Sunday, February 11, 2018

MAHA SIVARAATRI-02

   పరమేశుడు వచించిన ప్రకారముగా సద్యోజాత-వామదేవ-అఘోర-తత్పురుష-ఈశానాది ముఖములను తనలింగములో నిక్షిప్తము చేసికొని దర్శనమిచ్చిన శుభ సందర్భము.ఈ ఐదు ముఖములు తమలో పంచభూతత్త్వమును,షట్చక్ర నిర్మానమును,కోశ సంపదను,బీజాక్షర విజ్ఞానమును,సప్తస్వర రాగములను,ఐదు దిక్కులను,ప్రణవ నాదములోని అక్షరములను,మరెన్నో రహస్యములను పొందు పరచుకొని కన్నులవిందు చేయుచున్నవి.

  1.సద్యోజాత శివ స్వరూపము

  లింగము సంకేతముగా,శుభరూపము శివునిగా
  సృజనాత్మక తత్త్వముతో నిశ్చయముగ శుభములొసగు
  పశ్చిమాభిముఖుడు,పరమ కరుణాంత రంగుడు
  సద్యోజాత నామ శివుడు సకల  శుభములొసగు గాక.

  సద్యోజాత శివుడు పశ్చిమాభిముఖుడు."శి" బీజాక్షరము ఇతడు.మనోమయకోశ పాలకుడు.అగ్నితత్త్వము కలవాడు.సప్త స్వరములలోని పంచమ స్వరము.మణిపుర చక్రమునకు అధిపతి.ఓం కారములోని మకారము.సద్య: అనగ అప్పుడె జాత: అనగా పుట్టినవాడు.ఈ శివుడు జీవులలో ప్రవేశించి సృష్టి కార్యమును నిర్వ హిస్తూ,మనలనందరిని అనుగ్రహించు గాక.

  అఘోర శివ స్వరూపము

 లింగము సంకేతముగా,గుణరహిత మూర్తిగా
 మేథ-జ్ఞాన తత్త్వములతో సకల విద్యలనొసగు
 "దక్షిణాభిముఖుడు" దక్షరాజు అల్లుడు
 అఘోరనామ శివుడు అఘములు తొలగించుగాక.

  అఘోరుడు దక్షిణాభిముఖుడు.పంచాక్షరి లోని "మ" బీజాక్షరము.ప్రాణమయకోశ పాలకుడు.పంచ భూతములలోని జలతత్త్వము.స్వాధిష్టాన చక్రమునకు అధిపతి.సప్త స్వరములలో మధ్యమ స్వరము.ఓం కారము లోని "ఉ " కారము.అఘోర నామ శివుడు మనపాపములను తొలగించి, జ్ఞానమును అనుగ్రహించుగాక.

  తత్పురుష శివ స్వరూపము

 లింగము సంకేతముగా,మాయను కప్పువాడుగా
 తిరోధాన తత్త్వముతో,పరిపాలన సాగిస్తూ
 తూరుపు ముఖాభిముఖుడు,మార్పులేవి లేనివాడు
 తత్పురుష నామ శివుడు పురుషార్థములిచ్చుగాక.

 తత్పురుషుడు తూర్పు ముఖాభిముఖుడు.పంచాక్షరి లోని "న" బీజాక్షరము.అన్నమయకోశ పాలకుడు.పంచభూతములలో పృథ్వి తత్త్వము కలవాడు.మూలాధార చక్రమునకు అధిపతి.సప్త స్వరములలో షద్జమ-రిషభ-గాంధార స్వరములు.ఓం కారములోని "అ" కారము. తూర్పు ముఖుడిగా లింగాకారములో నున్న "తత్పురుష"నామ శివుడు మనలను మాయవైపు తిప్పుతు సృష్టి పోషణ (తల్లి శిశువును పెంచుట)చేయుచు,మనలను రక్షించుగాక.


 లింగము సంకేతముగా,పంచకృత్యములైనాడుగా
 అనుగ్రహ తత్త్వముతో భువనైక సంపదలొసగు
 ఊర్థ్వముఖాభిముకుడు పరమార్థమైనవాడు
 "ఈశాన " నామ శివుడు ఈప్సితార్థమిచ్చుగాక.

 ఈశ్వర శబ్ద సమానమైన ఈశాన శివుడు ఊర్థ్వముఖుడై ఉంటాడు.పంచాక్షరి లోని "య"కార బీ జాక్షరము.ఆనందమయకోశ పాలకుడు.పంచభూతములలోని ఆకాశ తత్త్వము.విశుద్ధ ,ఆజ్ఞా,సహస్రార చక్రముల పాలకుడు.సప్త స్వరములలో నిషధము.ఓం కారములోని నాదము.
  పైకి చూచుచున్న ముఖము కలవాడుగా నున్న "ఈశాన" నామ శివుడు సృష్టి,స్థితి,లయ,తిరోధానము,అనుగ్రహము అను ఐదు పనులను నిరంతరము చేయుచు,మనలను అనుగ్రహించు గాక.

"శివ దర్శనం న చింత నాశనం
పాద దర్శనం న పాప నాశనం
జంగమ దేవర స్మరణం జన్మ సార్థకం."
(ఏక బిల్వం శివార్పణం)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...