Tuesday, December 26, 2017

ANANDA LAHAR-13

 " త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం  సమాహృతి
    ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా
    బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా
    ప్రయాగే  మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"

    ప్రజాపతి ఎక్కువ యాగములను చేసిన ప్రదేశము కనుక ప్రయాగ అని పేరువచ్చినది.ప్రకృష్ట యాగ వాటికగా ప్రసిద్ధి పొందిన క్షేత్రము కనుక ప్రయాగ అని తలచేవారు ఉన్నారు.బృహస్పతి మోహిని వదిలిన అమృతభాండమును తీసుకెళ్ళుచుండగా కొన్ని బిందువులు పడిన ప్రదేశము కనుక " అమృత తీర్థము" అని కూడ పిలుస్తారు.విష్ణుపాదోద్భవ గంగ యమున నదులను ఇళ-పింగళ నాడులుగాను,సరస్వతిని సుషుమ్నగాను గౌరవిస్తారు.మూడునదుల సంగమము  ముక్తిప్రదమనుట
 నిర్వివాదాంశము..అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య  స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన అరుగు ప్రేదేశమును అమ్మగా తలుస్తారు.యద్భావం తద్భవతి.

     అమ్మవారిని అరూపిగాను,చెక్క ఊయలపై చిద్విలాసముగా ఊగుచున్న ఉమాదేవిగాను కొలుస్తారు.అమ్మను దీపాలను వెలిగించి,పుష్పాలతో వాటిని అలంకరించి ఆరాధిస్తారు.అమ్మవారిని నూతన వధువుగా అన్వయించుకుంటూ,ఒకసారి నూతన వధువుగా పల్లకిలో తల్లివెళ్ళుచున్న సమయములో కొందరు దొంగలు బోయీలను,బంధుమిత్రులను హింసించి,వధువును బంధించ ప్రయత్నించగా అమ్మ పల్లకినుండి దూకి అంతర్ధానమయినదని,పల్లకిని కూడ అమ్మ ప్రతిరూపముగా భావించి,నూతన వధూవరులు అమ్మను దర్శించి,ఆశీర్వచనములు పొందుతారు.అమ్మను అలోపి అనగా ఎటువంటి లోపములులేని మూర్తిగా భావించి,కొలుస్తారు.


  అమ్మవారి కొయ్యస్తంభము ముందు భక్తులు దీపములను వెలిగించి వానిని పూవులతో అలంకరిస్తారు.అమృతబిందువులు పడిన తీర్థము కనుక దీనిని తీర్థరాజముగా గుర్తించి కుంభమేళ ఉత్సవములను అత్యమ్యవైభముగా జరుపుతారు.ఇక్కడి మహావట వృక్షము అత్యంత మహిమాన్వితమై మూలమునందు ఆంజనేయస్వామి,శనీశ్వరునితో కొలువుతీరి భక్తుల కొంగుబంగారముగా కీర్తించబడుతుంది.సప్తమోక్షపురముగా ప్రయాగ మాధవేశ్వరినిలయము ప్రకాశించుచున్నది.ఆలయసమీపమున మాభగవతి-జ్వాలాదేవి ఆలయములు కలవు.సీతారామ మందిరము శ్రీకరముగా నెలకొనియున్నది.ఏకత్వములో అనేకత్వమునకు రూపారూపా మూర్త్యాయమూర్త్యా మాధవీదేవి అమ్మ మహిమను చాటుతున్నట్లు ప్రధాన గోపురము అనేకానేక గోపురములతో అమ్మతత్త్వమునకు ప్రతీకగా ప్రకాశిస్తు ఉంటుంది.

   శ్రీమద్భాగవతము ప్రకారము శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు వటవృక్షమహిమను వివరించినట్లు తెలుస్తోంది.అమ్మవారు మాధవేశ్వరీదేవిని మాయాసతి శరీరభాగమైన చేతివేళ్ళు పడిన చివరి ప్రదేశముగాను పరిగణిస్తారు.అయ్యవారు  మాణిక్యేశ్వరుడు.త్రిశూల సర్ప పడగలతో సాక్షాత్కరిస్తుంటాడు.
.

   స్వామి బ్రహ్మానంద అమ్మను ఇక్కడ మూడు జటలుగల బాలగా దర్శించారని నమ్ముతారు.నూతన వధూవరులు అమ్మను దర్శించి ఆనందపరవశులవుతారు.తల్లి నూతన వధువుగా పల్లకి నుండి దూకి అంతర్ధానమయినదని అమ్మను అలోపిగాను పూజిస్తారు.

  "మననాత్-ధ్యాత్ లభ్యతే ఇతి మాధవేశ్వరి" మనలను రక్షించును గాక.
  
      శ్రీ మాత్రే నమః.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...