Friday, February 17, 2023

PARUGULELA PATTUKONAGA-OM NAMASIVAYA

 


 




  పరుగులేల పట్టుకొనగ-ఓం నమః శివాయ


  ******************************


 స్పూర్తినిచ్చిన సిద్ధార్ శివవాక్కియర్ కు నమస్కారములతో (ఓడి-ఓడి-ఓడి-ఓడి-పరుగులు తీసి తీసి పట్టుకోగలవా) ఈ చిన్ని ప్రయత్నము.పెద్దలు తప్పులు సవరించగలరు.


 1.వ్రాసి వ్రాసి వ్రాసి వ్రాసి నీటిమీది వ్రాతలే


   మాసి మాసి మాసి మాసి ముసురుకున్న మాయలో


   చూసి చూసి చూసి చూసి మోసపోయి శంకరా


   రోసి రోసి రోసి రోసి సమసిపోయిరెందరో.


 


   ఓ పరమేశా!మాయముసుగులో నిన్ను కనలేక స్థిరముగా నిలువని నీటి ప్రవాహముపై నీ నామమును వ్రాసి,నిన్ను దర్శించాలని పరుగులు తీసి తీసి కనుగొనలేక కనుమరుగు అయినవారెందరో.అట్టి అజ్ఞానమును మన్నింపుము.


 2.నీది ఏది? నాది ఏది? నీదినాది కానిదేది?


   జననమంటు-మరణమంటు ఆటలాడుచున్నదేది?


   రాజు అంటు-గురువు అంటు మాటలాడుతున్నదేది?


   వేరుచేసి చూపుచున్న" నేను"  అన్న భ్రాంతియే.


  


  ఓ మహేశా! నేను అన్న దేహభ్రాంతి నిన్ను నా నుండి వేరుగా భ్రమింపచేస్తూ,చావు పుట్టుకలగురించి,నీవు-నేను అన్న ద్వంద్వముల గురించి విచిత్రముగా మాటలాడుతూ-మనలతో ఆటలాడుచున్నది.అట్టి మా భ్రాంతిని తొలగింపుము.




  3. ఊరు ఏది? పేరు ఏది? నీ ఉనికికి ఊతమేది?


     దూరమేది?దగ్గరేది? నీవు లేని చోటు ఏది?


     పెద్దదేది?చిన్నదేది? తారతమ్యమేది ఏది?


     నిత్యసత్యమైన నిన్ను నేను చూదగలిగితే!


 


      సర్వేశ్వరా! ఊరు-పేరు,చిన్న-పెద్ద,దగ్గర-దూరము వీటిలో ఏది నీ ఉనికికి ఆధారము అన్న సందేహములన్నీ  నిన్ను నేను దర్శించగలిపినప్పుడు తొలగిపోవును కదా.ద్వంద్వములు-వాటి విపరీత స్వరూప-స్వభావము మా భావనయే అను స్పష్టతను అనుగ్రహించుము.


  4. మట్టిపాత్ర ముక్కలైన మరలు కొత్తరూపుకై


     లోహపాత్ర సొట్టలైన కరుగు కొత్తరూపుకై


     దేహపాత్ర వ్యర్థమైన జరుగు వల్లకాటికై


     అట్టిదానిలోన దాగి  నీవు  ఎట్టులాడుచుందువో?


 శంకరా!


   మట్టిపాత్రలు తమ రూపమును కోల్పోయినప్పటికిని తిరిగి కొత్తరూపును కుమ్మరివలన పొందుతాయి.లోహపాత్రలు సైతము కమ్మరి కొలిమిలో కాలి కొత్త రూపును దిద్దుకుంటాయి.కాని ఎంతటి నిరుపయోగమైనది ఈ మానవ శరీరము.శ్వాస ఆగినంతనే దుర్గంధమయమై శ్మశానమును చేరుతుంది.దయమాయా! అట్టి శుష్క శరీరములలో దాగి నీవు  బొమ్మలాట ఆడుతావు కాసేపు.తరువాత ఆ బొమ్మలనే వేటాడతావు.


