Wednesday, February 28, 2018

SAUNDARYA LAHARI-23

 స్మరణ భక్తి

 పరమపావనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 చపలత్వముతో ఎగురుచున్న చేపవంటి నన్ను చూస్తూ
 కపటత్వముతో మింగనున్న  కొంగనుండి రక్షిస్తూ

 తప్పుడు పనులనే మునుగుతున్న ఉప్పెనలో నన్ను చూస్తూ
 చెప్పరాని దయతో తేలుతున్న  తెప్పవేసి  రక్షిస్తూ

 పాతాళములోని సుడిగుండములో  నన్ను చూస్తూ
 మాతవై  పడనీయక పైకిలాగి  రక్షిస్తూ

 వీక్షణమాత్రమైన పాదధూళి విస్తారణ కరుణగా
 విస్మయ పరచుచు నాలో  స్మరణభక్తియైన వేళ

 నీ మ్రోలనే  నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి  ఓ సౌందర్య లహరి.

" ప్రాతః స్మరామి లలితావదనారవిందం
 బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
 ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
 మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్"
  ఆది శంకరాచార్య స్మరణభక్తి కనక ధారలనే వర్షించి అమ్మ దయను అనుభూతిగ మలిచినది.నిరాటంక-నిశ్చల-నిర్విరామ భగవత్ తపనయే,ఎప్పుడు తల్లి దర్శన-సంభాషణ-అనుగ్రహ రసానుభూతిలో మునకలు వేయుచుండుటయే స్మరణము.ఒక విధముగా ఇది అనుభవము యొక్క అనుభూతిగా అనవరతము అనందడోలికలను ఊగుతుంటుంది.

  " అడిగో రామయ్య నా ఆ అడుగులు నా తండ్రివి-ఇదిగో శబరి-శబరి వస్తున్నానంటున్నవి"స్మరణ బత్తికి పరాకాష్ఠ.పామరతగా పైకి తోచినను పండిన భక్తి కదా!

    మందార మకరంద మరందమును గ్రోలించిన ప్రహ్లాదునిది చిరస్మరణీయ భక్తి. సర్వకాల సర్వావస్థలలో సహచరించుచు,సత్వగుణ శోభితమై, సదాశివ స్వరూపిణిని రూప స్మరణము-భావ స్మరణము-తాదాత్మ్య స్మరణముతో తల్లిని సేవించుబారిని బ్రోచు సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.   

SAUNDARYA LAHARI-22

కీర్తనము

 పరమ పావనమైన నీ  పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 పనులను చేయించుటకు పగటిపూట సూర్యునిగా
 అలసట తొలగించుటకు అమృతమూర్తి చంద్రునిగా

 ఆహారము అందించే ఆదిత్యుని రూపుగా
 ఆ జోలను తేలించే ఆ చంద్రుని చూపుగా

 కలతలు కనపడనీయని కాళికా రూపుగా
 మమతలు కరువు కానీయని మా తల్లి గౌరిగా

 అనవరతము ఏమరక అవనిలో అలరారుతున్న
 సూర్య-చంద్ర ప్రవర్తనలు సంకీర్తనములగు వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 నా  మానస విహారి ఓ సౌందర్య లహరి.


 "రమా వాణి సంసేవిత సకలే
  రాజరాజెశ్వరి రామ సహోదరి"
  భగవంతుని గుణగణములను యశోపూర్వకముగా గానముచేయుట సంకీర్తనము/కీర్తనా భక్తి.వశిన్యాది దేవతల అనుగ్రహముతోనే కీర్తనము సాధ్యమగును.

  అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్నవి 

 ఉచ్చారణ విధానమును పరిశీలించినపుడు అక్షరములు హ్రస్వ-దీర్ఘ-ప్లుతములుగాను,తిరిగి ఒక్కొక్కటి,ఉదాత్త-అనుదాత్త-స్వరముగాను తొమ్మిది విధములుగా మారుతాయి.ఈ తొమ్మిది విధముల ఉచ్చారణ అను నాసికముగాను,నిరను నాసికముగాను (ముక్కు సహాయముతో-ముక్కు సాయములేకుండా) పలుకుచుండుట వలన తొమ్మిదిని రెండు తో హెచ్చవేసిన పద్దెనిమిది విధానములే అష్టాదశ శక్తిపీఠములు.(వివరించిన శ్రీ సామవేదము వారికి పాదాభివందనములు.)

   నారదుడు-తుంబురుడు,త్యాగయ్య,ముత్తుస్వాము దీక్షితారు,శ్రీ శ్యామ శాస్త్రి ఇలాఎందరో మహానుభావులు సంకీర్తనా భక్తులుగా చిరస్మరణీయులైనారు.

   తల్లి లక్ష్మి-సరస్వతులు స్తుతించుచుండగా విరాజిల్లుచున్నది.వారు రామ సహోదరి అని కీర్తించుచున్నారు.అంత ఉత్తమమైనదా రామ అను శబ్దము అను సందేహము వస్తే అవుననే అనాలి."రమయాతీత ఇతి రామః" అన్నారు పెద్దలు.రమింపచేయునది రామ అను పవిత్ర నామము.అదే లక్షణముతో తల్లి రాజరాజేశ్వరి " నామ పారాయణ ప్రీత్య" గా భాసిల్లుచున్నది.నామమును కీర్తించుటలో ఇక్కడ ప్రీత్ ఎవరికి కలుగుతోంది? మనకా లేక అమ్మకా? మొదట మనము అమ్మకు అనుకొంటూ క్రమేణా మనమే నామస్మరణలో ప్రీతిని ఆస్వాదించగలుగుతాము.అంతటి దయను వర్షించునది అమ్మ అని కీర్తించుచున్న భక్తులను అమ్మ అనుగ్రహించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.   

SAUNDARYA LAHARI-21



  పరమ పావనమైన  నీ పాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 ముల్లోకములు నిన్నుముదముతో నుతియింప
 శుకములు పరుగిడుచున్నవి స్తుతులను వినిపించగ

 ప్రియముగ విని తాముయు పులకించవలెనని
 తరియించగలమని కర్ణముల తాటంకములు ఆడె

 ఆ కర్ణాంత నయనములు ఆ దారినే సాగగా
 అటు-ఇటు పోలేని అసహాయపు నయనము

 అందపు కెందామరాయె  చేరి నీ అనునయము
 హర్షాతిరేకముతో శ్రవణ భక్తియైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!

అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.వాటిలోని శ్రవణభక్తి అనగా, మనదశ ఇంద్రియములోని చెవి ప్రధానముగా సహాయపడుతుంది."విష్ణునాకర్ణించు వీనులు వీనులు అని పోతనకవి చెవులు దైవ సంబంధమైన కథలను వినుట వలన ధన్యమవునన్నారు.వినవలెన్న వాకును అనుగ్రహించుటకు  మరొక ఇంద్రియమైన నాలుక సహకరించవలెను.వాక్కు-శ్రవణము పరస్పర ఆధారములై పరమేశ్వరిని సేవిస్తాయి.ఇదేవిధముగ దృశ్యము-నయనము,చర్మము-స్పర్శ,పరిమళము-నాసిక,ఆహారము-జిహ్వ పరస్పరము సహకరించుకొనుట మనకు తెలిసిన విషయమే.శ్రవణములో వాయువు కూడ ప్రధాన
వాహకముగా మారి,శబ్దమును వాయుతరంగములుగా తిరిగి శబ్ద తరంగములుగా సహాయము చేస్తుంటుంది.శ్రవణము వలనననే .పరిక్షిన్మహారాజు శుకయోగిచే వివరించబడిన శ్రీమద్భాగవత కథవలన ,కృతకృత్యుడైనాడట.

   అమ్మ మహిమలు అద్భుతకథలుగా ప్రతినోట ప్రణవమై వినబడుచుండగా అమ్మకు ఆ విషయమును తెలియచేయుటకు చిలుకలు కులుకులతో వస్తుండగా,అమ్మ చెవికి ధరించిన కుండలములు తామును వినిసంతసించవచ్చని పరవశమున కదులుతున్నవట.కుండలముల కులుకులను చూసిన అమ్మ రెండు నయనములు ( ఆ కర్ణాంతములు) చెవుల వరకు వ్యాపించసాగినవట.కాని మూసి ఉంచిన మూడోకన్ను,అటుఇటు కదలలేక స్తుతులను వినలేనన్న దిగులుతో నుండగా,అమ్మ అనునయముతో ,సంతసమున ఎర్రకలువగా వెల్లివిరియుచున్న సమయమున ,చెంతనే నున్న  నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(శ్రవణమునకై తహతహ లాడిన తల్లి త్రినయనము మనలను కాపాడు గాక)
  . 
  

