Tuesday, December 26, 2017

ANANDA LAHARI-19

. శ్రీశైలే భ్రమరాంబికా
*****************
" శివ పార్శ్వావస్థిత మాతే శ్రీశైలే శుభపీఠికే
భ్రమరాంబిక మహాదేవి కరుణారస వీక్షణ"
" శ" కారము సుఖ బీజము."ర" కారము అగ్ని బీజము."ఈ" కారము చిఛ్చక్తి స్వరూపము.ఎటువంటి పరిస్థితినైనను అనుకూలముగా చేయగలది "శకారము." శకార-ర కార-ఈ కార సమ్మిళితము శ్రీశైలము. శ్రీశైలమునకు సిరిగిరి,శ్రీగిరి,శ్రీ పర్వతము మొదలైన నామాంతరములున్నవి.శ్రీ అనగా సంపద. శైలము అనగా పర్వతము."శ్రీశైలము" అనగా సంపద్వంతమైన పర్వతము.దీనికి శ్రీ కైలాసము అనుపేరు కూడా వ్యవహారములో కలదు.మహేశ్వరులు శ్రీ కైలాసమునందున్నారని 13 వ
శతాబ్దపు శాసనము తెలియచేయుచున్నది
కృష్ణానదీ తీరమున,దట్టమైన నల్లమల అడవుల గుట్టలపై పడిన మాయాసతి మెడ భాగము "భ్రమరాంబికా దేవి" గా భక్తులను అనుగ్రహించుచున్నది.అయ్యవారు మల్లిఖార్జున స్వామి. శ్రీ సిరివరపు నాగమల్లిఖార్జున శర్మగారి అభిప్రాయము ప్రకారము శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది.అష్టాదశ శక్తిపీఠములలో ఆరవది.దశ భాస్కర క్షేత్రములలోను ఆరవది.
అమ్మవారి గర్భగుహ లోపల అగస్త్యముని భార్య లోపాముద్రా దేవి,ముందు భాగమున శ్రీచక్రము ప్రతిష్టింపబడినవి.
దేవాలయ గర్భాలయ వెనుకభాగమున నిలబడి గోడకు చెవి ఆనించి వింటే ఝుమ్మనే భ్రమరనాదము వినిపిస్తుంది.ఇందులకు ఒక కథ ఉందని భావిస్తారు
అరుణుడు అను అసురుడు శ్రీపర్వతము మీద అచంచల
భక్తి విశ్వాసములతో బ్రహ్మగురించి కఠోర తపమాచరించెను.ప్రసన్నుడైన బ్రహ్మ ప్రత్యక్షమై
అరుణుని ఏదైనా వరమును కోరుకొమ్మనెను.దురాలోచిత వరములు దు:ఖ హేతువులు.సంతసించిన అరుణుడు బాగా ఆలోచించి తనకు రెండుకాళ్ళ ప్రాణి వలన కాని,నాలుగు కాళ్ళ ప్రాణి వలనగాని మరణము సంభవింపరాదు.ఆ వరమును అనుగ్రహింపమనెను."తధాస్తు" అని బ్రహ్మ అనగానే వరగర్వితుడైన అరుణుడు తనకు మరణభయము లేదని,దేవతలపై దండెత్తి వారిని స్వర్గమునుంచి తరిమివేసెను.అసహాయులైన దేవతలు ఆదిశక్తిని శరణు వేడగా,అమ్మ బ్రహ్మ వరమును గౌరవిస్తూనే తాను ఆరు కాళ్ళు గల షట్పదముగా మారి,తననుండి లెక్కలేనన్ని తుమ్మెదలను
సృష్టించి అరుణాసురుని అంతమొందించి,దేవతలను అనుగ్రహించెను షట్పదమునకు మరొక పేరు భ్రమరము.మకరందమునకై ఝుంకారము చేయుచు భ్రమణము చేయునది (తిరుగునది) కనుక దానికి ఆ పేరు వచ్చెను.శ్రీశైలమున తుమ్మెదల రూపమును ధర్మరక్షణకై ధరించిన తల్లి కనుక భ్రమరాంబ నామముతో కొలువబడుచున్నది..
" శ్రీ శైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నలభ్యతే."
ఒకసారి పార్వతీ పరమేశ్వరులు తమ భక్తులను పరీక్షించుటకై వృద్ధ దంపతులవలె కోనేరులో దిగి ఏ పాపము చేయనివారిని తమకు చేతిని అందించమనిరి.అందరూ ఏదో ఒక పాపమును చేసిన వారే.తొలగిపోతాయన్న నమ్మకము లేనివారే.కాని ఒక వేశ్య మాత్రము తాను శిఖర దర్శనము చేసినందువలన నిష్కళంకనని వారికి చేయినిచ్చి చరితార్థురాలయినది.
ఇక్కడ ఆదిదంపతుల పేర్ల విషయములోను కించిత్ చమత్కారము తొంగిచూస్తున్నది.సామాన్యముగా స్త్రీమూర్తులను పూలతోను పురుషులను తుమ్మెదలతోను పోల్చుట కవుల సంప్రదాయము.కాని ఇక్కడ స్వామి మల్లిక-అర్జునుడు.తల్లి భ్రమర-అంబ.శివతత్త్వామృతమను మధువును గ్రోలుటకు అమ్మ శివనామమను ఝుంకారమును చేయు మధుపముగా మారి,స్వామి చుట్టు నిరంతరము పరిభ్రమిస్తుంటుందట.నిర్గుణ,నిరాకార,నిరంజన మూర్తులకు లింగ భేదముంటుందా? చిద్విలాసములు తప్ప
ఫాలధార-పంచధారలు స్వామి లీలా విశేషములు.తెల్లమద్ది వృక్ష రూపములోనున్న స్వామి తల్లి ఎందరో రాజుల,చరిత్రకారుల కవి పండితులచే కీర్తింపబడుచు వారిని అనుగ్రహించుచున్నారు.పాండవులు,శ్రీ రాముడు కూడా ఇక్కడ ధన్యులైన వారే.కోయవారు,గిరిజనులు ప్రతి చైత్ర మాసమునందు "కుంభం" అను పేర జాతరను నిర్వహిస్తారు.పార్వతీ పరమేశ్వరులకు వారి భక్తులకు ఇక్కడ ప్రతిరోజు పండుగయే.
గోకర్ణ పురాణ స్తుత "పర్వతాగ్రే నదీ తీరే బ్రహ్మ విష్ణు శివాశ్రితే" మనలను ఆశీర్వదించును గాక
శ్రీ మాత్రే నమ:.
( అమ్మదయ
కొనసాగుతుంది.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...