Saturday, May 2, 2020

CHAMAKAM-ANUVAKAMU-09

శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది. యజ్ఞసిధ్ధిని వివరించు ఈ అనువాకము యజ్ఞ ప్రారంభ దశ యైన దీక్షా స్వీకారము నుండి బృహత్ స్నానము అను యజ్ఞము ముగిసిన తరువాత చేయు సంస్కారము వరకు వివరించుచున్నది.

   ఆధ్యాత్మిక స్థానమును ప్రకాశింపచేయు అగ్నికార్యము,"ఘర్మచమే" అను ప్రపర్థ్యము,అర్క యాగము,సూర్య యాగము,ప్రాణ హోమములతో పాటు అత్యుత్తమ యాగ ప్రక్రియయైన "అశ్వమేథమును" ప్రస్తావించుచున్నది.

  అశ్వమేథము అంటే గుర్రము తలను నరుకుట యేనా యజ్ఞ సమయములో అను సందేహము మనకు వస్తుంది.ఒక   విధముగా మనము కాదనలేని అంశమిది.ఇప్పటివరకు సాధకుడు దేహాభిమానమును  కలిగియున్నప్పటికిని ఆధ్యాత్మికత యందు ఆసక్తిని కలిగియున్నాడు..అతనిలో దేహాభిమానము పూర్తిగా తొలగలేదు.కాని పరతత్త్వమును గురించిన కుతూహలము ,దానిని విచారించు విజ్ఞత కలగలుపుగా కలిసి ఉన్నవి.అంతర్యాగ-బహిర్యాగ ఫలితముగా సాధకుని మనస్సులో ఆధ్యాత్మికత బలవత్తరమై ఐహికమును మరుగుపరచుచున్నవి.నిరంతర సాధన సత్కామముల సహకారముతో అతని ఆలోచనా విభావరి అశ్వమువలె శీఘ్రగమనముతో పరమార్థ తత్త్వము వైపు పరుగులు తీసింది.అశ్వము తలను-శరీరమునుండి వేరుచేసినట్లు విషయవాసనలను శరీరమును,మేథస్సు అను తలనుండి వేరు చేసినది.మృగత్వమును వీడిన మేధస్సు లో స్వార్థము సమసి పోయినది.
 పరాకాష్ఠకు చేరిన పరమాత్మ తత్త్వము పరులమేలును కోరుచు ప్రార్థించుచున్నది.తత్ఫలితమే,

 ,అదితి,దితి,ద్యులోకము,శక్వరీ ఛందస్సు,విరాట్పురుషును వ్రేళ్ళగా పోల్చబడు దిసలు-విదిశలు తమతమ కార్యములందు శక్తిని కలిగియుండునట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తూన్నాడు సాధకుడు.""పృధివీచమే-దితిశ్చమే-అదితిశ్చమే-ద్యౌశ్చమే శక్వరీ.." అంటూ.

  ఋగ్యజుర్సామవేద మంత్రములు నా యజ్ఞముచేత సమర్థవంతములగు గాక అని వాటి యొక్క విశిష్టతను మరొకసారి ధృవీకరిస్తున్నాడు.

    యాగమహిమను-మంత్ర మహిమను మరింత సుసంపన్నము చేసిన తరువాత కాల మహిమను విశదీకరిస్తున్నాడు ఋతుశ్చమే-వ్రతంచమే అని కీర్తిస్తూ.తాను చేయు యజ్ఞమునకు పరమాత్మ సంతసించి అనుకూల వర్షపాతములను కలిగించి పంతలను సమృధ్ధిగా పండించుగాక.

  ఇక్కడ అహోరాత్రముల స్వరూపమైన కాలమనే పరమాత్మ  సకాల వర్షమును కురిపించి,నా జీవన పరమార్థమను పంటను పుష్కలముగా పండించి,రక్షించును గాక నేను పరిపూర్ణ తృప్తుడనై,భగవద్గుణ వైభవమను బృహత్ స్నానమున పునీతమగుగాక అను యజ్ఞసిధ్ధిని వివరించు చమకముతో మమేకమగుచున్న వేళ సర్వం శివమయం జగం.

    ఏక బిల్వం శివార్పణం.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...