SAUNDARYA LAHARI-20

  సౌందర్య లహరి-20

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  బ్రహ్మాది దేవతలు బహువిధముల భజియింతురు
  ఋషి పుంగవులు నీ కృపకై తపియింతురు

  ముని గణములు అగణిత గుణగణములు కీర్తింతురు
  భాగవతోత్తములు పరవశించి నర్తింతురు

  సిద్ధ పురుషులు రససిద్ధిలో తేలియాడెదరు
  ఇష్టి చేయుచు కొందరు ,ఇష్టాగోష్టితో కొందరు

  ప్రవచనములతో కొందరు పరవశమగుచుందురు
  భగవతత్త్వము  బహువిధ భక్తోపచారములగు వేళ

  నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి !ఓ సౌందర్యలహరి.

   భగవత్వము/భగవతత్త్వమునందు కల ఆసక్తిభక్తి అనబడును.అజరామరము,యశము,భోగము,అనురాగము,ఆశ్రిత రక్షణము నిర్గుణము,నిష్కళంకము మొదలగు శుభగుణములు కలది. స్వ్యంప్రకటితమగు భగవతత్త్వము స్వధర్మాచరణుల సాగ్త్యముగా మారుతుంది.స్వ-పర  విభేదములు లేని ఆత్మానంద స్థితికి ఆలవాలమవుతుంది.మననము చేయువారు మునులు.దర్శనము చేయగలవారు ఋషులు.పరబ్రహ్మము గురించి ఆనందానుభూతిలో మమేకమగువారు రస సిద్ధులు.సిద్ధించిన అనుగ్రహము కలవారు.కొందరు యాగములు(ఇష్టి) చేయుచు,మరికొందరు మంచిమాటలు ముచ్చటిస్తు,మరి కొందరు పామరులు సైతము పరమాత్మను తెలుసుకొనగల విధముగా ప్రవచనములను చేయుచు తమకు నచ్చినరీతిలో భక్తులుగా భగవతికి దగ్గరగా ఉండగలుగుతున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

  (భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉంది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం)

   జగజ్జనని దయతో  వాని గురించి తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

SSUNDSRYS LSHSRI-19

సౌందర్య లహరి-19
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
నామది కొండకోనయైన వేళ గిరిజాదేవిగ
సంసారసాగరమున మునిగిన సాగరకన్యకగ
పెద్దయుద్ధ సమయమున కాళికా మాతగ
భయభ్రాంతమైనవేళ వారాహిదేవిగా
విచారములు తొలగించగ వైష్ణవి మాతగ
శత్రుసమాగమ వేళ ఆనందభైరవిగ
సర్వకాల సర్వ అవస్థల యందు సత్ చిత్ రూపిణిగా
సర్వ వ్యాపకత్వము సర్వ శక్త్యోపచారములైన వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" నీ దరినున్న తొలగు భయాలు-నీ దయలున్న కలుగు జయాలు"
శక్తి స్థూల సూక్ష్మములుగా సమయానుసారముగా సకల్ శాంతి సౌఖ్యములను ప్రసాదిస్తు జగతిని పరిపాలిస్తు ఉంటుంది.అమ్మకు సమీపముగ (ఉప-సమీపము-చారము-చరించగలిగే సౌభాగ్యము) ఉండి సేవించుకొనుచు పరవశించు అదృష్టమే ఉపచారము.శక్తోపచారములు అనగా తల్లికి మన శక్తి కొద్ది చేసే సేవలు అనునది బాహ్యార్థము.కాని కొంచము నిశితముగా ఆలోచిస్తే అమ్మ మనము పరస్పరము ఒకరిదగ్గరగా మరొకరు వసిస్తు తాదాత్మ్యతను పొందే సుకృతము.
ఆది పరాశక్తి మన ఆకలికి ఆహారమై,శ్రమకు విశ్రాంతియై,చీకటికి వెలుతురై,రోగమునకు ఔషధమై,సమస్యకు పరిష్కారమై,కంటికి రెప్పయై కాపాడుచు,భక్తులను ఆనందపరచుటకై సర్వ ఉపచారములను అందుకొనుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Monday, February 26, 2018

SAUNDARYA LAHARI-18

   సౌందర్య లహరి-18

  పరమపావనమైన   నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  అనంతము అవ్యయము అద్భుతము అయిన తల్లి
  పద్మకోశములో నిలిచి  ప్రకాశించుచున్నదని

  అనేక నారులుగా సాగుతూ అలరారు చున్నదని
  ప్రధాన నార సూక్ష్మ రంధ్రములో ప్రజ్వలము తానని

  బహిర్ముఖమును వీడి అంతర్ముఖమైన నాలోని
  వైశ్వానర రూపమైన  మాహేశ్వరి కరుణతో

  నాలోనే ఉన్నదన్న  నగ్నసత్యము  తెలిసికొని
  నా  మాంస శరీరము మంత్రపుష్పమైన వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

" నీలతోయద మధ్య్స్థా విద్యుత్లేఖేన భాస్కరా!"

  మనసనే పుష్పమే మంత్ర పుష్పము.

  " పత్రం-పుష్పం-ఫలం-తోయం" భగవంతునికి భగవంతునికి భక్తితో సమర్పించిన ప్రీతిపాత్రములు అని భగవద్గీత పేర్కొన్నది.బిల్వ పత్రములు-తులసి దళములు-పువ్వులు-పండ్లు-జలము వీనిలో ఏ ఒక్కటి సమర్పించినను,వీలైతేఅన్ని సమర్పించినను పరమాత్మ /పరమేశ్వరి స్వీకరిస్తుంది.బాహ్య పుష్పములతో పాటు,మన అంతరంగమనే హృదయ కమలమును భక్తితో భగవంతుని దగ్గర నిలుపు ప్రక్రియయే మంత్రపుష్ప సమర్పణము.

  " మననాత్ త్రాయతే ఇతి మంత్రః"

  దైవాధీనం జగత్సర్వం-మంత్రాధీనం దైవతము అని ఆర్యోక్తి.పువ్వులు పంచేంద్రియములైన చెవులకు తుమ్మెద ఝుంకారమును (శబ్దమును) వినగలుగు శక్తిని కలిగియున్నవి.ఆ శక్తినిప్రసాదించిన భగవంతునికి కృతజ్ఞతగా పువ్వులను సమర్పించుట అని కూడా పెద్దలు వచించారు.

   నీలతోయము అన్నగా వర్షించుటకు సిద్ధముగా నున్ననల్లనైన మేఘము.దానిని వర్షింప చేయునది దానిలో కాంతిరేఖయై దాగిన కాంతి.ఆ కాంతి మనకు వర్ష సమయముగా మెరుపులుగా,దాని నాదము ఉరుములుగా గుర్తించగలిగితే ధన్యులమే.మంత్ర పుష్పములో జలము ఎక్కువగా ప్రస్తుతింపబడినది ఋఇగ్వేదములోని(తైత్తరీయ అనువాకం
 యోపా పుష్పము అని మనము విన్నదే.

  ఇంకా కొంచము అమ్మ దయ మనకు అర్థమయితే మన హృదయమలో తల్లి వికసించిన పద్మమువలె పరిమళించుచు,అనేక నారలుగా( పద్మములోని పొడవైనకాడలు) సాగి అన్ని అవయములకు శక్తిని ప్రసాదించుచు,ప్రధాన నార మధ్యలో నున్నసూక్ష్మ రంధ్రములో పైకి సాగుచున్న వైశ్వానర అగ్నియై మనలకు చేతనస్థిని అనుగ్రహిస్తున్నదని తెలుసుకొనిన తరువాత భక్తులు వారి శరీరము రక్త మాంశ మిశ్రతిమైనది మాత్రమే కాదు అని పరమాత్మ సూక్ష్మమైన మంత్రపు పువ్వు అని తెలుసుకొను చున్న సమయమున,చెంతనే నున్ననా చేతిని  విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-17

   సౌందర్య లహరి-17



  పరమపావనమైన నీపాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



  నీ విలాసపు కన్ను కైలాసపు దారిని చూపించింది

  సరస సల్లాపముగా భుజము తట్టి నడిపింది



  త్రికరణ శుద్ధిగా నీకు పూజను చేయించింది

  వేదన పడుచుండగా వీడలేని విధముగా



  భక్తి అనే పద్మమును నీ పాదపద్మములు చేర్చమంది

  నా ధ్యాసను మార్చేసి ధ్యానము చేయమంది



  ధ్యానము-ధ్యాస అను కుడి-ఎడమ అడుగులతో

  నా పాదములు భక్తితో ప్రదక్షిణము  చేయువేళ



 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా

 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 "యాని కానిచ పాపాని  జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణష్యంతి  ప్రదక్షిణ పదే పదే."

దీని అర్ధం "గతకాలంలో నేను చేసిన పాపాలు సమస్తమూ నేను ఈ ప్రదక్షణ చేయుచున్నప్పుడు వేయు ప్రతీ అడుగు తోను  నశించిపోవాలి, అని పెద్దలు చెబుతారు.

