Friday, September 6, 2024
GAM GAM GANESHA-2024
మహా గణపతిం మనసా స్మరామి********************************
నలుగురి మేలును కోరి,నలుగు ముద్దతో గౌరి,
పరమ శివుని స్మరియిస్తూ,"వరపుత్రుని" చేసినది.
సమరమైన చేయగలుగు సామర్థ్యపు కాపరి,
కర్తవ్యము శుభకర " కరివదనుని" చేసినది.
తల్లిని,తండ్రిని భక్తితో చుట్టిన బాలుని వైఖరి,
అగణిత వాత్సల్యముతో "గణనాథుని" చేసినది.
అహంకరించు అసురునిపై మోగించిన యుద్ధభేరి,
"ఏకదంతుని," "మూషిక వాహనుని" చేసింది.
మేరు పలకపై దంతపు ఘంటపు వ్రాత
మహా కావ్య నాటకాది ప్రియునిగా కీర్తించినది
పార్వతీ పరమేశ్వర పరిపూర్ణత్వము
విఘ్నములను తొలగించు వినాయకుని చేసినది.
అపహాస్యము చేసిన ఆ చంద్రుని తిక్క కుదిరి,
"భాద్రపద శుద్ధ చవితి" బహుళ ప్రాచుర్యము పొందినది.
.................
మట్టి ముద్దలో దప్పిక తీర్చు జలము,
జలములో దాగినది జ్వలనము అగు అనలము,
అనలమునకు సహాయము అనువైన అనిలము,
అనిలముపై ఆధారము సకల ప్రాణి జీవనము,
అలలతో ఆడునది ఆ పున్నమి ఆకాశము,
స్థూల,సూక్ష్మ తత్వముతో-భక్త సులభ వశత్వముతో,
పంచ భూతాత్మకముగా మా మంచిని కోరుచున్న,
మట్టి ముద్దతో ముద్దుగా మమేకమైనది నీ రూపు నేడు.
........................
ప్రణవ స్వరూపుడా ప్రణామములు మా అయ్యా,
పత్రిపూజలు అందుకొని పచ్చదనమును ఈయవయ్యా,
ఆవిరికుడుము ఆరగించి ఆరోగ్యమును ఈయవయ్యా,
బిడ్డలగు మా దరిచేరు అడ్డంకులు తొక్కవయ్యా,
మూషిక వాహనుడవై సామూహిక పూజలు అందుకోవయ్యా,
" ఓంకార మూర్తి " మంచికి "శ్రీకారము " చుట్టవయ్యా.
ఉత్సవాలు ప్రోత్సహించు-ఉత్త పూజలైనా సహించు,
కాని పనులు క్షమించు-కానుకలు అనుగ్రహించు,
వినతులు స్వీకరించు- వినుతులు స్వీకరించు,
పదిదినములు అందముగ పందిళ్ళలో పరవశించు,
పదికాలాలు నిండుగా ప్రతివారిని దీవించు.
పంపిచేస్తామయ్యా కనుల సొంపైన వేడుకగా,
మళ్ళీ మళ్లీ రమ్మంటూ కన్నీళ్ళ వీడ్కోలుగా,
మనసులోనే పూజిస్తూ-మళ్లీ సంవత్సరానికై,
మజ్జారే అనిపించే నిమజ్జనాలతో
అంతదాక,
దురాశకు ప్రతిరూపమన్న నీలాపనిందను
" దూరముచేసి",
చింత లేని చిన్ని ఎలుకగా మారి నేను
" గం గణపతయే నమ:" అంటు నీ చెంతనే ఉండనీ.
వినాయక చవితి శుభాకాంక్షలు
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment