Saturday, November 30, 2019

MARGALI MALAI-11


   మార్గళి మాలై-11
   *************


  పదకొండవ పాశురం
  ***************

కత్తుక్కరవై క్కలుంగళ్ పలకరందు
శెత్తార్ తిరల్ అళియచ్చెన్రు శెరుచ్చెయ్యుం
కుత్త మొన్రిల్లాద కోవలర్ తం పొర్కిడియే
పుత్తు అరవు అల్గుల్ ! పునమయిలే! పోదరాయ్
శుత్తత్తు ట్టోళిమార్ ఎల్లారుం వందు నిన్
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వ ప్పెణ్డాట్టి ! నీ
ఎత్తుక్కు ఉరంగు పొరుళ్ ఏలో రెంబావాయ్.

  తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో

 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము.


 గోపాలుని రేపల్లెలో గోసంపద పుష్కలము
 ప్రతివారు బలవంతులె దరిచేరలేదు వైరము

 పుట్టలోని పామువలె ,పురివిప్పిన  నెమలివలె
 ఓ భాగ్యశాలి!నిదురవీడి బయటకు రావమ్మా


 స్నేహితులు-బంధువులు నీ ఇంటికి వచ్చినాము
 నీలమేఘశ్యాముని,  నెనరుల కీర్తిస్తున్నాము

 వీడలేని నీ నిదురను కూడిన కారణమేమి?
 తరలివచ్చినది తల్లి, తానొకగోపికయై


 పాశురములు పాడుతు పాశములన్నింటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావై కు రారాదో ! ఓ బంగరు మొలక!

 గోదమ్మ ఈ పాశురములో గోకులమున గల స్వధర్మ పరిపాలన-స్వధర్మ పరిరక్షణ అను రెండు విషయములను ప్రస్తావించుచున్నది.గోపబాలురు పుష్కల గోసంపద కలవారు.గోవుల పాలు పితుకుటలో నేర్పరులు (బుధ్ధి బలురు.) అంతే కాదు వారికి కీడును తలపెట్టిన శత్రువుల పైన తామే దండెత్తి వారిని ఓడించి,దరిచేరనీయని వారు.(భుజ బలురు.) ఇది వాచ్యార్థము.


  "గో" శబ్దమునకు వాక్కు-వేదము అను అర్థమును పెద్దలు నిర్వచిస్తారు.
"కత్తుక్కుక్కరలై క్కలుంగళ్" చిన్నదూడలు గల ఆవులు అనగా వేదాంగములు గల వేదములు.అవి
ఏమిచేస్తున్నాయంటే పలకరందు పాలను పుష్కలముగా వర్షిస్తున్నాయి.ధర్మమును సోదాహరణముగా వివరిస్తున్నాయి.ఎవరికి? పాలను పితుకు నేర్పు వంటి నేర్పుగల జ్ఞానమును సముపార్జించుకొను వారికి.ఆచార్యులకి.


 ఆచార్యులు ఎటువంటి వారు? ధర్మమునకు గ్లానిని తలపెట్టు వారి వద్దకు నాస్తికులకు-
దుష్ప్రచారకులకు బుధ్ధిచెప్పువారు.ఏ విధముగా తమకు తామే గుర్తించి,కుహనా సంస్కారుల వద్దకు తామే వెళ్ళి వారి అజ్ఞానమును చర్చల ద్వారా వివిధ కార్యక్రమముల ద్వారా విశద పరచు వారు.

 అంతటి విశిష్ట గోకులమున జన్మించిన అపురూప లావణ్యవతి బంగరు తీగ గా పిలువబడు నేటి గోపెమ్మ.ఏమా లావణ్యము?


 గోదమ్మ ఆమె లావణ్యమును "కోవలర్ తు పూర్కడియే" అని సంబోదిస్తూ,పుత్తు అరవు అల్గుల్ అన్నది పుట్తలో ముడుచుకొని ఉన్న పాముగా కీర్తించినది.అంతే ఏమిటి?

 పాము తన శరీరమును చిన్నగా చుట్టుకొని,బుసలు కొట్టకుండా పుట్తలో ముడుచుకొని ఉన్నది.ఇది అహంకార రాహిత్య సూచకము.అదే విధముగా పరగత "సర్వస్య శరణాగతిని" కోరిన ఈ గోపిక ఆచార్య జ్ఞాన
ప్రవచనములను పుట్టలో ,అహంకారమును వీడి
అభ్యాసమును చేయుచున్నది.అదియును కదలక-పలుకక.నిశ్చలముగా .

 అదే గోపిక నీలమేఘశ్యాముని కీర్తనలను నీలిమబ్బును చూసినపుడు ఆనందపారవశ్యయై (పునమయిలే)పురివిప్పిన నెమలి వలె సంతోషముతో నాట్యమాడుతుంది.చేతనత్వము-అచేతనత్వము గురువుల ఉపదేశములపై-నింగిలోని నీలి మబ్బుపై అధారపడి యున్నది. అంటే అహంకార-మమకారములకు
త్యజించినది.స్వామి సర్వస్య శరణాగతిని పొందినది.

  బయట నున్న గోపికలు ఓ! భగవదనుభవ సంపన్నురాలా! నీ బంధువులము స్నేహితులము నీ వాకిట ముందు నిలబడి నీలమేఘ శ్యాముని నెనరులతో-పరమ ప్రీతితో కీర్తిస్తున్నాము.నిన్ను నిద్రాసక్తురాలిని చేసిన దానిని విడిచివేసి,మాతో పాటు నోమునకు రమ్మని వేడుకొనగా,గోపిక బహిర్ముఖియై,వేరొక గోపికను మేల్కొలుపుటకు అమ్మను అనుసరిస్తూ,వెళుతోంది.


 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)




 



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...