KOTPULI NAYANARU

కోట్పులి నాయనారు ********************* దృశ్యాదృశ్య విభూతి వాహనకరీబ్రహ్మాండ భాండోదరి లీలా నాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞాన దీపాంకురీ శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. తిరునాత్తియన్నగుడి లో వ్యవసాయ కుటుంబము నందు నాయనారు జన్మించెను. చోలరాజునకు సైన్యాధ్యక్షత వృత్తి. ధాన్యరాశులను దేవాలయములోని నైవేద్యమునకు,అన్న సంతర్పణములను అర్పించుట ప్రవృత్తి. అన్నింటిని సరిగా సాగనీయడు కదా అన్నపూర్ణేశ్వరుడు. భక్తి చేయు గమ్మత్తులను బాహ్యప్రపంచమునకు తెలియచేయాలనే సంకల్పముతో ఎన్నో చిత్ర-విచిత్రములను చేస్తుంటాడు. భక్తినే ఆయుధముగా మలచి భక్తుని అరిషడ్వర్గములతో ఆడుకోమంటాడు.తాను వేడుక చూస్తుంటాడు. ఇక్కడ అదే జరిగింది.వ్ర్త్తి-ప్రవృత్తిని రెండు పాచికలుగా మలచుకున్నాడు మహేశుడు. కర్తవ్యపాలనము అంటూ నాయనారుకు ధాన్యము దేవాలయములలోని పంచే అవకాశమును తుంచివేశాడు. రాజాజ్ఞగా ఊరువిడిచి పొరుగు దేశమునకు సైన్యముతో వెళ్ళవలసిన సందర్భమును సృష్టించాడు నాయనారును పరీక్షించుటకై వాని ఇష్టదైవమైన శివుడు. ఒక పక్క కర్తవ్యము.మరొక పక్క కైంకర్యము. రెండును తాను త్రికరముల సాక్షిగా పాటించవలసినవే.దేనికదే సాటి.కాదనలేని పోటి. కావలిసిన కార్యమునకై ఏదో ఒక చిన్న పరిష్కారమును భక్తుని మదిలో కదిలింప చేస్తాడు కాలకంఠుడు. కర్తవ్యమును తాను స్వీకరించి-కైనకర్య బాధ్యతను తన బంధువులకు అప్పచెప్పి కదిలాడు నాయనారు. కోట్-పులి. రౌద్రముగా/పరుషముగా నున్న పులి.వీరత్వ నిదర్శనము. శత్రువులు తోకముడుచుకొని పారిపోయారు. అక్కడ కథను సుఖాంతముగా నడిపిస్తున్న శివుడు,ఇక్కడ మాత్రము కలిని విజృంభింపచేశాడు.కరువు కాటకములు తమదైన బలముతో సర్వజనులను బలహీనము చేస్తున్నాయి. కోట్పలి బంధువులకు సైతము ఏమీ మినహాయింపులేదు. పాపము ఏమిచేయగలరు. రుద్ర చమకములో చెప్పినట్లు వాజశ్చమే- నాకు ఆహారము కావాలి,ఆహారముతో పాటుగా నీరు కూడా కావాలి కనుక, అంబశ్చమే,అంటూ అన్నపాదాదులు రెండూ తానైన శివుడు, అణువు-అణువు తానై-అడుగు-అడుగు తానై వాటిని అందనీయకుండా ,పొందికగా ప్రణాళికను నడిపిస్తున్నాడు. అన్నోదక ప్రాణాలేమొ, ఒక పక్క క్షామము-మరొక పక్క ధాన్యము రెండు, ధర్మా-ధర్మ రూపములుగా గిరగిరా తిరుగుతూ వారిని అధర్మమైనా సరే,అన్న ప్రసాద వితరనకు వెళ్ళ వలసిన ధాన్యమును,తమ ఆహారముగా అనుకూలముగా మార్చుకొనేటట్లు చేసినది.నటరాజునకు కావలిసినది కూడా అదేకద. పరమసంతోషముతో తిరిగివచ్చాడు కోట్పులి.దుర్భిక్షము తాను లక్షణముగా ఇక్కడే ఉన్నానని హెచ్చరిస్తూ,వెక్కిరించింది. దేవాలయములలో అన్నసంతర్పణములు ఆగిపోయినవి.దేహాలయములు నిత్య నైవేద్యములు లేక నకనకలాడుతూ సాగలేకున్నవి. కదిలాడు నాయనారు క్షామము గురించి తెలుసుకోవాలని, కాదు కాదు కదిలించాడు నాయనారుని కాముని కాల్చినవాడు క్రోధపూరితునిగా మార్చ్తకు. ఆట కదరా శివా-ఆటకదా కేశవా. శివుని ఆనపై కిమ్మనకుండా ఉన్నాడు స్థితికర్త. పరిస్థితిని మరింత దయనీయముగా కదిలిస్తూ,కరుణను వదిలేస్తూ, అన్ని విషయములు అవగతమవసాగాయి కోట్పులికి.అదే అదనుగా పదునైన కోపము తన వంతుగా పరుగులు తీస్తూ వచ్చిచేరింది నాయనారు. లయము చేయు వాని కరుణ మాయాజాలమై మానవతను సైతము మరుగున పడేటట్లు చేసింది. తన బంధువులనందరిని సాకుతో తన దగ్గరకు రప్పించుకున్నాడు కఠినత్వమునకు పరాకాష్ఠ యా యన్నట్లు ఆ అధర్మ ఆహారమును భుజించి,తమ పిల్లలకు చనుబాల నిచ్చిన బాలెంతలను సైతము జాలిలేక మట్టుపెట్టాలనుకున్నాడు. వీతరాగుని చేతలను ప్రశ్నించేవారెవరు? ఒకవేళ ప్రశ్నించినా వాటికి సమాధానమినిచ్చే సాహసము చేయగలవారెవరు? కనీసము పరిహాసమునకైనను, కడతేర్చేసాడు కనిపించినవారినందరిని క్షణములో. నమో అఘోరేభ్యో-ఘోరాఘోర తరేభ్యః. కన్నతల్లి మనసు కరుగకుండా ఉంటుందా.కదిలి వచ్చేసింది. ధూర్జటి మహాకవి చెప్పినట్లు అగ్ని-మంచు అగు అందరిని సజీవులని చేసింది. అమ్మ తలుచుకుంటే కరువు కాలుముడుచుకోక తప్పుతుందా. అంతే.ఎక్కడ చూసిన ధాన్యపురాశులు-అన్నమై -సుసంపన్నమై శోభిల్ల సాగినది. నాయనారు భక్తిని నలుదిక్కులా వ్యాపింపచేసింది.నందివాహనుని కరుణను పదిమందికి తెలిసేలా చేసింది. చనిపోయిన వారందరిని పునర్జీఉతులను చేసిన పరమేశుడు ,కోట్పులికి కైవల్యమును ప్రసాదించాడు. కోట్పులిని అనుగ్రహించిన ఆది దంపతులు మనలనందరిని అనిసము రక్షించెదరు గాక. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)