  ప్రదక్షిణమునే పరిక్రమము అని కూడ పిలుస్తారు.పరిక్రమము అనగా సిద్ధమగుట.మనము దేనికి సిద్ధమగుచున్నాము.ప్రదక్షిణమునకు.అనగా దక్షీన దిశగ నున్న మార్గములో పయనించుటకు.మనము ఎందుకు కుడి వైపునున్న మార్గమున మన పాదములను చప్పుడు కాకుండ అతి మీలగ దైవ ధ్యానముతో పయనిస్తాము? అంతే ,

   ప్రదక్షిణము చేయునపుడు మనము దైవమును స్మరిస్తు అన్ని ఉత్తమమైన ,ధర్మ బద్ధమైన పనులను చేయుదమని ప్రమాణముగ భావించుతాము కనుక సవ్యమైన కుడి వైపు నుండి మనప్రదక్షిణమును ప్రారంభిస్తాము.

  ప్రదక్షిణమును ఎందుకు వృత్తాకారముగా (గుండ్రముగా) తిరుగు చేస్తాము అన్న సందేహము మనకు రావచ్చును.ఒక కేంద్ర బిందువుచుట్టు వర్తులాకారముగా ప్రదక్షిణము చేయునపుడు ,ఆ దేవత భక్తులందరికి సమాన దూరములో ఉంటుంది కనుక దైవానుగ్రహము కూడా సమానముగానే ఉంటుంది.
  ప్రదక్షిణమును మూడు సార్లు ఎందుకు చేస్తారు అంటే ప్రతివారు ఆధ్యాత్మిక,ఆది దైవిక,ఆది భౌతిక తాపములచే బాధితుడు.వాని నుండి విముక్తుడు అగుటకు మూడు ప్రదక్షిణములు అని ఆర్యోక్తి.

 శారీరక మానసిక రుగ్మతలు ఆధ్యాత్మిక తాపము.ప్రకృతి వైరీత్యాల వలన కలుగు శారీరక తాపములు ఆది దైవికములు.తమ చుట్టు ఉన్న ప్రాణుల (కౄర మృగములు) దుష్టుల వలన కలిగే ఇబ్బందులు ఆది భౌతికములు.
   ప్రదక్షణము వీనిని తొలగించి,రక్షించును.

  ధ్వ్జ ప్రదక్షణము,పాద ప్రదక్షణము.నమస్కార ప్రదక్షణము,అంగ ప్రదక్షణము.యుగ్మ ప్రదక్షణము,ఆత్మ ప్రదక్షణము ఇలా ఎన్నో రకములు
  భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మకు ప్రదక్షిణము చేయు సమయమున,చెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.నమస్కారములు.





Sunday, February 25, 2018

SAUNDARYA LAHARI-16

 సౌందర్య లహరి-16





  పరమపావనమైన నీపాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



  నల్లనైన చీకట్లో నేను అల్లరులే చేస్తున్నా

  అల్లకల్లోలమైన మనసు నన్ను సన్నగా గిల్లుతోంది



  ఎర్రనైన కోపములో నేను వెర్రిపనులు చేస్తున్నా

  చిర్రు-బుర్రులాడు మనసు నన్ను గుర్రుగా చూస్తోంది



  తెల్లనైన తెలివితో నేను తెలిసికొనగ తప్పులన్నీ

  తెల్లబరచె నాలోని  తెలివి తక్కువతనాన్ని



  












  సత్వ-రజో-తమో   గుణములు సద్దుమణుగి, సత్వరముగ
 పరాత్పరికి కర్పుర హారతిగ అర్పణము యైన వేళ


నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 " అందరికన్న చక్కని తల్లికి సూర్య హారతి- అందాలేలె చల్లని తల్లికి చంద్ర హారతి"

  అథాంగ పూజలో ఒకటైన ఆత్మ రతి యే హారతి.జీవాత్మ పరమాత్మను దర్శించి మమేకమగుటయే హారతి లక్ష్యము.వత్తులను ఆవు నేతిలో ముంచి హారతి ఇచ్చుట ఒక పద్ధతి. వత్తుల సంఖ్యను బట్టి హారతులు వర్గీకరించబడినవి.వత్తుల హారతియే కాక,బిల్వ హారతి,సింహ హారతి,కుంభ హారతి,నంది హారతి,కుంభ హారతి

  నక్షత్ర హారతి ఇలా అనే హారతులను ఆ యా సందర్భానుసారముగ ఇస్తుంటారు.
  హారతి యొక్క నిర్వచనము భక్తుల యొక్క మానసిక స్థితినిబట్టి మారుతుంటుంది.తల్లికి దిష్టి తీస్తున్నట్లు కొందరు అనుకుంటే,జ్యోతి సహాయముతో పరంజ్యోతి దర్శనముగా మరికొందరు అనుకుంటారు.చీకటి తమోగుణ సంకేతమైతే దానిని తొలగించే వెలుగును ( నా తామస గుణము తొలగినడి.అతి స్వచ్చతతో ప్రకాశించే నా మనసును హారతిగా) ఇచ్చిననిన్ను చూచుటకు చర్మచక్షువులు అశక్తములు కనుక నీ తేజపు సూక్ష్మముగా,హారతిని వెలిగించి,దాని సహాయముతో ఆపాద మస్తకము దర్శించుకోనీ తల్లీ అని వేడుకొని,తరించుట.( దేవతా హారతి పాదములతో ప్రారంభమయి క్రమముగా ముఖారవిందమును సేవిస్తుంది.)

  ఇక కర్పుర హారతి పాపములను హరించివేసే స్వభావము కలది అని కొందరు అనుకుంటే మరికొందరు కర్పుర విశిష్టను తానుకరిగిపోతూ వెలుగు విరజిమ్ముటయే కాక హారతి అనంతరము ఏ మాత్రము తన అవశేషములను వదలక ఆత్మార్పణ అయే ఏకైక సుగంధ ద్రవ్యము.
వత్తుల హారతుల,మిగిలిన హారతుల విషయములో వెలుగులు జిమ్ముతాయి కాని కొన్ని అవశేషాలను మిగుల్చుతాయి.

   అగ్గి తన భక్తిని చాటగ అమ్మను చేరి ఆనందిస్తున్నదని,తానేమి తక్కువ కానని జలము చేరి ఆహారతినిచుట్టుతున్న వేళ,చెంతనే నున్న  నాచేతినివిడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.   



Saturday, February 24, 2018

SAUMDARYA LAHARI-15

సౌందర్య లహరి-15
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఆలియే సర్వస్వమ్మన్న వాడి దారి మళ్ళించింది
గొర్రెమేధ వానిని గొప్పకవిని చేసినది
కఠినబోయవానిని ఆదికవిని చేసినది
వివరము లేని వానిని వికట కవిని చేసినది
ఆనంద మయునిగా అన్నమయను చేసినది
మూక పంచశతి గ్రంథము నీ కృపచే వెలిసినది
ఉన్న పాటుగా వారిని ఉన్నతులుగ చేసినది
వారి వాంగ్మూలములు తాంబూలము అగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ! ఓ సౌందర్య లహరి.
" తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమప్రియ"
తాంబూల చర్వణముతో ప్రకాశించే తల్లీ అని స్తుతించబడుతున్నది.తాంబూలము అంటే,
" పూగీఫలం సంయుక్తం నాగవల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం"
కొందరు కర్పూర చూర్ణమునకు ముక్తాచూర్ణము అని కూడ స్తుతిస్తారు.ఇందులో ఉన్న పదార్థములన్ని దైవత్వ ప్రత్యేకతను కలిగినవి.
నాకవల్లీ క్రమముగ నాగవల్లీ గా వ్యవహరింపబడుతోంది.నాకము అనగా స్వర్గము కదా.వల్లీ అనదా తీగ.ఇంద్రుని ఐరావతమును కట్టిన స్తంభమునుండి నాగవల్లి తీగ తనంత తాను ఆవిర్భవించినదట.ఆ నాకవల్లి తీగ నుండి వచ్చు ఆకులే నాగవల్లి దళములు.అవే తమలపాకులు.
పూగిఫలము వక్కపండు.చిత్రములను మనము అంతర్జాలములో చూడ వచ్చును. ఇప్పుడు తమలపాకులో పూగి ఫలమును పెట్టి (దీనినే భోగి ఫలము అని కూడ అంటారు)అందులో కర్పూర చూర్ణమును/ముత్యాల చూర్ణమును(పొడి) కలిపి,అనేక దివ్య సుగంధములు,(అవి దైవ ప్రసాదములు కాని మనవ సృష్టి కాదు ) వేసినది శుభకర సంకేతమైనది తాంబూలము.అన్ని శుభకార్యములమును విశిష్టత కలిగినది.ఆదిశంకరుల వారు అమ్మవారి తాంబూలములో, తత్కోలము 32 ద్రవ్య సంయుతమై యుండవలెనని,వీలుకాని పల్షమున కనీసము 5 ,ఏలకులు-లవంగము-జాజికాయ-జాపత్రి-పచ్చ కర్పురమూను పంచతిక్త భరితమై సురభిళమై ఉండవలెనన్నారు.
అ జగజ్జనని మహానైవేద్యానంతరము ,భకులు అర్పించినతాంబూల చర్వణమునుచేయుచు,ఎర్రనైన కరుణతో వారిని అనుగ్రహించుచున్నసమయమున,చెంతనేనున్న నా చేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-14

