Tuesday, December 26, 2017

ANANDA LAHARI -05

" దం ష్ట్రా  కరాళవదనే  శిరోమాలా విభూషణే
   చాముండే  ముండమదనే  నారాయణి నమోస్తుతే"

    చండముండాసురను  శిరస్ఛేదము చేసిన తదుపరి సిం హవాహిని యైన అమ్మ కాళి పరమేశ్వరిని దర్శించగా, తల్లి చండముండ ఖండిత శిరములను కాళి రెండుచేతులలో చూసి చాముండా అని పిలిచినదని దేవీభాగవతము పేర్కొంటున్నది.చాముండి పర్వతముపై వెలిసిన తల్లి కనుక చాముండేశ్వరీదేవి అనికూడా కొలుస్తారు.
  పూర్వకాలములో అనేక మునులు యోగులు నిశ్చలచిత్తముతో ఏకాగ్రతతో అమ్మకరుణ అను ఆహారము లభించువరకు ఒంటికాలిపై ఘోరతపముచేసి కృతకృత్యులయ్యారట.మనవునితో సమానమైన ఏకాగ్రత,పట్టుదల,చాకచక్యము గలది క్రౌంచము (కొంగఒక్కటే) తన కార్యము సఫలము అగువరకు దీక్షగా ఏటిగట్టున వేచియుంటుంది.అదే పట్టుదలతో ఏకాగ్రతతో ఎటువంటి ప్రలోభములకు లోనుకాకుండ ఎందరో తపమాచరించి తరించిన పట్టణము కనుక క్రౌంచపట్టణము అను పేరు వచ్చినదట.కాని కాల క్రమేణా కొంగజపము విపరీతార్థముగా వ్యవహారములోనికి వచ్చి దొంగ జపముగా మారినది.ఆ విధముగా చూసుకొనిన శుంభ నిశుంభులు తమ స్వార్థమునకు బ్రహ్మగురించి తపమాచరించి వరములు పొందిన తరువాత కన్నుమిన్ను కానని వారుగా మారి పరమేశ్వరిని పొందవలెనని చండముండాసురను అమ్మపై యుద్ధమునకు పంపిరి.తామస రజోగుణములు శుంభ నిశుంభులై సత్వగుణమూర్తియైన తల్లిని కోరుకున్నవి.

   మహిషాసురుడు ఈ పట్టణమును పాలించినాడని అందువలననే ఈ స్థలమును మహిషూరు-మహిసూరు అంటూ కాలక్రమేణా మైసూరుగా మారినదని అంటారు. కర్ణాటక రాష్ట్రములో ఈ పర్వత ప్రడేశములో మాయాసతి శిరోజములు చాముండేశ్వరిగా అవతరించాయని నమ్ముతూ అమ్మను కొలుస్తారు.

         అసలెవరీ  చండుడు-ముండుడు?

  కశ్యప ప్రజాపతికి దానదేవి యందు కలిగిన నూరుగురు పుత్రులలో ఈ కథకు సంబంధించిన శుంభ-నిశుంభులు,చండముండులు ఉన్నారు.నాముషి  వీరి చిన్న తమ్ముడు.అతడు ఇంద్రుని అనుమతి తీసుకోకుండానే సూర్య రథమును ఎక్కి సూర్యుని పాతాళమునకు తీసుకుని పొమ్మనెను.మార్గమధ్యములో అహంకారముతో సముద్ర కెరటముల నురుగుతో ఆడుకోవలెననుకొని,సముద్రుని శక్తిహీనునిగా తలచి,రథముదూకి కెరటముల నురుగుతో ఆడుకొనసాగెను.ధర్మ విరుద్ధము కనుక నురుగులో దాగియున్న ఇంద్రుడు నాముషిని హతమార్చెను.విషయము తెలిసికొనిన శుంభ నిశుంభులు ఉగ్రులై ఇంద్రుని స్వర్గమునుండి తరిమివేయుటయేగాక అక్కడి ఐరావతము మిగిలిన వానిని తమ స్వాధీనము చేసుకొనిరి. ఆ తరువాత భూలోకములోని రక్తబీజుని మంత్రియైన మహిషునితో చేయికలిపిరి.ఇంతవరకు జలాంతర్భాగమున దాగియుండిన చండ-ముండులు బయటకు వచ్చి తమ శత్రువైన జగన్మాతతో పోరాడదలచిరి.ఆపగలమా అమ్మలీలలు.అద్భుతాలు.అంతలోనే ఆమె సౌందర్యమునకు మోహితులై సర్వశక్తులు తమదగ్గర ఉన్నను చిఛ్చక్తి కావలెనని ఆమెను వివాహమాడుటకు సుగ్రీవుని దూతగా పంపిరి.సుగ్రీవుడు అనగా అందమైన కంఠము-కంఠస్వరము కలవాడు.వాని పలుకు విని అమ్మ నవ్వుతూ తనను రణములో ఎవరు జయిస్తారో ఆ  పరాక్రమవంతుని పాణిని స్వీకరిస్తానని సెలవిచ్చినది. 

       నిశుంభుడు క్రుద్ధుడై ధూమ్రాక్షుని నాయకుని చేసి ఆరువందల అక్షౌహిణి సైన్యముతో వింధ్య పర్వతము మీదుగా అమ్మపై దండెత్తెను.దుర్భాషలాడుచున్న ధూమ్రాక్షుని చూచి తల్లి హుంకారముతో వాని సైన్యమును భస్మపటలము గావించెను.హాహాకారములు ప్రతిధ్వనించుచుండగా రాక్షస సోదరులు చండముండాసురులను అమ్మపై యుద్ధముచేయుటకై పంపించిరి.వారు కొంతసమయము భూభాగమున మరికొంత సమయము అంతరిక్షమున జలమున దాగి తమ కుయుక్తులతో యుద్ధము చేయుచుండగా దుష్టశిక్షణ సమయమాసన్నమైనదని తల్లి సిం హవాహినియై కాళిక అవతరించి ఆకాసముననున్న వారిని గరుత్మంతుని రెక్కలయందుంచి,నేలకు దింపి వారిని సమీపించి తన ఎడమచేతితో వారి శిరములను పట్టుకుని,శిరోఖండనము గావించి ముక్తిని ప్రసాదించినది

      17వ శతాబ్దములో శ్రీ దొడ్దరాజవడియార్ గుడిమెట్లను,భారీ నందివిగ్రహాన్ని నిర్మించారుసంవత్సరాని కొక్కసారి సర్వాలంకార భూషితమైన చాముండమ్మను చూడటం అదృష్టంగా భావిస్తారు భక్తులు. తల మీదున్న చామరాజ ముడి (కిరీటం), కంఠాభరణాలతో, కర్ణ పత్రాలతో, 3 పతకాలు, హారం, 28 మణులను పొదిగిన కంఠి, జడ పిన్నులు, జడ బిళ్ల, వజ్ర ఖచితమైన త్రిశూలం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, కవచం, ఘంటా హస్త కవచం, కలశం, డమరుకాస్త్రం, ఖడ్గ హస్తం తదితర ఆభరణాలతో సర్వశోభితంగా చాముండీదేవి అలరారుతున్న  ఆ జగన్మాత మనలను రక్షించును.గాక.

   శ్రీ మాత్రే నమ:.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...