Wednesday, December 6, 2023

KADAA TVAAM PASYAEYAM-24





 



    కదా  త్వాం  పశ్యేయం-24



    *********************


 "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం


  నమామి భగవత్ పాదం  శంకరం లోక శంకరం"


  " నిత్యం  యోగి మనః సరోజదళ  సంచారక్షమస్త్వక్రమః


    శంభో తేన కథం కఠోర యమరాడ్వక్షః కవాట క్షతిః


    అత్యంతం  మృదులం త్వదంఘ్రియుగలం హా మే మనశ్చింతయ


    త్యేవత్ లోచన గోచరం కురువిభో హస్తేన సంవాహయే."


   స్వామి యోగుల మానసములలో సంచరించుటకు  అనుకూలములుగా నీ పాదపద్మములు ఎంత సున్నితముగా నున్నవోకదా/సుకుమారమైన నీ పాదపద్మములు ఆ బాలుని (మార్కండేయుని) రక్షించుట కు అతికఠినమైన హృదయముకల యముని ఛాతిని తన్ని ఎంత కందిపోయినవో.వాటిని ఈ అభాగ్యునకు గోచరము కానిచ్చినచో ...వానినికందనీయక నా చేతులలో అలంకరింపచేసి,సేవించుకుంటాను.


 " లోచన గోచరంకురు విభో" అని స్వామిని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.


  అందరు హుటాహుటిగా మోటబావి దగ్గరకు వెళ్లారు.అప్పుడే పొలమునకు నీరుచేర్చి,తన రెందు చేతులలో రెండు తామరపుష్పములను ధరించి,వాటి వంక చూస్తూ,మాట్లాడుతూ,కన్నీరు కారుస్తున్నాడు బ్రహ్మయ్య.


  వినబడలేదేమో వీరి అడుగుల చప్పుడు ,శివా! నన్ను క్షమించు అంటూ తన శిరమును ఆ పూవులపై సుతారముగా ఆనించి అశ్రువులతో అభిషేకము చేస్తున్నాడు. 


   విస్తుబోయి చూస్తున్నారు వారు,


 అంతలో గిరిజ దగ్గరగా వెళ్లి మీరు ఎందుకు పద్మములను చేతిలో పట్టుకుని ఉన్నారు.తలను వాటిపై తాకిస్తున్నారు అని అడిగింది ధైర్యముగా.


  తలెత్తిచూశాడు బ్రహ్మయ్య.తన 

 గురించిచెప్పాలనుకున్నాడు.పద్మములను ఒక పీటపై పెట్టి,వారి దగ్గరకు వచ్చాడు.




 అవి పద్మములు కావమ్మ.నా శివయ్య పాదపద్మములు.ఎంత కందిపోయినాయోచూడు.అందుకే వాటికింద నా అరచేతులను రక్షణగా పెడుతున్నాను అన్నాడు.



 వెంటనే  వాదన చేసిన మొదటి బాలుడు ,ఆ శివయ్యనే నీ ఐదవ తలను గిల్లివేసాడుకదా.


నిన్ను బాధించిన వానిని నీవు సేవిస్తున్నావా!ఎంత అమాయకుడివి అన్నాడు రోషముగా.


  దానికి నవ్వుతో ,


 నిజమే నాకు ఇంతకు ముందు అయిదు  తలలున్న మాటనిజమే.ఆ పరమ శివునికికూడా ఐదు తలలున్నాయికదా.అందుకు ఆయనను నేనేమి గొప్పవానిగా భావించలేదు.


 మన అందరికి అమ్మ అయిన జగన్మాత నాకు-విష్ణువుకు-రుద్రునకు మూడు పనులను అప్పగించింది.


 నేను సృష్టి చేయాలి.విష్ణువు స్థితికర్త/పోషించాలి.రుద్రుడు లయము చేయాలి అన్నది తల్లి.


 మొట్టమొదటి పని నన్నే చేయమంది కనుక నేనే గొప్పవాడనని నా ఐదవ తల చెప్పింది.ఈ నాలుగు తలలు మాత్రము నిజము కాదనిచెప్పాయి.


