Sunday, December 1, 2019

MARGALI MALAI-15

 మార్గళి మాలై-15
*******************


    హదిహేనవ పాశురం
    ****************

"ఎల్లే ! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో?"
 "శిల్లెన్రూళై యేన్ మిన్ నంగైమీర్! పోదుర్గిన్రేన్
  "వల్లై ఉన్ కట్టురైగళ్ ! పణ్ణే ఉన్వాయ్ అరిదుం"
  వల్లీరగళ్ నీంగళే నానే తాన్ ఆ ఇడుగ"
 " ఒల్లై నీ పోదాయ్ ఉనక్కు ఎన్న వేరు ఉడైయై"
 " ఎల్లారుం పోందారో?" పోందార్ పోందు ఎణ్ణిక్కొళ్;
  వల్లానై కొన్రానై మాత్తారై మాత్తు అళిక్క
  వల్లానై, మాయినై ప్పాడు ఏలోరెంబావాయ్.

   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీగోదా రంగనాథుల అనుగ్రహము అనవరతము

  ఏమాశ్చర్యము! చిన్ని చిలుక నిదురించుచునే యున్నది
 ఎంతమాట!ఎందులకీ పెద్దగోల? నే వస్తున్నా!

 కట్టుకథలు చెప్పగలుగు దిట్టవు! ఓ కీరవాణి
 అంగీకరిస్తున్నానన్నది  లోపలి గోపిక తితీక్ష

 నీ ఘనకార్యములను చాలించి కదలిరావమ్మా
 అందరు వచ్చేసారా?ముందరొచ్చి లెక్కించు

 ఉన్మత్త గజమదమణచిన ఉత్తముని కీర్తించగ
 తరలి వచ్చినది తల్లి తానొక గోపికయై




  పాశురములు పాడుకొనుచు పాశములన్నిటిని విడిచి
 నప్పిన్నాయ్ తిరుప్పావైకు రారాదో! ఓ లేచిలుకా!


 పదిహేనవ పాశురము శ్రవణ-మనన(శయన)-జ్ఞాన దశలను దాటి,సంభాషణ దశను సుసంపన్నము చేస్తున్నది.ఉక్తి-ప్రయుక్తి అను ప్రశ్న-సమాధానములతో వారి మానసిక స్థితులను,వాక్కు యొక్క పరమార్థమును మనకు అందించుచున్నది గోదమ్మ.తలుపునకు బయట నున్న పరుష వాక్యములు-లోపలి గోపిక తితీక్షతను తేటతెల్లము చేయుచున్నవి.

 పదిమంది గోపికలను పది ఇంద్రియములుగా భావించినన్ను అవి పరిపూర్ణములై పరమాత్ముని సేవకు పరుగులు తీయుచున్నచి.కాదు పదిమది ఆళ్వారులుగా భావించినను అసలు కంటె వడ్డి ముద్దు వలె భాగవతులను ఆశ్రయించి -అనుసరించి చేయు ఆండాల్ వ్రతము అత్యంత ఫలప్రదము.ఎందుకంటె ఈ పాశురములోని సంభాషణలు సకలసిధ్ధి దాయకములు.

 గోదమ్మ ఈ పాశురములోని గోపికను "ఇళంగిళియే" అని సంబోధించినది.చిన్న చిలుకా-లే చిలుక అని చిలుక జ్ఞాన సంకేతమే అయినప్పటికిని ఈమె చిన్ని చిలుక.ఒక్క విషయమును ఈమె సరిచేసికొనినచో పూర్ణత్వము లభించును.ఏమిటాఒక్క విషయము.ఈమె భగవదారాధ్యాసక్తయై భాగవతార్చనను జాప్యము చేయుచున్నది.కనుక గోదమ్మ ఈమెను భాగవతార్చనను నిర్లక్ష్యము చేయరాదని తీసుకొని వెళ్ళుటకు వచ్చినది.

 పదవ గోపిక సౌందర్యవతి-సౌశీల్యవతి.గోదమ్మ పెంపుడు చిలుకవలె నిర్ద్వంద్వ స్థితి కలది.గోదమ్మ ముచ్చట పడి తన పెంపుడు చిలుకకు గోవింద నామమును పలుకుట నేర్పినది.పూర్వాచారమైన గురుసంప్రదాయమును అనుసరించు ఆ చిలుక అనవరతము గోవింద నామమును కీర్తించ సాగినది.ఎవరైన వినుచున్నారా/లేదా? అది వారికి సంతోషమును కలిగిస్తున్నదా/లేదా అను విషయములు దానికి అవసరలేదు.కాని దాని గోవింద నామ కీర్తనము,ఒకనాడు స్వామి విరహవేదనలో నున్న గోదమ్మకు మరింత ఆగ్రహమును కలిగింపచేసి,ఆమె విచారమునకు కారణము  తన పెంపుడు చిలుక చేయు గోవింద నామస్మరణమను భావనను కలిగించినది.చిలుకను నిందింప చేసినది.కాని చిలుక సౌమ్య స్వభావురాలు.బాహ్య విషయములకు అతీతురాలు.ఏ మాత్రమును తొణకక-బెణకక గోవింద నామమును చేస్తూనే ఉంది. అదే తితీక్షత్వము.మహోత్కృష్టము.తన చిలుక గొప్పదనమును చాటుటకు గోదమ్మ తనను ఉదహరించుకొని మనలను అనుగ్రహించినది.