సౌందర్య లహరి-14
పరమపావనమైన నీపాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపం
పసి శిశువుకు ఆకలియై పాలుకోరు ఇచ్చాశక్తి
ముసురుకొన్న పాపాలను తొలగించే ఇచ్చాశక్తి
పాలకొరకు అమ్మ స్తన్యమును జుర్రుకొనే జ్ఞానశక్తి
ఆర్తితీర అమ్మ స్తవము జుర్రుకొనే జ్ఞానశక్తి
పాలుతాగి కడుపు నింపుకునే క్రియాశక్తి
మురిపాలు తీర అమ్మఒడి పరవశమగు క్రియాశక్తి
మూడుపనులు చేయించే మూలచిచ్చక్తి అని
భక్య భోజ్య చోహ్య లేహ్య పానీయలతో
భక్తిపాత్రలో నింపి, భవతారక స్తుతులతో
అనుభవైకవేద్యము మహా నైవేద్యము అయిన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" గుఢాన్న ప్రీత మానసా-హరిద్రాన్నైక రసికా-ధ్ద్ధ్యాన్నాసక్త హృదయా" అంటు శ్రీలలితా రహస్య నామ స్తోత్రములలో అమ్మవారికి పులిహోర-పెరుగన్నము-బెల్లముతో చేసిన పరమాన్నము ఇష్టమైన నైవేద్యములుగా పేర్కొనబడినది కేవలము.ఆహార పదార్థములను అమ్మవారికి సమర్పిస్తే అవి ప్రసాదమవుతాయా? అన్న సందేహమును తొలగించుకొనుటకు మరి కొంచము పరిశీలిద్దాము.(పెద్దలు నా భావనలోని తప్పులను సరిచేయుట అమ్మ అర్చనగా భావించగలరు.
ఆహారపదార్థములను భక్ష్య-భోజ్య-చోహ్య-లేహ్యములుగా పెద్దలు చెప్పినారు.గట్టిగా కొరికి తినునని-నమిలి తినునవి-చప్పరించి తినునవి-పానీయములుగా స్వీకరించునవి అని విభజించినారు,అమ్మవారికి అర్పించిన ఆహారపదార్థములు దోష రహితములై అమ్మ అనుగ్రహము వలన ప్రసాదగుణమును పొందుచున్నవి.నైవేద్య సమయమునము చేయు మంత్రోచ్చారణ మిక్కిలి ముఖ్యమైనది.
ఋగ్వేదము ప్రకటించిన గాయత్రీ మంత్రమును అఖిలాండ బ్రహ్మాండ నాయకి మన హృదయములో ప్రవేశించి,జ్ఞాన కాంతిని వెలిగించమని ప్రార్థించుట.దానివలన మనలో తల్లి సూక్ష్మరూపియై ఉన్నదన్న అద్వైత భావము కలుగుతుంది.దానిని అమ్మ ప్రచోదింప చేస్తుంది.(మేల్కొలుపుతుంది.)
మిగిలిన మంత్రములు పంచ కోశ విచారణయే నైవేద్యము అన్న విశేషమును తెలియచేయును.అన్నమయకోశము,ప్రాణమయ కోశము,మనోమయ కోశము,విజ్ఞాన మయ కోశము,ఆనంద మయకోశము నావి అని నేను అనుకొనుట సరికాదు.అమ్మ వానిలో సూక్ష్మ రూపమున ఉండి అవి సరియైన పద్ధతిలో తమ పనులను నిర్వర్తించుచున్నట్లు చేయుచున్నది.నైవేద్యము చేసినతరువాత అమ్మదయతో శరీరము నేను కాను.ప్రాణము నేను కాను.మనసు నేను కాను.బుద్ధి నేను కాను అని తెలుసుకుంటాము.ఫలితముగా నైవేద్యము అంటే రకరకాల పిండివంటల సమర్పణము కానేకాదని,మన పంచకోశ సమర్పణము అని తెలుసుకోగలుగు తున్న సమయమున,చెంతనే నున్న నాచేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Thursday, February 22, 2018

SAUNDARYA LAHARI-13

 సౌందర్య లహరి 

పరమ పావనమైన నీ పాదరజ కణము 
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 కైమోడ్పులందించి తరియింపగ తలతుగాని
 పొంచిన పైశాచికము  కొంచపు తలపును దించు

 సంకీర్తనమొనరింప సన్నద్ధమగుదును గాని
 దానవత్వము  దరిచేరి నా దారి మార్చు

 జపతపాదుల నిను కొలువ నిశ్చయింతును గాని
 మదిని నిశాచరము చేరి నే నిష్క్రమింతు

 భావనామాత్ర సంతుష్టమొందు  భాగ్య వరమో నా
 దైవాసుర చింతనలు  వింతగ  చింతామణిద్వీపమైన వేళ,నీ

 మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా


 మానస విహారి ఓ సౌందర్య లహరి

 " భావనా  మాత్ర  సంతుష్టాయై నమః."

  అమ్మను స్తోత్రములతో,సహస్ర నామాములతో,కీర్తనలతో సేవించుదామనుకొనగానే,నాలోని మాయ నా మనసును కల్లుతాగిన కోతి వలె నిలకడ లేకుండా చేస్తూ ఉంటున్నది .కాని ఎందరో భక్తులు తమ భావనతోనే అమ్మ అనుగ్రహమును తమపై ప్రసరించుచున్నదని,ధన్యులమైనామని చెప్పగానే,అమ్మ గురించి తలచుకున్న నా మనసు అమ్మ దయతో మణిద్వీపమును దర్శించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(భావమే భవతారకమైనది.) 

SAUNDARYA LAHARI-12


   సౌందర్య లహరి-12

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 శృంగనాద పరవశయై చిక్కిపోవు లేడివలె
 దీపకాంతి మోహితయై నేలరాలు శలభము వలె

 చర్మేంద్రియ లౌల్యముచే చతికిలబడు కరివలె
 జిహ్వచాపల్యముచే పద్మమున చిక్కు తుమ్మెద వలె

 ఎర వాసన తనకొరకు కాదను ఎరుకలేని చేప వలె
 ఇంద్రియ లౌలత్యముతో మందబుద్ధి చెలిమి వలె

 స్వప్నావస్థను వదిలి సత్యాన్వేషణ చేయలేని,నా
 శాపములు అమ్మ పూజలో -దీపములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

   సాజ్యం త్రివర్తి సంయుక్తం - వహ్నినా యోజితం ప్రియం
                  గృహాణ మంగళం దీపం - త్రైలోక్య తిమిరాపహం
                  భక్త్యా దీపం ప్రయచ్ఛామి - దేవాయ పరమాత్మనే
                  త్రాహిమాన్నరకాద్ఘోరాత్ - దివ్య జ్యోతిర్నమోస్తుతే


 దీపము త్రిమూర్తి స్వరూపము.దీపములో మూడు రంగులకాంతులు ఉంటాయి.ఎర్రని కాంతి బ్రహ్మదేవినిది,నీలి కాంతి శ్రీ మహా విష్ణువుది,తెల్లని కాంతి శివతత్త్వానికి ప్రతీకలు.

