Thursday, March 22, 2018

SAUNDARYA LAHARI-55

 సౌందర్యలహరి
పరమపావనమైన నీపాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
తల్లి గర్భములో నేనుండగా సహస్రారముద్వారా
క్రిందకు పయనమై, మూలాధారముచేరి,పైకి వస్తూ
దేహేంద్రియాదుల కన్నా ఇతరములేవి లేవను
అజ్ఞానపు బ్రహ్మగ్రంధి ముడిని,నీ దయతో విడదీస్తూ
సూక్ష్మ శరీరము నాదికాదను బోధద్వారా
విష్ణుగ్రంథి ముడిని విడదీస్తూ,సాగుతూ
శరీర భ్రాంతియైన రుద్రగ్రంధిని చేదిస్తూ
నన్ను కట్టివేసిన ముడులను నీ కరుణ విప్పుచున్నవేళ
నీమ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా, నా
మానస విహారి ఓ సౌందర్య లహరి
"సహస్రాంబుజారూఢా సుధాసారాబ్ధి వర్షిణి" సహస్రారములో జగన్మాత అమృతవర్షిణిగా మనలను అనుగ్రహిస్తుంది.
జీవుడు స్థూల-సూక్ష్మ-కారణ శరీరములను కలిగియుంటాడు.
సాధకుని కుండలినీశక్తి మూలాధారమునుండి సహస్రారము చేరుటకు మధ్యలో మూడు అవరోధములను ఎదుర్కొనవలసి వచ్చును.అందులో మొదటి అవరోధమును "బ్రహ్మ గ్రంధి" అంటారు.మనకున్న ప్రాపంచిక బంధములు దట్టమై చిక్కుముడిగా మారి స్వాధిష్ఠానమును దాటి పైకి వెళ్ళనీయక అడ్డుపడుతుంటాయి.తల్లి అనుగ్రహముతో చిక్కు ముడిని విడదీసి మార్గమును సుగమము చేయుటచే,సాధకునికి తనకు స్థూల శరీరమునకు ఎటువంటి సంబంధము లేదని,దానిని కోల్పోవుట కేవలము మరణము అని ముక్తి కాదని అర్థమవుతుంది.మరి కొంచము పైకి పాకిన తరువాత
అనాహతము దగ్గర ఇంకొక పీటముడి దారికి అడ్డుపడుతుంది అదియే విష్ణుగ్రంధి..తల్లి దానిని విప్పిన తరువాత సాధన మరికొంచము ఉన్నతమవుతుంది.సాధకుడు తన స్థూల శరీరమే కాదు సూక్ష్మ శరీరము కూడ తనది కాదు అని తెలుసు కుంటాడు.మరి కొంత
సాగిన తరువాత ఆజ్ఞా చక్రము దగ్గర
మరియొక చిక్కుముడి
తారసపడుతుంది.అదియే రుద్రగ్రంధి. తల్లి కరుణాంతరంగముతో దానిని విడదీసి,కుండలినిని ఆజ్ఞా చక్రము చేరుస్తుంది.దీనిని దాటిన జీవుడు సహస్రారమును చేరి దేవునిగా మారుతాడు.పాశము ఉన్న వానిని తల్లి సహస్రామును చేర్చి,పాశ విమోచనుని చేయుచున్న సమయమున చెంతనేనున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.నమస్కారములు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...