 తలుపు బయటనున్న గోపికలు పరిపూర్ణ  భగవదనుగ్రహమునకు అత్యంత సమీపమున నున్నవారు.మనమీది కరుణ వారిచే కాసేపు కఠిన సంభాషణమును చేయించినది  కాని వారును కారుణ్యమూర్తులే. గోదమ్మ పాశురమును,'" ఎల్లె" అను పదముతో ప్రారంభించినది.ఎంత ఆశ్చర్యము అంటోంది ఆండాళ్ తల్లి.ఏమా ఆశ్చర్య కర విషయములు?

 పదవ గోపిక "వల్లీర్గళ్ నీంగళే నాందాన్ ఆయిడుగ "అంటున్నది.తనపై గోపికలు ఆరోపించిన నిందలను అంగీకరించినది.సౌమ్యముగా మాట్లాడి స్వామి సేవకు నందగోపబాలుని భవనమునకు గోదమ్మతో తరలినది.ఇదియే తితీక్షత్వము.ఏ విధముగా శ్రీమద్రామాయణములో శ్రీరామ వనవాసమును గురించి తెలిసిన సమయమున దానికి కారణము భరతుడు అని, ఏమాత్రమును సంబంధములేని,ఆ సమయమున అక్కడలేని,అసలు హర్షించలేని భరతుని ప్రత్యక్షముగా గుహుడు,భరధ్వాజ మహర్షి తదితరులు నిందించినను,బదులీయక మౌనమును వహించి,మనమున శ్రీరామునిపై కల భక్తి ప్రపత్తులను చాటుకొనిన తితీక్షుడు భరతుడు
.

 గోదమ్మ గోపికలతో కలిసి వచ్చి నిదుర లేపుట భాగవతారాధన విశేషములను
 తెలియచేసి వారిని నందగృహమునకు తోడ్కొని పోవుట వాచ్యార్థము.


" ఇళ్ళంకిళియే "పంజరములో నున్న తెలిసి తెలియని జ్ఞానముతో నున్న చేతనులు అనబడు వారము మనము.కాని మనలో చేతనత్వ ప్రకాశము పూర్తిగా లేదు.కనుక రెక్కలు చాచి,పైకెగిరి భగవానుని-పెరుమాళ్ ముఖోల్లాస కైంకర్యమును చేయలేనివారము.చేయుచున్న వారలను కనీసము చూడలేని వారము.

"ఇన్నం ఉరంగుదియో"-ఏ విధముగా లోపలి గోపిక తన నిద్రను ముగించి చైతన్యవంతురాలు కాలేదో-అదే విధముగా మనమును జనన-మరణములను కొనసాగిస్తూ ఉన్నాము.ఆమె పూర్తి నిద్దురలో లేదు.జాగరూకతతో లేచి వచ్చి తలుపు తీయలేదు.దానికి ఆమెకి కల కారణము

 తాను బయటకు వచ్చి తలుపు తీస్తే నామ సంకీర్తనమో ఆగిపోతుందేమో.తాను లోపల
 మునిగియున్న భగవద్గుణ వైభవమును కోల్పోతానేమో అన్న పరిస్థితి.గోపికది భగవదనుభవము.మనది భవబంధనము.ఎంతటి వ్యత్యాసము.





 మనము జాగరూకులమై ఆచార్యుల అనుగ్రహమును గ్రహించలేక పోవుటకు అహం-నేను -నాది అను దేహభ్రాంతి.


మనలను ఉధ్ధరించుటకు పరిపూర్ణానుభవ ప్రసన్నులు మనలను తమ జ్ఞాన వాక్కులతో
మేల్కొలుపటకు మన ముంగిటికి వచ్చినారు.ఎంతటి భాగ్యము.కాని మనము దానిని గ్రహించలేని స్థితిలో ఉన్నాము.

 ఏ విధముగా కృష్ణ పరమాత్మ చేతనులు నిద్రించు సమయమున జాగరూకుడై రక్షిస్తు-అదేస్వామి బాలకృష్ణునిగా  మారి, మనము నిద్రపుచ్చుతు " జో "జోఅచ్యుతానంద-జో జో ముకుంద" అని లాలిపాడి జోకొట్టినపుడు,మనలను ఆనందపరచుటకై నిద్రను నటిస్తాడో అదే విధముగా మనలను చైతన్య వంతులను చేయుటకు 'నంగై మీర్" పూర్ణ విజ్ఞులు "కత్తురైకల్" కట్టుకథలు అని మనము అనుకొను కమనీయ గాధలను తెలియచేస్తూ,  ఏవిధముగా స్వామి కువలయ పీడనమును ఏ ఆయుధమును ఉపయోగించకుండా దాని శరీర భాగమైన దంతముతో తీసివేసినాడో,అదేవిధముగా ఆచార్యులు తమ జ్ఞానామృతధారలచే మనలోని ఉన్మత్తతను దూరముచేసి,మనలను సంపూర్ణ  చైతన్య వంతులుగా మలుస్తూ,స్వామి శరణాగతికి తాము ముందుండి మనలను తీసుకొని వెళుతున్నారు.కనుక మిగిలిన పనులను వెనుకకు నెట్టి వ్రతోన్ముఖులై,గోదమ్మను అనుసరించి,నంద గోప బాలుని సదనముకు వెళుదాము అని చెప్పుచు,గోదమ్మ తన అడుగులను కదుపుచున్నది.


( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం).





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...