   లేడి వినికిడి(చెవి) అనుఇంద్రియమునకు లోబడి వేటగానికి చిక్కుతుంది.పురుగులు చూపు(కన్ను) అనుఇంద్రియమునకు లోబడి దీపకాంతిచే దహింపబడుతాయి.ఏనుగు స్పర్శ (చర్మము) అను ఇంద్రియమునకు లోబడి గోతిలో పడుతుంది.చేప వాసన(ముక్కు) అను ఇంద్రియమునకు లోబడి జాలరికి చిక్కుతుంది.కాని నేను ఈ ఐదుఇంద్రియములకు లోబడి పరతత్త్వమును తెలిసికొన లేక పోతున్నాను.అమ్మ దయచే నా శాపముల చీకట్లు తొలగి,అవి దీపములై ప్రకాశించుచున్న సమయమున నీ చెంతనే నున్న నా చేతినివిడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Monday, February 19, 2018

SAUNDARYA LAHARI-11

    సౌందర్య లహరి-11



  పరమపావనమైన నీపాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



  లోభమునకు లోబడి రోగియైన నా మనసు

  పనికిరాని పనులతో సతమతమౌతుంటుంది



  కన్నుమిన్ను కానరాక కల్లుతాగిన కోతిలా



 దండగ పనులను బహుదండిగ చేస్తుంటుంది





  చిమటలా కొరుకుతూ చీదరపుట్టిస్తుంటుంది

  మితిమీరిన తెలివితో తలక్రిందులు వేలాడుతు



  చీకటిలో ఉబ్బితబ్బిబ్బౌ గబ్బిలము అవుతుంది

  గబ్బిలమౌ మది పూజలో గుగ్గిలమగుచున్న వేళ

 నీ మ్రోలనే  నున్న  నా కేలు  విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

  "దశాంగం గుగ్గిలోపేతం సుగంధంచ సుమనోహరం
   ధూపం దాస్యామితే దేవి గృహాన పరమేశ్వరి"

  సంబరేను చెట్టు వలన కలిగిన ధూప ద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల ఆకు,కాడ,బెరడు,ద్రవము మొదలగు వానినుండి వచ్చే సుగంధ ద్రవ్యములే దశాంగము.

 
 పూజలను ద్రవ్య పూజ-భావ పూజ అని ఎండు విధములుగా పెద్దలు వివరించారు.ఆదిశక్తికి ద్రవ్యములను అర్పిస్తుచేసే పూజ ద్రవ్య పూజ.ద్రవ్యములు లేకుండ మనసులోనే భావిస్తు చేసే పూజ భావ పూజ.ద్రవ్య పూజ భావపూజకు నిచ్చెనగా ఉంటుంది.సుగంధపరిమళ ధూపమును అమ్మకు అపించుట ధూప సేవ.

  ధూపద్రవ్య జ్వలనమునకు పంచభూతములలోని అగ్ని,సుగంధమును వ్యాపింప చేయుటకు వాయువు సహాయపడును.సువాసనను పీల్చుటకు పంచేంద్రియములలో ఒకటైన ముక్కు సహాయకారి.తాను కష్టపడియైన పదిమందికి సుఖశాంతులను పంచమని ధూపము తెలియచేస్తుంది.అమ్మను సేవించుకొనుచున్నామని సుగంధ పరిమళములు సంతసించు సమయమున,నీ చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

."

SAUNDARYA LAHARI10

  సౌందర్య లహరి-10

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  సకలవీర తిలకమే సకుంకుమ విలేపనముగ
  సకల కళల లోగిళ్ళు నీ ఎర్రని చెక్కిళ్ళుగా

  చిరునవ్వుల చూపులే సిరుల కంఠమాలలుగ
  కరుణాంతరంగమే అరుణోదయ భంగిమగ

  సకలము ఆవరించియున్న సత్ప్రకాశ మేఖలగ
  అందరిని    ఆదరించు అమ్మ చీర కొంగుగా

  లేత ఎరుపు ప్రకాశించె నీ ఎర్రని పాదాలుగా
  సకల శాస్త్రాలు నీ ఎర్రని వస్త్రములగుచున్న

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 " సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషితా"

  జలము అమ్మ స్పర్శచే పవిత్రమై తీర్థముగా మారుతోంది.అభిషేకానంతరము  లేత ఎరుపు రంగు(అరుణోదయ సూర్యకాంతి ) పరిణతనొందుచు నునులేతదై అమ్మ పాద కమలములను చేరి పునీతమైనది.కొంచము మారి లేతదనముతో అమ్మ నడుముకు మణిమేఖలయై (ఒడ్డాణమై) మరికొంచము సౌకుమార్యమును సంతరించుకొనుచు కరుణాంతరంగమును చేరినది.ధన్యోస్మి అంటు.మణిద్వీపము నందలి సువర్ణమయ ప్రాకారమును దాటి వెళ్ళగానే ప్రకాశించు పుష్యరాగమణి అమ్మ నుదుటను సిందూరముగా చేరుతూ,మైమరపుతో తనకాంతులను అమ్మచెక్కిళ్ళను అద్దాలని ప్రయత్నించిందా అన్నట్లు చెక్కిళ్ళు పసిడిమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్నాయి.అసుర సంహారి ఆదిశక్తి వీరత్వ సంకేతమై,సకల శుభప్రదమై చిక్కని ఎర్రటి కుంకుమ,అమ్మ ధరించిన ఎర్రని వస్త్రములను చూసి మురుయుచున్నదా అన్నట్లు మెరిసిపోతున్న సమయమున,నీ చెంతనే నున్న  నా చేతినివిడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

SAUNDARYA LAHARI-09


   సౌందర్య లహరి-09



  పరమపావనమైన నీపాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



  గౌరీపతి కడకు గంగ పరుగులెత్తుతోంది

  శ్రీరాముని కాళ్ళు కడుగ గోదావరి కదిలింది



  రాధామాధవ లీల యమున గంతులేస్తోంది

  దుర్గమ్మను అభిషేకింపగ కృష్ణమ్మ సాగుతోంది



  పుణ్యతీర్థ సంపద త్రివేణి సంగమమైనది

  నదులు-ఉపనదులు పరమపదమునంద గోరి



  సాగర సంగమమునకై వేగముగా సాగుచున్న

  సురుచిర జలధారలు నీకు శుద్ధోదక స్నానమైన వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి,

 " గంగేచ యమునేచై గోదావరి సరస్వతి
   నమదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు."

  గంగ-యమున-గోదావరి-సరస్వతి-నర్మద-సింధు-కావేరి నదులలోని పవిత్ర జలములు అమ్మకు శుద్ధోదక జలముగా మారి,అమ్మలో దాగిన భువన భాండములను చల్లగా చూచుటకు తాము  అభిషేక రూపమై భాగస్వాములమైనామని,అమ్మ స్పర్శను పొంది అనుగ్రహింప బడుతున్నామని సంతసించుచుచున్నవి.
    అవి పంచ భూతములలో ఒకటైన జలరూపమై ధన్యతనొందుచు,మనకు జీవనాధారమైనవి.అంతే కాక సాగర సంగమము అయిన తరువాత భాగ్యమేమో కాని ప్రళయ సమయమునకూడ సూక్ష్మ జగత్తును అమ్మ దయతో తమలో దాచుకొనగలుతున్నవి.

    అమ్మ అనుగ్రహధారలే  శుద్ధోదక అభిషేకములగుచున్న  సమయమున, నీ చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా. అనేక నమస్కారములు.


SAUNDARYA LAHARI-08


   సౌందర్య లహరి-08

  పరమపావనమైన నీపాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  గర్భస్థ శిశువుగ దుర్భరవేదన   పడుతూ,
  బాల్యావస్థలో పడరానిపాట్లు ఎన్నో   పడుతూ,

  సంసార సాగరాన్ని శక్తిలేక ఈదుతూ
 అరిషడ్వర్గపు ఆటలలో అనుక్షణము ఓడుతూ

  నిండైన జీవితము ఎండమావి అని చాటుతూ
  అమ్మ పాదాలే దిక్కని అనుక్షణము    వేడుతూ


  పటిష్ఠతను కోల్పోయి పండు ముసలి చేయుచున్న
  పంచాక్షరి నామాలే పంచామృత స్నానమగుచున్న వేళ

   నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
   మానస విహారి ఓ సౌందర్య లహరి.

   " పంచమి పంచ భూతేశి పంచ సంఖ్యోపచారిణి"

  " న మృతః"  అమృతము.చావు లేక నాశము లేనివి పంచామృతములు.అవి పాలు-పెరుగు-నెయ్యి/వెన్న-తేనె/చక్కెర/పటికబెల్లము/చెరుకు రసము- జలము.పండ్ల రసమును కలిపినచో
ఫల పంచామృతములందురు 

( పాలు-పెరుగు-నెయ్యి-తేనె-ఐదవది చక్కెర ని కొందరి-జలము అని మరి కొందరి భావన.అమ్మ దేనినన్న వాత్సల్యముతో అంగీకరిస్తుంది).ప్రతిజీవి బాల్య-కౌమార-యవ్వన-వార్థక్య దశలను దాటి చరమదశ అను ఐదవ దశలో పరమేశ్వరిని స్తుతించు    పంచేంద్రియ తత్త్వములు అమ్మదయతో పంచామృతములై ,మించిన భక్తితో అభిషేకమగుచున్న సమయమున ,చెంతనే నున్న నాచేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.( గోమాత మనకు పాలు-పెరుగు-నెయ్యి ప్రసాదిస్తుంటే,భూమాత చెరుకును,తనపైనున్న చెట్లను
తేనెటీగలకు ఆలంబనగా తేనెను అందించుటకు అనుమతిస్తున్నది.)




