Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-009

 న రుద్రో రుద్రమర్చయేత్-10

**********************
మిత్రులారా ఈ రోజు మనము భక్తి అనే పదమును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ,నిల్వార్చనను చేసుకుందాము.
భక్తి-భక్తుడు-భగవంతుడు మూడును తానే అయిన పరమేశ్వర లీలా విశేషములను స్మరించుకుందాము.
కనుకనే ధూర్జటి మహాకవి అత్యంత చనువుతో,
నిను నా వాకిలిఁ గావుమంటినొ? మరున్నీ లాలకభ్రాంతిఁ గుం
టెన పొమ్మంటినొ? యెంగిలిచ్చితిను, తింటేగాని కాదంటినో?
నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింపఁ చే
సిన నా విన్నపమేల చే కొనవయా? శ్రీకాళహస్తీశ్వరా!
ఈశ్వరా! బాణాసురునిలాగా నిన్ను నా గుమ్మము వద్ద కాపలా
కాయమన్నానా? దేవతా స్త్రీలపై మోహపడి, వారివద్దకు రాయబారిగా
వెళ్ళమన్నానా? తిన్నడు లాగా ఎంగిలి మాసం పెట్టి, తింటే గానీ
వీల్లేదన్నానా? ఏ తప్పు చేశాను. సజ్జనులను రక్షించమన్నాను. అంతేకదా!
నా ప్రార్ధన వినిపించుకోవేమి?అని చనువుగా ప్రశ్నించాడు.
నీ అనుగ్రహ ఉపేక్షయే కాని నా భక్తిలోపముకాదు అని మరీ ఎవరెవరిని అనుగ్రహించాడో ,వారి ప్రవర్తన ఎటువంటిదో గడుసుగా చెప్పాడు.
విడిచిపెట్టలేనిది వ్యసనము.దానిని కలవాడు వ్యసనపరుడు.వాడికి వ్యసనము యజమాని.వాడు దాని బానిస.
వారి వ్యసనములను సైతము లెక్కించక కరుణించాడంటే స్వామి కూడా వ్యసనపరుడేనేమో.కాదని చెప్పలేము కదా.దేనిని విడిచి ఉండలేమో అది వ్యసనము కాక మరేమిటి?
తన భక్తులను రక్షించకుండా ఉందలేని వ్యసనపరుడు స్వామి.ఓం నమః శివాయ.
శరణుపొందిన సాత్వికులను పరిపాలించు రుద్రునకు నమస్కారము .
నిష్కళంకభక్తి అనుగ్రహిస్తుందనటానికి నిదర్శనము గజాసుర వృత్తాంతము.అసలే గజము.భారీశరీరము.అహంకారమునకు మారుపేరు.దానికి తోడు మదము.కాని పూర్వజన్మ సుకృతము తోడ్కొని వచ్చింది పుట్టెడు శివభక్తిని.పట్టువిడువక గట్టిగా పట్టుకుంది స్వామి పాదములను.వాలిన భక్తి వానిచే చేయించింది శూలికొరకు తపము.
" నీ పంచనన్ పడియుండగా గలిగినన్ భిక్షాన్నమే చాలు" అని పించింది.ఆదిదేవుని అబ్బురపరచినది.అసలే భక్త సులభుడు,అవశ్యమే దర్శనమిచ్చాడు.ఆత్మీయతతో ఏమి వరము కావాలో కోరుకోమన్నాడు గజాసురునితో.ఎంతైనా "పశూనాం పతి" కదా.స్వామి అనుగ్రహిస్తానన్న వరమే యజమానియై స్వామిని శాసించినది.
భగవః -సమగ్రమైన ఐశ్వర్యము,కార్యము-యశస్సు,శ్రీ-జ్ఞానము-వైరాగ్యము అను భగములు కలవాడు భగవంతుడు.భక్తునికి బానిస కాబోతున్నాడు.బంధ విమోచనుడు భక్తుని యజమానిని చసి తాను బానిస కాబోతున్నాడు. బ్వానిసలను కట్టుబానిస-పుట్టు బానిస అని రెండువిధములుగా పరిగణింప వచ్చును.