 5.అవ్యక్తా!


 పంచభూతములు  మాతో విడివడితే జననము


 పంచభూతములు మాతో ముడిపడితే మరణము


 పంచభూతములు పలుకు పంచాక్షరి మంత్రము


 పంచభూతములు నడుపు నాటకమె ప్రపంచము.




    అఖండా!మూలము నుండి ఐదు విభాగములుగా విడివడి సృష్టి-స్థితి ని నిర్వహిస్తూ పంచకృత్యములను చేస్తు ప్రపంచమనే చదరంగమునాడతావు.ఆ విషయమును గ్రహింపగలుగు చాతుర్యమును ప్రసాదింపుము.


     




6.లేడు లేడు అంటున్నది చూడలేని లేమి నాతో


  చూడు చూడు అంటున్నది జాడ చూప జాలి నాతో


  అవధిలేక ఉన్నదిగ ప్రతి ఉపాధిలో చైతన్యము


  అవగతము చేసుకొనిన పునర్జన్మ శూన్యము.




    ఓ సర్వాంతర్యామి!


  చీమలో-బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమమీర నిండియున్నావన్న జ్ఞానమును మాకు అనుగ్రహింపుము.మమ్ములను తిరిగి మాతృగర్భవాసమును పొందనివారిగా చేయుము.




 7. బాణమేసినానని భయపడునా ఆకాశము


    జారవిడిచినానని జాలిపడున అవకాశము


    శాసనము నాదనిన శ్వాస సహకరించునా


    ఇంతకన్న సాక్ష్యమేది?ఎంత మాయ ఈశ్వరా!




    శంభో! నాదే రాజ్యమని-నా మాటే శాసనమని భావించుట ఎంతటి అవివేకము.అదేకనుక సత్యమైతే ఎందరో మేధావులుగా ప్రకటించుకొనువారు కాలచక్రమునకు  లోబడియుండెడివారా? 




 8.నేలరాచినాను ఎన్ని వరములనో తెలియదు


   గేలిచేసినాను ఎన్ని మంత్రములనో తెలియదు


   అనాహతపు ఓంకారము అజపామంత్రము గాగ


   నటరాజుని నాట్యమేగ నా దహరాకాశములో.


 ఓ అష్టమూర్తి!


   నీ ఉనికిని స్పష్టముగా గుర్తించుటకై నా గుండెచప్పుడు నిరంతరము సో-హం అంటు నేను నీ దాసుడునని జపిస్తు  ప్రగల్భములు పలుకకుండా తనపని తాని చేసుకుంటున్నది. వాదోపవాదములెందుకంటు,సంపూర్ణానుగ్రహముగా   

  నిన్ను సన్నుతిస్తున్నది. 


9. తెలియలేదు నిన్ను మరచి నన్నుచూచు వేళలో 


   తెలియలేదు నీవు-నేను వేరువేరు కాదని


   తెలిసె నేడు నిన్ను తలచి నన్ను చూచు వేళలో


   తెలిసె నేడు నేననేది నాదికానే కాదని.


 ముక్కంటి!


   నీ అనుగ్రహ వీక్షణముతో నా అవలోకనా దృక్పథము మారి నీలో దాగిన నన్ను-నాలో దాగిన నిన్ను నిశ్చలముగా చూదగలుగుతున్నాను.పాహిమాం-రక్షమాం.


10. చేరలేదు కద చీకటి వీతమోహరాగుని దరి


    తెలిసికొనిన వేళలో శివాలయమె నా మది


    చేరువేగ లోకేశుడు-లోకములు అను సంగతి


    తెలిసికొనిన వేళలో అద్భుత లింగోద్భవమది.




       ఓం నమః శివాయ-త్వమేవాహం.


 మహాశివరాత్రి శుభాకాంక్షలు.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...