SAUNDARYA LAHARI-07

  సౌందర్య లహరి-07

  పరమ పావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  కరుణకాంతులీనుచున్నవి  కామాక్షి నేత్రములు
  శరత్కాల వెన్నెలలే కద శర్వాణి నాసిక

  మణిదర్పణములను మించినవి మాహేశ్వరిచెక్కిళ్ళు
  పారిజాత ప్రభలైనవి మా పార్వతి పలువరుసలు

  కస్తురితిలకము మూడవ కన్నుతో నుదురు
  కనులారా దర్శించిన కలతలు చెల్లాచెదురు

  ఆశ్రితరక్షణ సదనమైన  అఖిలాండేశ్వరి వదనమునకు
  నా విచారములె వింతగ ఆచమనీయములగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 " లాకిని లలనా రూపా లసద్దాడిమ పాటలా
   లలంతికా లసత్ఫలా లలాట నయనార్చితా."

   నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ! నీ నయనములు కరుణను వర్షించుచున్నవి.నీ ముక్కు పండువెన్నెలయై చల్లదనమును శాంతిని శ్వాసించుచు-శాసించుచున్నది.నీ నుదురు కస్తురి తిలకముతో త్రినేత్రముతో ప్రకాశించుచు శుభములనొసగుచున్నది.ఆశ్రిత రక్షణకు నిలయమైననీ ముఖమును చూచుచున్న సమయములో,వింతగ నా ఆలోచనలన్ని నీ దయతో ఆచమనీయములైన సమయమున నీ చెంతనే నున్న  నా చేతిని విడిచిపెట్టకమ్మా.నమస్కారములు.(ముఖ ప్రక్షాళనకు ఇచ్చు మంత్రపూరిత జలము ఆచమనీయము.)

Sunday, February 18, 2018

UGADI-VILAMBI

  ఉగాది శుభాకాంక్షలు
  **********************
 అరవైయేళ్ళ పిదప  అరుదెంచుచున్నావా
 ఆలంబన నేనంటు ఓ విళంబి వత్సరమా!

 అరవై సంవత్సరాలే తెలుగులో ఎందుకు?

 తిథి-వార-నక్షత్ర-యోగ-కరణములలో.

  అతి మెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల
  సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి
  పన్నెండు రాశుల చక్రాన్ని.(మేష నుండి-మీన రాశి)

  మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల
  సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి
  పన్నెండు రాశుల చక్రాని.

 30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజము అరవై
    అందుకే తెలుగులో అరవై  సంవత్సరాలు.

  ఉగాది  పచ్చడి అంటే?

 ఇల మమకారపు శ్రీకారము అంటున్నది కారము
 మెప్పులు ఉప్పంగాలని ఉప్పు చెప్పుతున్నది
 ప్రీతిగ ఉండాలంటు తీపి  ప్రయత్నిస్తున్నది
 వలపు తలపు పిలుపుకై పులుపు చూస్తున్నది
 చిగురు పొగరును అణచమని వగరు అంటున్నది
 విజ్ఞామను చేదు అని చేదు అంటున్నది

 అరిషడ్వర్గముల తుంచు ఆరు రుచులు తిందాము
 అనుభవసారము అని వాని మాట విందాము.

 పచ్చడి తిన్నాము మరి పంచాంగము ఏమిటి?

 స్వర్ణకన్యను అలరించుచు,పూర్ణకుంభమును అందుకొనగ
 మీనమేషమును ఎంచకురా,కానీయర పనులను
 వృషభ పౌరుషమును నేర్చి కృషిచేస్తు నీవు
 మహరాజుల బ్రతుకమని మృగరాజు అంటున్నది
 కొండెతో కొండెములను కాటువేయు వృశ్చికము
 కర్కశముగ కసాయితనము కడతేర్చును కర్కటకము
 పతితుల పాలించగ ఇలను ప్రతిమనసు ధనసు కాగ
 శ్రీకరములు నికరము అని మకరము కరమెత్తె చూడు
 ఆధునికతో మైధునమై అత్యంత సుధామధురమై

  పన్నెండు రాశులు మనకు వెన్నండగ నుండగ
  తడబడక అడుగులను వడివడిగ వేస్తు
  విలంబి అంటే ఏమిటో వివరించి చూపుదాం.


SAUNDARYA LAHARI-06

సౌందర్య లహరి-06
పరమపావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
పాపనాసనమునకై పరుగుతీయు నీ పాశము
అహంకారమును అణచగ అమరెగ నీ అంకుశము
ఆహ్లాద ప్రదములు అవిగో పుష్ప బాణములు
భృకుటి నిలిపి కొలుచుటేగ భుజముతాకు చాపము
భయ నివారకమైన నీ అభయ హస్తపు ముద్ర
వర ప్రదాయకమైన వరదహస్తపు ముద్ర
మూర్ఖత్వ జలధిని మునకలు వేయుచున్న నన్ను
నిర్ఘాంత పరచుచు అర్ఘ్యము అందుకొనుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా
నా మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః "
అమ్మ వరద-అభయ హస్తములను సవినయముగా కడుగుటకు ఉపయోగించు మంత్రపూరిత పవిత్రజలము అర్ఘ్యము.అమ్మ చేయూతతో చేతులను స్పృశించగలుగుట ఎంత సుకృతము.భక్తులు పాశాంకుశధారికి అర్ఘ్యమును అందించుచు,పరవశించుచున్న సమయమున ,చెంతనే నున్న నా చేతిని,విడిచిపెట్టకమ్మా.నమస్కారములు.

Saturday, February 17, 2018

SAUNDARYA LAHARI-05

   సౌందర్య లహరి-06

  పరమపావనమైన నీ పాదరజ కణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  రెప్పలేని సోగకనులు గొప్పే అను మీనములు
  తప్పు తెలిసికొని దాగెను చూసి నీ నయనములు

  మా సరిలేరను కలువలు నీ చలువదనమును చూసి
  రాతిరి పూయగ సాగెను ఎవ్వరు చూడరులె అనుచు

  అమ్మకు తమపై అసలుందదని అనురక్తి
  అతిశయోక్తి నేరుగా చేరిపోయె స్వభావోక్తి

 కుత్తుక లోతు ప్రేమతో మమ్ము హత్తుకున్న లత్తుకతో
 మా పాపము ప్రక్షాళనమై పాద నమస్కారమైన వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి.


 " తవ చరణం  మమ  శరణం"

  రెప్పవేయని  తమ నయనములు సుందరాంగుల నయనములకు ఉపమానములని అతిశయించు చేపలు,అమ్మ కనులుచూసి  అసలు నిజము తెలిసికొన్నవి.కలువలు కూడ అమ్మకనుల చల్లదనముతో తాము సరికావని గ్రహించినవి.పాదనమస్కారము చేయుచున్న భక్తులను అమ్మ తన పాదముల మెరయుచున్న లత్తుకతో (పారాణితో) అనుగ్రహించుచున్నవేళ, చెంతనే నున్న నా చేతిని విడనాడకమ్మా.అనేక నమస్కారములు.


Friday, February 16, 2018

SAUNDARYA LAHARI-04

     సౌందర్య లహరి-04



  పరమపావనమైన నీ పాదరజ కణము

  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



 రతీదేవి కొలిచిన నీ పాదరేణు అనుగ్రహము

 రూపులేని మన్మథుని చూపగలుగు పరాక్రమము



 నిండు చందమామ పదిగ ఒదిగియుండు పాదము

 హరి-బ్రహ్మాదులకు అపురూప సన్నిధానము



 క్రిందికి వంగిన వారి కిరీటకాంతులను మించి

 ప్రకాశించు పరమేశ్వరి పాదములను మోహించి



 పరవశమున నీ పాదమును తాకగ వంగిన ఆ

 పరమ శివుని శిరసు గంగ పాద్యము అగుచున్న





 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా

 మానస విహారి ఓ సౌందర్య లహరి.

 "గూఢ గుల్భ కూర్మ ప్రుష్టా-జయిష్టు ప్రపదాన్వితా"

  నా మానసమందిరములో  అధిష్టించిన తల్లీ ,నీ దయచే రతీదేవి తన భర్తయైన మన్మథుని పొందగలిగినది.నీ పాదధూళిని స్పృశించి నమస్కరించుచున్న దేవతల కిరీటకా0తులతో ప్రకాశించుచున్న నీ పాద అసమాన సౌందర్యమును చూసి(అవ్యాజ కరుణ) సంతసించిన పరమేశుడు నీ పాదమును తాకగ క్రిందకు వంగిన ,శిరసిగంగ సింగారముగా వంగి నీకు  పాద్యముగా మారి పరవశించుచున్న సమయమున,నీ చెంతనే నున్న, నా చేతిని విడనాడకమ్మా.నమస్కారములు.