ఇక విషయానికి వస్తే సర్వము తానైన స్వామి తనభక్తునిచే ఇలా పలికించాడు.
"దేహో దేవాలయో ప్రోక్తః జీవోదేవ సనాతనః"
హరహర మహాదేవ శంభో ఆడిన మాట తప్పరాదు.నా ఆశ తీరగ నా హ్రిదిలో నిండి,నా ఉదరములో నివసిస్తూ,ననాందపరచు నా తండ్రీ.నీస్థూలరూపము నాఉదరములో నుండునట్లు నన్ను ఆశీర్వదించుము.
వినాశకాలే విపరీత బుధ్ధి అన్నారుపెద్దలు.గజాసురుని బుధ్ధి వక్రించి,భువనభాండములను అతలాకుతలము చేసింది.గంగిరెద్దుల మేళమును తెప్పించి,గజాసురునికి మంగళమును పాడించింది."తన వారిచే గజాసురుని అహంకారమును అస్తమింపచేసినది..
వాని శిరము లోకపూజ్యమైనది.చర్మము స్వామిని కృత్తివసనుని చేసినది.
భగవంతుడు స్వతంత్రుడై భక్త రక్షణము చేయుచుండగా మదిలో మెదిలినది మరొక కొంటె ఆలోచ మహాద్భుతమునకు దారితీస్తూ,భక్తుని బానిసగ చూపిస్తూ పెరియ పురాణము ప్రస్తుతిస్తున్నది.
.
పిత పిరాయి సూడి."
చిదానందరూపా- సుందరమూర్తి నాయనారు
********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
హాలాహలధరుని సఖుడు అలల సుందరారు
సదయ-ఇసయల సుతుడు ఇలను పేరు అరూరారు
నరసింగ మానై ఇంట పెరుగుచు,నగజపతిని నమ్మి కొలుచు
అల్లుడితడని పెండ్లిచేయ నందకవి సుందరారుని పిలిచె
తానొకటి తలచినవేళ దైవము వేరొకటి తలచు అని అన
తాళికట్టనీయకనే తగవుగ వానిని తన బానిసనియెగ
పితకు బానిసననియున్న పత్రము పెద్ద విచిత్రమునే చేసెగ
పినాకపాణి కృపనుపొందగ పిత అను పిలుపు కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
పిత అను తమిళపదము పిచ్చి అను అర్థములో వాడబడుచున్నప్పటికి అవధులు లేని భక్తి సుందరారును పిచ్చివానిగా పిలుచునట్లు చేసెను.
నవ విధ భక్తులలోనిదైన సఖ్య భక్తితో శ్రీకృష్ణుని కొలిచినది కుచేలుడైతే,పరమేశ్వరుని కొలిచినది సమయాచారపరుడైన సుందరారు నాయనారు.జగద్రక్షణార్థము కేవలము 18 సంవత్సరములు మానవ శరీరమును ధరించిన మహా జ్ఞాని.క్షీరసాగర మథనమునందు జనించినహాలాహలమును తన అరచేత ధరించి పరమేశునకందించుటచే హాలాహల సుందరారు అని,కాల క్రమేణ అలల సుందరారు అని కీర్తింపబడుచున్నాడు.
"సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః
తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"
కారణ జన్ముడు సంసారసంకెలలో బంధింపడకుండా పెండ్లిమంటపమునకు ఒక పెద్దపత్రమును తీసుకుని వచ్చెను.అందులో తీసుకొనిన అప్పు తీర్చలేనందున సుందరారు వంశస్థులు వచ్చిన పెద్దమనిషికి బానిసలై సేవించవలసి యున్నది అని యుండెను.
