Sunday, August 2, 2020

86



ఓం నమ: శివాయ

" అనిశము వశమగుతావు" పశునామములకు నీవు
"పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు

"కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు
"శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు

మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు
వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు

"స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు
వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు

జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి"

శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు"

" పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
"కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా.

భావము
శివుడు పశుపతి కనుక పశువులన్నా, పశునామములన్నా మిక్కిలి ఇష్టము.కనుక కోడిగానో,పాముగానో,నక్కగానో,కుక్కగానో, పులిగానో, శరభముగానో , దర్శనమిస్తుంటాడు.".శ్రీకాళ హస్తీశ్వరుడిగా" భక్తులను అనుగ్రహిస్తున్నాడు.కాని నర రూపమున నున్న భక్తుని, (నన్ను) అనుగ్రహించమంటే,నా భక్తి నిశ్చలమైనది కాదంటున్నాడని-నింద.
పశువు అంటే జంతువులు,క్రిమి కీటకములు మాత్రమే కాదు.మోహ పాశము,తక్కిన బంధములచే బంధింపబడిన మానవులు సైతము పశువులే.భక్తితో పరమేశ్వరుని కొలిచిన కరుణ అను పాశముతో మనలను కటాక్షించు( ను) "పశుపతి" అయిన పరమేశ్వరుడు. -స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం) 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...