Monday, November 22, 2021

ERIPATTA NAYANAR

ఎరిపత్త నాయనార్ *************** ఎరిపత్త నాయనారు *************** "నీరాట వనాటములకు బోరాటంబెట్టు కలిగె పురుషోత్తముచే నారాట మెట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్". గజేంద్రమోక్షము. హరిగా ఒక అహంకారమును విడిచిన గజమును రక్షించుట-హరుని భక్తునిగా ఒక మత్త గజమును శిక్షించుట ,చిద్విలాసము కాక మరేమిటి? మన నాయనారుల జన్మనామము కన్నా వారి సత్కర్మ సంకేత నామములే సత్కీర్తిని పొందినవి. " నమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవ నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ఉత తే నమః". రుద్రా! తే- నీయోక్క మన్యవే-కోపమునకు నంస్తే- నమస్కారము రుద్రా నీ కోప ప్రకటనమునకు నమస్కారము. ఉతో-మరియును తే-నీయొక్క బాహుభ్యాం-బాహువులు, కోపమును సూచించు ఆయుధములను ధరించిన బాహువులకు నమస్కారము. రుద్రమంత్రములను సనాతనులు ప్రత్యక్ష మంత్రములుగా భావించి,గౌరవిస్తారు. నీ కోపము,దానిని సూచిస్తూ నీ బాహువులలో ఒదిగిన ఆయుధములు ధర్మసంరక్షనమునకు మాత్రమే ప్రయోగింపబడును గాక. అంతే కాదు, యా తే హేతిః మీడుష్తమ య-ఏ-తే-నీ యొక్క ఖడ్గము/గొడ్డలి మీడుష్టమ- సజ్జనులను సంరక్షించుతకు సాధనమగుగాక. భగవంతునికి-భక్తునికి భేదము లేదు అను సత్యమును చాటువాడు ఎరిపత్త నాయనారు. ఎరిపత్త అన్న పదమునకు ఒక నియమము/తీర్పు/విధానము అను అర్థమును తమిళభాష ప్రకారము మన నాయనారు, చేత ఒక గండ్రగొడ్డలిని పట్టుకుని,ఎక్కడైనా/ఎవరికైనా/ఎప్పుడైన /ఏదైనా శివపూజా నిర్వహణకు ఆటంకము కలిగించిన,తత్ క్షణమే తనదైన తీర్పుగా వారిని /శివాపరాధమును శిక్షించేవాడు. ఋతువులతో పాటుగా ,శివుని అనుమతులను సైతము ప్రకటిస్తూ కాలము జరుగుచున్నది.మదమునకు ఉదాహరణముగా చెప్పబడు కరి అన్నిరూపములు తానైన వాని కనుసన్నలలో నడచుటకు సిధ్ధమైనది ఎంతో మోదముతో. భక్తుని ఉధ్ధరించాలనే శివకామ మనోహరుని ఆనగా శివగామి ఆండార్ పూలునిండిన సజ్జతో నడుస్తున్నాడు ఆమోదముతో. ఇద్దరు స్వామి లీలా ప్రదర్శనమునకు పాత్రధారులు.ఒకరికి అది పూజాసమయము.మరొకరికి అది చెలరేగుచున్న చెండాడు సమయము.పరస్పర విరోధ ప్రకటనప్రదర్శనమే అయినప్పటికిని అది పరమేశ్వర లీలా వినోదము.స్వామికార్య సేవా సౌభాగ్యము.సాక్షాత్తు నిర్ద్వంద్వుని ఆనగా జరుగుచున్న నిర్దాక్షిణ్యము. ఒకవైపు శివగామి సత్వగుణ సంపన్నుడై స్వామిసేవకువెళుతున్నాడు.మరొక వైపు తమోరజో గుణములను తలనిండా నింపుకున్న మత్తగజము/దానిని నడుపుతున్న /నడుపలేని మావటివాడు.స్వామిభక్తిని తోసివేసి భక్తునిపైకి దూసుకుని పోతున్నది ఏనుగు.చూస్తున్నాడు మావటి కర్తవ్యహీనుడై.పూలసజ్జ ఎగిరిపడి పూలన్నీ చెల్లాచెదరైపోయినాయి. అనుకోని సంఘటన అభిరామిఆండర్ ని నేలకొరిగేలా చేసింది.హాహారావములను ఎరిపత్త చెవులకు చేరవేశాడు చంద్రశేఖరుడు. కాబోవు పనినికన్నులముందుంచాడు కాముని కాల్చినవాడు.క్రోధము తెప్పించాడు.నాయనారు చేతి గొడ్డలినెత్తించాడు. " ఆట కదరా శివా-ఆట కద కేశవా ఆట కద జననాలు-ఆట కద మరణాలు ఆటలన్నీ నీకు అమ్మతోడు" శ్రీ తనికెళ్ళ భరణి. ఆట మొదలైనది.ఏనుగు తొండముపై,దానిని సరిగా నడుపలేని మావటి తలపై వేటు పడింది.పుగళై చోళరాజుగారికి ఈ విషయము తెలిసింది.వచ్చి చూశాడు .జరిగిన దానిని సమన్వయముతో పరిశీలించాడు. మళ్లీ మొదలుపెట్టాడు సంఘర్షణను వారిద్దరి మధ్య వాదనగా శివుడు రాజునినాయనారుని ధర్మానుసారులుగా,కర్మఫలానుసారులుగా. భక్తి మర్మమును తెలియచేయుటకు తప్పు తనరాజ్యములో జరిగినది కనుక దాని శిక్షను అనుభవించవలసినది తానని రాజు తన ఖడ్గమును నాయనారు చేతికిచ్చి ,తన తలను దునుమమన్నాడు. ప్రభుహత్య మహాదోషము కనుక,రాజాజ్ఞను ధిక్కరించలేనివాడను కనుక ఆ ఖడ్గముతో తన తలను నరుకుకోబోయాడు నాయనారు. ఇద్దరు ధర్మనిష్ఠాగరిష్ఠులే.స్వామి భక్తిపరులే.స్వార్థరహితులే. సాంబశివుడు తక్క వారి సమస్యను పరిష్కరించగలవారెవరు? సంతుష్టాంతరంగుడై సా సాక్షాత్కరించాడు. ు.ఏనుగును మావటివానిని పునర్జీవితులను కావించాడు. ఎరిపత్త నాయనారు తన ప్రమధునిగణునిగా ఆశీర్వదించాడు. ఎరిపత్తను కరుణించిన పరమేశ్వరుడు మనలను ఎల్లవేళలా రక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...