర,పదములలో బిందుపూర్వక భా(0భా0 అను ప్రాసతో నాదభూషణములను అలంకరించారు.


    సర్వం శ్రీమాతాచరనారవిందార్పణమస్తు.

    అమ్మ దయతో  అర్చన కొనసాగుతుంది..







No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...