SAUNDARYA LAHARI-03



సౌందర్య లహరి-03
పరమపావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
వాక్కును సృష్టించుతకు నీ పక్కనే ఉన్నారు
వశిన్యాది దేవతలు భక్తి పారవశ్యమున
మేథ-స్పురణ-ధారణలను మేళవించుచున్నరు
మధు-క్షీర-ద్రాక్ష సంగమము అన
చారులతా వల్లరిగా,శరత్కాల వెన్నెలగా
కాళిదాస-వ్యాస-వాల్మీకాదులను బ్రోచిన
ఆరుచక్ర కిరణములతో అమ్మ కృపా చరణములకు
నా అంతరంగ పీఠము మృదు సింహాసనమగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ -శ్రీమత్ సింహాసనేశ్వరి"
అమ్మది నిర్హేతుక కృపాకటాక్షము కనుక ఏ మాత్రము అర్హత లేనిదానినైనను,వశిన్యాది-వాలిఖ్యాది స్తుతులతో విరాజమానమగు అమ్మ నా అంతరంగమును సింహాసనముగా కరుణించి,అధిష్టించబోతున్నది. తల్లీ,నా మనసనే తోటలో విహరించుచు,నీ చెంతనే నున్న,నా చేతిని విడనాడకమ్మా.నమస్కారములు.

Thursday, February 15, 2018

SAUNDARYA LAHARI-02




     సౌందర్య లహరి-02

 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 అమావాస్య యను దైన్యమునకు పున్నమి ధైర్యమైన వేళ
 దుఃఖములోని దైన్యమునకు సుఖము ధైర్యమైన వేళ

 నిరాశ యను దైన్యమునకు నీ ఆశ్రయము ధైర్యమైన వేళ
 అలజడులు అను దైన్యమునకు నీ అండయే ధైర్యమైన వేళ

 పాశములు అను దైన్యమునకు నీ దర్శనము ధైర్యమైన వేళ
 పాపములు అను దైన్యమునకు నీ పాపలము అను తలపు ధైర్యమైన వేళ

 మూఢత్వము అను దైన్యమునకు నీ గాఢభక్తి ధైర్యమైన వేళ
 దైన్యము-ధైర్యము అను రెండు రెక్కలతో గ్రక్కున వాలి

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ఓ సౌందర్య లహరి. 



 " పంచ ప్రేతాసనాసీనా-పంచబ్రహ్మ స్వరూపిణి".

  సాధారణముగా దీనత్వము కృంగతీయు స్వభావము కలది.అమ్మ నిర్హేతుక కృపా కటాక్షములతో నా దీనత్వము, అమ్మ ఇచ్చు ధైర్యము అను రెండు రెక్కలతో వచ్చి,అమ్మ పాదముల చెంత వాలాను.నీ చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.నా మనసనే తోటలో విహరించే తల్లి నీకు నమస్కారములు. 

Wednesday, February 14, 2018

SAUNDARYA LAHARI-01

  శ్రీమాత్రే నమః
  ***********
  పరమ పావనమైన సౌందర్య లహరి ఆవిర్భావమునకు సంబంధించిన ఒక ప్రస్తావనతో నేను నా ప్రయత్నమును ప్రారంభిస్తాను.పరమశివుడు 5 స్పటిక లింగములను ,అమ్మవారు ఒక పుస్తకమును మన శంకరులకు వాత్సల్యముతో అనుగ్రహించారట.కాని నందీశ్వరుడు వానిని తీసుకుని పుస్తకములోని సగభాగమును మాత్రమే శంకరులకు ఇచ్చి,కాగల-రాగల మి గిలినభాగమునకు కారణమయ్యాడట.అవియె 41 శ్లొకములు గల ఆనంద లహరి,51 శ్లోకములు గల సౌందర్యలహరి.పరమేశ్వర లీల పరిణామములు పరమాద్భుతములు-పతిత పావనములు. 

  అమ్మ అనేది ఒక రూపముకాదు.అది ఒక తత్త్వము.మనము బాహ్య రూపముతో ఆగిపోకుండా సాగిపోతు అమ్మ తత్త్వమును తెలిసికొని,తన్మయమగుటకు ప్రయత్నించాలి.ఆనందకరమైన అచంచలమైన అజరామరమైన ప్రతిది అందమే.సర్వ ఉపనిషత్తులు ప్రతిపాదింపబడిన తత్త్వమే అమ్మ.పరబ్రహ్మ తత్త్వమే ఆనందము.చిదానందము అంటే ఇంద్రియాతీత పరతత్త్వము.శుభకరమైన శుభములను ప్రసాదించునదైన అందమే సౌందర్యము. 

        స్థూల,సూక్ష్మ,సూక్ష్మ తర,సొక్క్ష్మ తల సౌందర్యము.నాలుగు కలిసినది సౌందర్యము.ముందు స్ఫురించేది స్థూల సౌందర్యము ఆ సౌందర్యము జ్యోతిర్మయము.మనది మాంస మయము...పుట్టుట,కొంతకాలము ఉండుట,మార్పు చెందుట,పెరుగుట,క్షీణించుట,,నశించుట 
 అను ఆరు దోషములు కలది మానవ శరీరము.అమ్మకు ఆ ఆరు దోషములు లేవు.ఎప్పుడు ఉండే తత్వము అమ్మ అందుకే అనవద్యాంగీ.సూక్ష్మ సౌందర్యము మంత్రము.స్థూలము కంటే సూక్ష్మమునకు శక్తి ఎక్కువ..స్థూలమునకు సారమే సూక్ష్మము ఎన్ని మంత్రములో అంతమంది దేవతలు.శక్తివంతమైన శబ్దమే మంత్రము.మంత్రము సూక్ష్మసౌందర్యము.మంత్రశక్తి ఆ రూపములో ఉండును.ఆ శక్తియె సౌందర్యము.ఆ సౌందర్యము సుధాసాగరమున అనుగ్రహమను కెరటములతో అనవరతము మనలనందరిని అనుగ్రహించు లావణ్య లహరి.అట్టి మణిద్వీపవాసినిని నా మనముననిలుపుకొని స్తుతులను మీ మీకు అందించుటకు యధాశక్తి ప్రయత్నిస్తాను.


    పెద్దమనసుతో దోషములను సరిదిద్దుతారన ఆశిస్తు-నిమ్మగడ్డ సుబ్బ లక్ష్మి.

  సౌందర్య లహరి-01
  *******************
 అర్థనారీశ్వరము  నా ప్రార్థనలు విన్నదో
 కామితార్థమీయమని కన్న కొడుకుతో నన్నదో

 అంబా సుత అవ్యాజ అనుగ్రహ పరిణామమొ
 అస్తవ్యస్త మస్తకము పుస్తకముగ మారినదొ

 చేతిలో ఘంటము తానై  చెంతనె యున్నదో
 శిరమొడ్డినదె తడవుగ నన్ను ఒడ్డునకు చేర్చినదో

 ఆదిపూజ్యుని తల్లి నీ పాదధూళి రేణువునై
 అక్షరములను అమర్చనీ అద్భుత స్తోత్రములుగ

 అసాధ్యములు  నీ దయచే సుసాధ్యములగుచున్నవేళ,
 అవ్యాజ కరుణ వైపు అడుగులు వేయుచున్న వేళ,నీ

 మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ  సౌందర్య  లహరి.

    నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.నీ దయచే నా అవకతవక మైన తెలివి అమరిన పుస్తకమైనది.తల్లి నాచేయి పట్టుకుని తన గురించి తానే వ్రాసుకొనుచున్నది.ఎటువంటి ఆటంకములను దరికి రానీయవద్దని కన్నకొడుకైన వినాయకునితో చెప్పినది.అక్షర రూపలను జతచేయుచు అందమైన స్తోత్రములను అందించుచున్న జగజ్జనని, నీ ప్రక్కనే నున్న నా వేలిని ఎన్నడు విడిచిపెట్టాకమ్మా.నీకు
నమస్కారములు.  

Sunday, February 11, 2018

MAHA SIVARAATRI-02

   పరమేశుడు వచించిన ప్రకారముగా సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ముఖములను తనలింగములో నిక్షిప్తము చేసికొని దర్శనమిచ్చిన శుభ సందర్భము.ఈ ఐదు ముఖములు తమలో పంచభూతత్త్వమును,షట్చక్ర నిర్మానమును,కోశ సంపదను,బీజాక్షర విజ్ఞానమును,సప్తస్వర రాగములను,ఐదు దిక్కులను,ప్రణవ నాదములోని అక్షరములను,మరెన్నో రహస్యములను పొందు పరచుకొని కన్నులవిందు చేయుచున్నవి.

  1.సద్యోజాత శివ స్వరూపము

  లింగము సంకేతముగా,శుభరూపము శివునిగా
  సృజనాత్మక తత్త్వముతో నిశ్చయముగ శుభములొసగు
  పశ్చిమాభిముఖుడు,పరమ కరుణాంత రంగుడు
  సద్యోజాత నామ శివుడు సకల  శుభములొసగు గాక.