కైవల్య మార్గమున నడవ వలసిన తనభక్తుడు కామార్థ మార్గమున నడుచుతకు సిద్ధమవుతుంటే ఒద్దనకుండా ఉండగలడా ఒద్దికైన దేవుడు.ముద్దుగ బానిస పత్రమును నడుమున దోపుకొని నటనా విభూషణుడు తనభక్తుని మందలించి,మహనీయుని చేయదలిచాడు.ముల్లోకములనేలు స్వామి పిచ్చివాని రూపుగ వచ్చి పెండ్లి జరుగనీయక పెద్ద సమస్యను తెచ్చి,సుందరుడు పుట్టు బానిస కనుక తన వెంట రావలెనని, న్యాయస్థానములో ఒప్పించి తన వెంట తీసుకొని వెళ్ళుచున్నాడు.
సుందరారు మానవ శరీరమును ధరించుటకు రెండు కారణములను పెద్దలు ప్రస్తావిస్తారు.
1.కైలాసములో నున్నప్పుడు శివపూజకు పూవులను సేకరించు సమయమున,అక్కడకు పూలనిమిత్తమువచ్చిన పార్వతీదేవి చెలికత్తెలైన,కమలిని-అనిందితిని అను వారిని క్షణకాలము మోహదృష్టితో చూచినందులకు ఆగ్రహించినఆదిదేవుడుమానవుడై పుట్టి వారిని మనువాడమనుట.తప్పు తెలిసుకొని శరణువేడిన సుందరుని చూసి,శంకరుడు సాప పరిధిని తగ్గించుట.
2 రెండవది బాహ్యమునకు శాపము కారణమైనప్పటికిని,తద్వారా సుందరారు కీర్తనలను-కీర్తిని లోక పూజ్యము చేయుటకు అనుగ్రహము ఆగ్రహ మేలిముసుగును ధరించి మేలుచేసినది.
ఓం నమః శివాయ.
తిరునావలూరులో సదయ నాయనారు-ఇసయజ్ఞాని నాయనారులకు దైవానుగ్రహము వలనపుత్రుడుగా జన్మించిన సుందరారు నామధేయము నంబి అరూరారు
" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం సమార్పణం'
అటువంటి ఏకబిల్వమే సదయ-ఇసయ-సుందర నాయనార్ల కుటుంబము. .
సుందరారు తాళికట్టు సమయమునకక్కడికొక పిచ్చివాడు చేతిలో ఒక పత్రముతో వచ్చి, పెండ్లిని అడ్డుకొనెను.వాని చేతనున్నపత్రమును పెద్దలకు చూపిస్తు,వీడు నా బానిస కనుక నేను వీడిని నాతో తీసుకొని పోతాను అని చెప్పెను.సాక్ష్యమైనపత్రమును చదువగా అందులో " నేను పితకు (పిచ్చివానికి) వాని వంశమువారికి బానిసనని త్రికరణగా అంగీకరిస్తున్నానని వ్రాసి,సుందరారుచే సంతకము చేయబడి ఉన్నది.సంతకము సరిపోవుటతో చేయునదిలేక వారు పెండ్లికొడుకును తనతో తీసుకొనిపోవుచున్న పిచ్చివానిని వాని ఇల్లుచూపమని వెంబడించిరి.కొంతదూరము సాగిన తరువాత వారిరువు గుడి దగ్గర అదృశ్యమైనారు."ఓం నమః శివాయ."
" నా మనసంతా నిండె శివ పదమె
గురువై నడిపించె శివ పథమే' అని కీర్తించుచున్న సుందర నాయనారు నకు బానిస యను నెపమున భవసాగరమును దాటించిన భక్త పరాధీనుడు సర్వమంగళములను చేకూర్చుగాక. ఆ మహాదేవుడు మనందరిని శివ పథము వైపు నడిపించును గాక.
మరొక కథాకథనముతో
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)
3 మంది వ్యక్తులు చిత్రం కావచ్చు
Saiprasanna Parsa

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...