Sunday, March 4, 2018

SAUNDARYA LAHARI-27

దాస్యము

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  ఉద్ధరిస్తుందంట ఉలిదెబ్బలు తిన్నబొమ్మ
  పుడమిని పాలిస్తుందంట పూజలందుకుంటున్నదమ్మ

  అడుగుతడబడనీయదట ఆరడుగులు లేనిబొమ్మ
  కరుణను కురిపిస్తుందట కనురెప్పలు వేయదమ్మ

  చేయందిస్తుందట  చలనమేలేని బొమ్మ
  రాతను మారుస్తుందట  రమ్మని ఈ రాతిబొమ్మ

  అమ్మలను గన్నయమ్మ  ఆ మల గన్న అమ్మ
  నా అపహాస్యములన్నీ  దాస్యములగుచున్న వేళ

  నీ చెంతనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
  మానసవిహారి  ఓ సౌందర్య లహరి.

 "జనని వరదాయిని త్రిలోచని
  నీ పద దాసిని కావగదే."అని తల్లిని వేడుకొనిన లీలావతి (ప్రహ్లాదుని మాత) దాసినని స్వచ్చందముగా ప్రకటించినది.

  " బంటు రీతి కొలువు ఈయవయ్య రామా" అని త్యాగరాజు కీర్తించినాడు.ఆంజనేయ స్వామితో పాటు తనని కూడ దాసునిగా స్వీకరించమని ప్రార్థన.

  బానిసత్వము దాస్యము రెండు వేరు వేరు అర్థములనిచ్చు ఒకటిగా తోచు పదములు.పుట్టు బానిస/కట్టుబానిసలు తమ అభిప్రాయముతో నిమిత్తము లేకుండా బానిసలైన వారు.కాని దాస్యము అంటే ఆ  మానవాతీతమైన  పరమాత్మను యజమానిగా తలచి,స్వచ్చంద సేవకునిగా/సేవికగా తనకు తాను నియంత్రించుకొనుట  దాస్యభక్తి.ఇందులో ఎవరి ప్రమేయము,బలవంతము ఉండదు.భగవంతుడు దాసుడివి కమ్మని అనడు.అయినను భగవద్గుణములకు పరవశించి,భగవదనుగ్రహముతో భగవతిని సేవిస్తు తరించగల చక్కని అవకాశమే దాస్యము.  

   భగవతత్త్వమును సేవించిన రామదాసు,సూరదాసు,తులసిదాసు  అంతదాక ఎందుకు మహాకవి కాళిదాసు మహానుభావులైనారు.పెద్దలు వచించిన కథల ప్రకారము పరమాత్మ తన భక్తులను ఉద్ధరించుటకై తానెన్నో కష్టములను ఆనందముగా స్వీకరించెనట.సతి సక్కుబాయి,భక్త నందనారు ఇలా ఎన్నో కథలు భగవంతునికి-భక్తినికి గల దాసానుదాస హేలలను బోధపరచుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

  మణిద్వీప వర్ననలోను వజ్రమణి ప్రాకారాములో అనేకానేక దాస భక్తులు అమ్మవారికి
తాళపత్ర వీవనలను అందించుటలోను,ఆభరణములతో సేవించుటలోను,తాంబూలాదులను అందించుటలోను,మధుర్ గానాములో మాతను సేవించుటకును ,అలంకారాదులలోను,పుష్పార్చనలోను ఆ యా ఋతువుల సమయానుసారముగా సేవలుచేస్తారని చెప్పబడినది.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...