 కాని నాకు ఐదవ తలమాట బాగా నచ్చింది.ఆ మాట నాలో గర్వం సైతం తెచ్చింది.


 నా ముందు వాళ్ళిద్దరు ఎంత? అసలు నేను సృష్టి చేస్తేనే కదా వాళ్ళు పనిచేయగలగటం?లేకపోతే  ...


 అంటుండే వాణ్ణి.


 అప్పుడు అడిగాడు ఆ బాలుడు.అందుకేనా  పాపం,



 బ్రహ్మయ్య ఏమిచెబుతాడో అంటూ రెండో బాలుడు కూడ వచ్చాడు అక్కడికి.


 పెద్దవాళ్ళు అలా మాట్లాదవద్దన్నారు కాని నా ఐదవతల మాత్రము అహంకారముతో అట్లాగే మాట్లాడమనేది.


  అందుకా దానిని శివుడు గిల్లింది? అనగానే,


 ఇంకా ఇంకా చాలా చాలా తప్పులుచేసింది ఆ తల.


 మా అమ్మ పార్వతి ఐదు తలల కారణముగా గా నన్ను శివుడు అనుకుని పాదపూజ చేస్తోంది.తప్పు అని తెలిసినా నేను మురిసిపోతూ  ఉండిపోయాను.


 ఇంకా,


 నేను ఒక అందమైన అమ్మాయిని సృష్టించాను.ఆమెను పెళ్ళిచేసుకోమని వెంబడించాను తప్పుకదా .ఆమె భయపడి "సరస్వతి నది"గా మారి ప్రవహించసాగినది. 


 నా ఐదవతల తప్పుడు మాటలు పలికింది.తప్పుడు పనులు  చేసింది.తప్పుడు ఆలోచనలను ప్రోత్సహించింది.


 ఇదిగో ఈ పొలములో పెరుగుతున్న కలుపుమొక్కలా.ఇది ఉంటే పంట సరిగా పండదు కదా.అందుకు దీనిని తీసివేస్తారు.నేను మంచి నడవడితో ఉండాలంటే,నా ఐదవ తల అనే కలుపు మొక్కను తీసేయాలిగా అన్నాడు.అందరు అవునన్నట్లు తలను పంకించారు.


   ఆ తల  ఇప్పుడు  ఎక్కడ ఉంది? అడిగింది గిరిజ.



 అదానేలమీద పడితే నష్టమని చాలాకాలం మా శివయ్య దానిని భిక్షాపాత్రను చేసుకుని అరచేతిలోనే పెట్టుకుని తిరిగాడు.స్వామి కర స్పర్శతో దాని పాపాలు పోయాయి.అదే మీరు విన్న "బ్రహ్మకపాల క్షేత్రం" అంటూ ,వెనుదిరిగి,కళ్ళు మూసుకుని,

 స్తోత్రమును ప్రారంభించాడు.




( మనమక్కడ ఉంటే ఇంత నిర్భయముగా తనమనోభావాలను చెప్పగలిగేవాడు కాదేమో.శివాజ్ఞ చిన్నారుల ముందు చిత్త ప్రాయశ్చిత్తమును చేయించింది అంటూ పిల్లలతో సహా వెను తిరుగుతుండగా),శ్రావ్యంగా బ్రహ్మయ్య,


 " భూదారతా ముదవహద్య దపేక్షయా శ్రీః


   భూదార ఏవ కిమతః సుమతే లభస్య


   కేదార మాకలిత ముక్తి మహౌషధీనాం


   పాదారవింద భజనం పరమేశ్వరస్యః" ఆలపిస్తున్నాదు.శివయ్య ఆలకిస్తున్నాడు. 


 కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.


    'తన్మై మనః శివ సంకల్పమస్తు


     వాచే మమశివపంచాక్షరస్తు


     మనసే మమ శివభావాత్మ మస్తు".


     పాహిమాం  పరమేశ్వరా.


    (ఏక బిల్వం  శివార్పణం)





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...