tTOMMIDAVA AAVARANA-SARVANAMDAMAYA CHAKRAMU AMTE?


 


 హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌః క్లీం కళాం భిభ్రతీం

 సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్జ్వలాం

 వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్జ్వలాం

 త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం.


 ఇప్పటిదాకా నాప్రయాణములో జరిగిన వింతలు ఇప్పుడు మనము ఎక్కడికి వెళుతున్నాము అని ప్రశ్నిస్తున్నాయి.

 "మూలప్రకృతిరవ్యకా వ్యక్తావ్యక్త స్వరూపిణి

  వ్యాపినీవివిధాకారా విద్యావిద్యా స్వరూపిణి" గా అమ్మ అనుగ్రహిస్తున్నది.ఇప్పటివరకు మనము అమ్మ యొక్క వ్యక్తరూపమును-విస్తరన వైభవమును దర్శించాము.ఇప్పుడు,

 నేను అని నేను భ్రమించిన ఉపాధి,నాలోని నేనుని కనుగొని అవ్యక్తముగా/బిందురూపముగా నున్న "సర్వానందమయ చక్రములోనికి"

ప్రవేశిస్తున్నది.నేను ఇంతవరకు దర్శించిన యోగినీ మాతలు,సిద్ధి మాతలు,ముద్రా మాతలు,చక్రేశ్వరులు ,శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి" అని కీర్తిస్తూ ఆ పూర్ణ బిందువులో లీనమయిపోతున్నారు.

  ఆవరనములు సైతము అంతర్ధానమయిపోయినాయి.

   అంతలోని నన్నెవరో "శ్రీచక్రము అంటే" అని ప్రశ్నిస్తున్నారు.

  అమ్మదయ ఉంటే అర్థము కానిదేముంటుంది.

  

   అనేకానేక శక్తుల నిరంతర కలయికయే చక్రము.అది సత్యము-శివము-సుందరము,శ్+ఋ-ఈం అను మూడు బీజాక్షముల మిళితము.సంపత్ప్రదము.అమ్మ విమర్శశక్తిగా తాను విస్తరిస్తూ మనలను పరిపాలిస్తుంది.

  అమ్మకు బిందువు నుండి విడివడి,కామకళ అను నామముతో తన ప్రకాశమును తాను చూస్తున్నప్పుడు ఏర్పడిన వలయములే చక్రాకారముగా ఏర్పడినవి  అని సనాతనము విశ్వసిస్తున్నది.

   శూన్యము అనుకునే బిందువును పూర్ణము చేశే శివశక్తుల "మిశ్రబిందువు" నుండి అమ్మ ఎందుకు విడివడుతుంది?

    చేతనులు మూడు శరీరములను కలిగియుంటారు.వాటితోనే జాగ్రత్-స్వప్న-సుషిప్తావస్థలను పొందగలుగుతున్నారు.

   ఆ మూడు శరీరములనే,

1 స్థూల శరీరము

2.సూక్ష్మ శరీరము

3.కారణ శరీరము అంటారు.

  మరణము స్థూల-సూక్ష్మ శరీరములను నశింపచేయగలదు కాని కారణ శరీరము తన కర్మల ఫలితములుగా ఏర్పడిన (పాప-పుణ్య)

సుఖ-దుఃఖములను అనుభవించుటకు ఎదురుచూస్తుంటుంది.సమయము-స్థలము ఉంటేనే సాధ్యపడే విషయము కనుక ఆ అమ్మలగన్న అమ్మ  వాత్సల్యముతో మనలను ఉద్ధరించుటకు పరంజ్యోతి ప్రకాశము నుండి,విడివడి,

 

"విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః"


  విమర్శరూపిణియై ఆకాశాది పంచభూత ప్రపంచనిర్మానము జరుపుతున్నది.ఆ సమయములో ప్రకాశరూపుడైన శివుడు సాక్షీభూతుడు.స్థిరశక్తిగా /అమ్మను చరాశక్తిగా ప్రకటింపచేస్తుంటాడు.


  అప్పటి వరకు వ్యక్తమై/విద్యయై/వియత్తుగా మారిని విమర్శ శక్తి బిందువులో లీనమై తాను సైతము అవ్యక్తమైపోతుంది.

  ఇక్కడ నామరూపములుండవు.హెచ్చుతగ్గులుండవు.సుఖదుఃఖములుండవు.అంతా ఒక్కటే.అంతా ఆనందమే.అరిషద్వర్గములను జయించిన ఆత్మానందము.

ద్వైతముతో ప్రారంభమైన నా ప్రయాణము అద్వైతరూపును ఆవిష్కరించుకున్నది.

 సర్వము ఆనందమయము.అభేదానందము.

 ఏ విధముగా నది తననామరూపములను త్యజించి సముద్రములో లీనమవుచున్నదో అదేరీతిలో నాఉపాధి సైతము తనస్వరూప-స్వభావములను  వదిలివేసినది.నేను అద్దములోబిందువుగా ప్రతిబింబిస్తున్నాను.అమ్మ-నాన్నలఒడిలో ఆనందముతో ఉన్నాను.


   



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)