  సద్యోజాత శివుడు పశ్చిమాభిముఖుడు."శి" బీజాక్షరము ఇతడు.మనోమయకోశ పాలకుడు.అగ్నితత్త్వము కలవాడు.సప్త స్వరములలోని పంచమ స్వరము.మణిపుర చక్రమునకు అధిపతి.ఓం కారములోని మకారము.సద్య: అనగ అప్పుడె జాత: అనగా పుట్టినవాడు.ఈ శివుడు జీవులలో ప్రవేశించి సృష్టి కార్యమును నిర్వ హిస్తూ,మనలనందరిని అనుగ్రహించు గాక.

  అఘోర శివ స్వరూపము

 లింగము సంకేతముగా,గుణరహిత మూర్తిగా
 మేథ-జ్ఞాన తత్త్వములతో సకల విద్యలనొసగు
 "దక్షిణాభిముఖుడు" దక్షరాజు అల్లుడు
 అఘోరనామ శివుడు అఘములు తొలగించుగాక.

  అఘోరుడు దక్షిణాభిముఖుడు.పంచాక్షరి లోని "మ" బీజాక్షరము.ప్రాణమయకోశ పాలకుడు.పంచ భూతములలోని జలతత్త్వము.స్వాధిష్టాన చక్రమునకు అధిపతి.సప్త స్వరములలో మధ్యమ స్వరము.ఓం కారము లోని "ఉ " కారము.అఘోర నామ శివుడు మనపాపములను తొలగించి, జ్ఞానమును అనుగ్రహించుగాక.

  తత్పురుష శివ స్వరూపము

 లింగము సంకేతముగా,మాయను కప్పువాడుగా
 తిరోధాన తత్త్వముతో,పరిపాలన సాగిస్తూ
 తూరుపు ముఖాభిముఖుడు,మార్పులేవి లేనివాడు
 తత్పురుష నామ శివుడు పురుషార్థములిచ్చుగాక.

 తత్పురుషుడు తూర్పు ముఖాభిముఖుడు.పంచాక్షరి లోని "న" బీజాక్షరము.అన్నమయకోశ పాలకుడు.పంచభూతములలో పృథ్వి తత్త్వము కలవాడు.మూలాధార చక్రమునకు అధిపతి.సప్త స్వరములలో షద్జమ-రిషభ-గాంధార స్వరములు.ఓం కారములోని "అ" కారము. తూర్పు ముఖుడిగా లింగాకారములో నున్న "తత్పురుష"నామ శివుడు మనలను మాయవైపు తిప్పుతు సృష్టి పోషణ (తల్లి శిశువును పెంచుట)చేయుచు,మనలను రక్షించుగాక.


 లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

 ఈశ్వర శబ్ద సమానమైన ఈశాన శివుడు ఊర్థ్వముఖుడై ఉంటాడు.పంచాక్షరి లోని "య"కార బీ జాక్షరము.ఆనందమయకోశ పాలకుడు.పంచభూతములలోని ఆకాశ తత్త్వము.విశుద్ధ ,ఆజ్ఞా,సహస్రార చక్రముల పాలకుడు.సప్త స్వరములలో నిషధము.ఓం కారములోని నాదము.
  పైకి చూచుచున్న ముఖము కలవాడుగా నున్న "ఈశాన" నామ శివుడు సృష్టి,స్థితి,లయ,తిరోధానము,అనుగ్రహము అను ఐదు పనులను నిరంతరము చేయుచు,మనలను అనుగ్రహించు గాక.

"శివ దర్శనం న చింత నాశనం
పాద దర్శనం న పాప నాశనం
జంగమ దేవర స్మరణం జన్మ సార్థకం."
(ఏక బిల్వం శివార్పణం)

MAHAA SIVARAATRI-01

  మహా శివరాత్రి
 ****************
 సృష్టి ప్రారంభమునకు ముందు చరాచర జగతి శూన్యముగా నుండెడిదట.ఆ శూన్యమునందు పరమేశుని తేజస్సు ప్రవేశించి ,చలనముతో దానిని తేజోవంతము చేసినదని అధర్వణ వేదములోని అధర్వ శివోపనిషత్తు ఘోషించుచున్నది.

  ప్రతిజీవిలో పరమేశుని శక్తి నీవారశోక ప్రమాణమున(గడ్డిపోచ కొన) ప్రవేశించుటచే,తదనుగుణముగా పంచభూతములు,సూర్య చంద్రులు,సముద్రములు మొదలగునవి కూడ చైతన్యవంతమయినవి.పరిణామ ప్రభావితులైన దేవతలు ఈశ్వర సంకల్ప ప్రేరితులై "నీవెవరవు?"? అని ఆ తేజోమూర్తిని ప్రశ్నించిరి. 

    వారిని సమాధానపరచ దలచి పరమాత్మ వారితో అద్వైతము-ద్వైతము-త్రికాలములు-చతుర్వేదములు-పంచభూతములు-షట్చక్రములు-సప్త స్వరములు-అష్ట దిక్కులు-నవగ్రహములు-నవావరణములు-    కొశములు-దశేంద్రియములు-ప్రణవమైన ఓంకారము మొదలగునవి అన్నీ తననుండి ఆవిర్భవించినవని,అవి సమయానుకూలముగా సూక్షమమునుండి స్థూలముగాను,స్థూలము నుండి సూక్ష్మము గాను మారుచుండునని,తానును సమయాచారమును బట్టి రూపిగను-అరూపిగను ప్రకటింప బడుదునని చెప్పెను. 

  ప్రతి మాసమునందును బహుళ చతుర్దశి మాస శివరాత్రి అయినప్పటికిని మాఘ బహుళ చతుర్దశి నాటి లింగోద్భవ కాలము మహా శివరాత్రి పుణ్య విశేషముగా పరిగణింపబడుచున్నది.పరమేశుడు సెలవిచ్చిన సాకార-నిరాకార తత్త్వ ఉద్భవము(.పైనుండి కిందికి వచ్చిన అవతరణము.కిందనుండి పైకి వచ్చిన ఉద్భవము.)  

SIVA SANKALPAMU-108

" పునరపి జననం- పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే -బహు దుస్తారే
కృపయా పారే -పాహి త్రిపురారే"
ఓం నమ: శివాయ
శివ కుటుంబములోని "చిన్ని శిశువును" నేను
"ఆకలేస్తున్నదంటే" అన్నపూర్ణమ్మకు చెప్పు
"అన్నము నే తిననంటే" ఆ జాబిలిని కిందకు దింపు
"దాహమువేస్తున్నదంటే" ఆ గంగమ్మకు చెప్పు
"నేను ఆడుకోవాలంటే" ఆ లేడిపిల్లను పంపు
ఆటుపోటులన్నిటిని" ఆదరముతో" కప్పు
కనురెప్పగ పిల్లలను" కాచుటయే ఒప్పు"
కానిపనులు చేసినను" క్షమియించుటయే మెప్పు"
"ఉప్పుబొమ్మ కరిగినది" కొత్త బొమ్మ మిగిలినది
తప్పు తెలిసికొన్నది" తరియిస్తున్నది నీ ఒడిలో"
లక్షణమగు ప్రేమతో" ఒక్క క్షణమైనను" నన్ను వీడక
రక్షను అందీయరా తక్షణమే శంకరా

......కార్తీక మాసము శివ కేశవ మాసము.రెండు రూపములు ఒకే మనసు.ఈశ్వర హృదయస్య కేశవ-కేశవ హృదయస్య ఈశ్వర అనునది ఆర్యోక్తి.కాలాతీతమైన దేవుడు కనికరముతో ఎన్ని జన్మలందైనను మనలను తన ఒడిలోనికి తీసుకొని ఆదరిస్తూనే ఉంటాడు.మాయాతీతముకాని జీవుడు
మరల మరల భగవంతుని ఎన్నో కోరికలు కోరుతూనే ఉంటాడు.శిశువుగా శివుని ఒడిలో పులకిస్తూనే ముద్దుగా తన ముచ్చటలను పురమాయిస్తూ ఉంటాడు.ఇదే శీతకన్ను వేయలేని శీతల కొండ నివాసి హేల.పరమాద్భుతమైన శివలీల.
.....................................................................................................................................................................................................ప్రియ మిత్రులారా.నా ఈ చిన్ని ప్రయత్నమునకు ఊపిరినిచ్చినది మీ ఉన్నత సం స్కారమే కాని నా
అర్హత కాదు.ఈ పవిత్ర
" శివ సంకల్ప" పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా,తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా
(ఫలశృతి)
గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన
విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన.
( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
మంగళం మహత్...హర హర మహాదేవ శంభో శంకర.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...