Saturday, January 27, 2018

patram-pushpam-falam-toyam

పత్రం,పుష్పం,ఫలం,తోయం
మన గాన గాంధర్వునికి నా నైవేద్యం
========================
పత్రం:
---------
నాగుల తలలూగించే నారద తుంబుర గానమునకు
నాగవల్లి పత్రములో ముత్యము కస్తురి ఉంచి
వీనుల విందు చేయమని వినతి పత్రముతో నే వస్తే
మీ ప్రశంసా పత్రములు వినయముతో నన్ను పలుకరించాయి
"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" తన నారద,తుంబుర దివ్య గానమును మరొక్కసారి వినిపించమని, తమలపాకుల్లో సుగంధ ద్రవ్యములను, ముత్తెపు పొడిని ఉంచి, వినతి పత్రముతో నే వస్తే, బాలుగారికి లభించిన ప్రశంసా పత్రములు వినయముతో నన్ను పలుకరించాయి.

పుష్పం:
--------
శారదా లబ్ధమైన శ్లాఘనీయ శబ్దమునకు
శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస సంపత్తిగల పూలనుంచి
మంగళకర గళమునకు కైదండలు చేయ నే వస్తే
మీ పద్మములు మృదు సంభాషణములుగ నన్ను పలుకరించాయి.
శారదామాత అనుగ్రహముతో కీర్తించదగ్గ స్వర సాం రాజ్యాధిపతికి, పంచేంద్రియ శక్తిగల పువ్వులను ఇచ్చి నమస్కరించాలని నేను వస్తే, బాలుగారి పద్మశ్రీ,పద్మ భూషణ్ అనెడి జ్ఞాన పద్మములు మృదు సంభాషణలుగా నన్ను పలుకరించాయి.
ఫలం:
----------
ప్రతిఫలమును కోరని పండిత ఆరాధ్యునకు
ప్రతి, ఫలము దోరగ పండిన మధురిమనుంచి
ఈప్సిత ఫలమునకై తపస్సుగా నే వస్తే
మీ పండిన సంస్కారము పండుగగా నన్ను పలుకరించింది.
శ్రోతలనుండి ఎటువంటి ప్రతిఫలమును కోరనివారు, పండితులచే(పామరులచే) ఆరాధింపబడు బాలుగారికై, ప్రతి పండు దోరగా పండి తన రుచిని అందించుటకు సిద్ధమైన వేళ, పాట వినాలి అన్న నా కోరికను ఫలవంతము చేసుకొనె తపనతో నేను వెళితే పరిపూర్ణమైన వారి సంస్కారము పండుగలా నన్ను పలుకరించింది.
తోయం:
---------
ఆప్తుడైన సప్తస్వర సంధానకర్తకు
సప్త సాగరాలను తోయముగా ఊహించి
అర్ఘ్య పాద్య రూపాలని మూర్ఖతతో నే వస్తే
మీ తోటివారిపై కరుణ తోయదమై నన్ను పలుకరించింది.
సప్తస్వర సంధాన కర్తకు సప్తసాగరాల నీటిని కాళ్ళుకడగాలన్న ఊహతో నే వస్తే బాలుగారు తోటివారిపై చూపు ఆప్యాయత, వర్షించే మేఘములా నన్ను పలుకరించింది.
నైవెద్యం:
------------
స్వచ్చందపు సారధిగ స్వచ్చత రాయబారమునకు
ప్రచ్చన్నతలోనున్న ఉచ్చత్వమును గమనించి
మంచి చెడులు కానరాని మందమతిగ నే వస్తే
మీ నందుల సందోహము ఆనందముగా నన్ను పలుకరించాయి.
సంస్కారముతో కప్పివేయబడిన గొప్పదనము స్వచ్చతకు రాయబారము చేస్తుంటే ,మంచి చెడులు గమనించలేని ఆత్రుతతో నే వస్తే ఈశ్వరరూపమైన మీ నందుల గుంపు ఆనందముతో నన్ను పలుకరించాయి.
మనిషిగా నే వచ్చి మనీషిని దర్శించా
రాగము వినదలచి వచ్చి జీవనరాగమునే తెలుసుకున్నా
వినవలసినవి పదనిసలు మాత్రమే కాదని, పరిణితిని చెందుటకు పదపదమని
ప్రగతి పథము ఆశిస్తా-ప్రతి గతిలో శ్వాసిస్తా.
సోదరి
నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...