Wednesday, April 4, 2018

SAUNDARYA LAHARI-76

సౌందర్య లహరి- తెప్పోత్సవము-70

పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

భయ నివారణమైన అభయహస్తపు ముద్ర
వర ప్రదాయకమైన వరద హస్తపు ముద్ర

నీ మూర్తిలో కానరాకున్న యేమి?
కామితార్థములన్ని నీ కాలి ధూళి ఈయగ


నీ చేతిలో ముద్రలు చేరుట సాహసమేగ

నేను అగాథ జలధి మునిగిన నీ అవ్యాజ కరుణ

 భక్తి కర్మనధిగమించి భవతారకమగురీతిగ
ఉప్పొంగుచు సాగుచున్న తెప్పోత్సవమైన వేళ

నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.నీ పావన పాదధూళికణము అభయములు,వరములు ఇచ్చుచున్న సమయములో నీ చేతులలో అభయ ముద్రను,వరద ముద్రను ధరించవలసిన పని ఏమి?


  అసుర సంహారము చేసి ఆదిశక్తి అలిసిపోయిన వేళ,ఆహ్లాదమును కలిగించుటకు ఆనందముతో భక్తులు ఆమ్మను పిలిచి,అమ్మతో కలిసి సర్వాలంకృతమైన తెప్పలో పుష్కరిణిలో చేసే ఉత్సవమే తెప్పోత్సవము.ఆ తెప్ప హంస వలెనున్నది.ఉండుటకాదు అది నిజముగా జ్ఞాన ప్రతీకయైన హంస.ఆ తెప్పకు సరంగు జగన్మాత.కనుక అలల అలజడి దానికి లేదు.భక్తి మునకలు తెడ్డులై నడుపుచున్నవి.భవబంధములు ఆ తెప్పను పట్టుకొనలేవు.జీవులను జన్మలను రేవుల నుండి జన్మరాహిత్యమునకు చేర్చుటయే దానిపని.



 భక్తి కర్మాచరణము నుండి జ్ఞాన భక్తిగా మారుతూ,అసలు విషయమును అవగతము చేస్తుంది.అమ్మతో పాటుగా తెప్పలో ఉన్నామన్న భ్రమ తొలగి,అసలు అమ్మ ఎపుడు మనలను విడిచిపెట్టి ఉంది కనుక అను భావన కలుగుతుంది.అమ్మ అలిసిపోయి ఉన్నదన్న విషయము హాస్యాస్పదమనిపిస్తుంది.అసురులు-ప్రదేశములు-యుద్ధములు అన్నీ అమ్మగురించి తెలుసుకొనే బోధనోపకరణములు అని అనిపిస్తుంది.అమ్మ స్థూలము-నేను సూక్ష్మము అను భావము బలపడితే భవసాగరములెక్కడివి? అవి ఎప్పుడో సుధాసాగరములుగా మారినవి.ఆ సుధాసాగర మధ్యస్థ అయినతల్లితో నేను చేయుచున్న ప్రయాణము గొప్పగా తోచుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...