Sunday, November 13, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-18

 


న రుద్రో రుద్రమర్చయేత్-20

 *********************

 రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం

 నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |

 జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

 దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ ||


  శివ మానసపూజ స్తొత్రం-ఆదిశంకర విరచితం.


   ప్రియ మిత్రులారా మనము ఈ రోజు బిల్వార్చనను "స్థపతి" పద అర్థమును తెలుసుకునే ప్రయత్నముతో చేసుకుందాము.

  నమకములో సైతము ఈ పద ప్రసక్తి,

 2వ అనువాకము-9వ యజస్సు

 " నమో రోహితాయ స్థపతయే వృక్షానాం పతయే నమః" ఉభయనమస్కార యజస్సు.

  వృక్షలను ప్రతిష్టించు ఎర్రని రంగుగల రుద్రునకు నమస్కారములు.

   కేవలము వృక్షములను మాత్రమే స్థాపించువాడా రుద్రుడు అనే సందేహమునకు సమాధానము రావాలంటే రుద్రుని అనుగ్రహముతో మరింత నిశితముగా "స్థపతి" సబ్దమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నించవలసినదే.

 "సర్వత్ర స్థాతాయచ-సర్వత్ర పాతాయచ స్థపతిః."

 అంతటను నుండువాడు-అంతటను పాలించువాడును స్థపతి.

 మనము సూర్యునిగా అన్వయించుకుంటే గ్రహగోళాదులను స్థాపించువాడు.

 రుద్రునిగా అన్వయించుకుంటే జీవమును దేహాదులయందు స్థాపించువాడు.

 పంచ భూతములను నిర్దిష్టముగా స్థాపించి,వానిని పంచేంద్రియ సమన్వయముచేసి,ప్రపంచమును స్థాపించువాడు.

 కనుకనే భూమి యందు సైతము కొన్నిచోట్ల ఖనిజములు,కొన్నిచోట్ల వనములు,కొన్నిచోట్ల గిరులు,కొన్నిచోట్ల జలములు వర్నింపగరానిది స్వామి స్థపనత్వము.నమో నమః




   వైదిక దైవారాధనలలో సైతము మనము మండపారాధనయందు,కలశమునందు "స్థాపయామి-పూజయామి" అని వింటూనే ఉంటాము.

 భాషాపరముగా అన్వయించుకుంటే "శిల్పి" అను శిలలను చెక్కి వినూతన రూపమును కల్పించువానిని స్థపతి అంటారు.నిజమునకు పరమేశ్వరుడు చేయుచున్న పనికూడాదేగా.

 రాయి యథాతథముగా నుండనీక సుత్తితో పనికిరాని కొన్నిభాగములను ఒక్కొక్కసారి కఠినముగా/మరొకసారి సుతిమెత్తగా తొలగించివేయగానే అందమైన మూర్తి ఆవిష్కరింపబడుతున్నది.నిజమునకు ఆ సౌందర్యము ఎక్కడీనుంచో వచ్చి చేరలేదు.ఉన్న కొన్ని లోపములను తొలగించుకొనగానే స్పష్టముగా ప్రకటితమవుతున్నది.మనము రూపము మారినప్పుడు తొక్కుతాము.సవరించుకున్నవేళ మొక్కుతాము.

 ఈ సందర్భములో రంగనాథ సినీనటుడు వ్రాసిన కవిత గుర్తుకు వస్తున్నది.ఒక రాయి చాకలిబండయైనది.మరియొక రాయి చల్లని అండ అయినది.రెండు కలిసివున్నప్పుడు ఏది ఏదో గుర్తించలేని పరిస్థితిలో మనమున్నాము.కాదనలేని నిజము.దానిని విడదీసి వివరించిన శిల్పికి జోహారులు.

 ఆ బండ ఏదో కాదు.ఉపాధులుగా కనపడుతున్న మనమే.మన హృదయములో నుండి అనవసర ఆలోచనలను తీసివేయ గలిగితే అత్యంత మనోహర శిల్పముగా మారుతుంది.ఆ పని రుద్రుడను శిల్పికే సాధ్యము.


   ఈశ్వరచైతన్యము స్తపనశక్తిగా స్థూలములోను/సూక్ష్మములో హితమును కలిగిస్తుంటుంది.

 చమకములో ప్రస్తావించినట్లు రుద్రుడు భూభాగ నిర్దేశము,జలభాగ నిర్దేశము చేస్తూనే,భూభాగములలో కొన్ని కొండలుగాను,కొన్ని పంటపొలములుగాను,మరికొన్ని లోహసమృద్ధములుగాను,ఇంకొన్నింటిని ఖనిజ సంపన్నములుగాను,మరికొన్నిచోట్ల తైల సంపన్నములుగాను,కొన్ని ప్రదేశములను ఔషఢనీయ వృక్ష సంపన్నములుగాను నిర్ణ్యయిస్తూ స్థాపనము చేస్తున్నాడు.అంతా బంగారమయమైన ప్రదేశమే అయినచో ఆహారము సంగతేమిటి? ఆహారమే అయినచో దప్పిక తీర్చుకొనుటకు జలమునెవరు ఇస్తారు? అంతా దట్తమైన అడవులే అయితే సూర్యుని వెలుగు భూమిని తాకగలదా? అడవులే లేకపోతే వానలెలా కురుస్తాయి? వాటన్నంటికి అనుగుణముగా పంచభూత ప్రపంచమును సమర్థవంతముగా తీర్చిదిద్దినశిల్పి అదే స్థతి ఆ రుద్రుడు.

   జీవుల విషయానికి వస్తే/సూక్షముగా స్వామి స్థపనత్వమును పరిశీలిస్తే పిండముగా ఏర్పడినప్పటి నుంచి,శిశువుగా రూపుదిద్దుకొనువరకు చిత్ర విచిత్ర మార్పులను అలిగిస్తూ,అవసరమైనవాటికి కలిగిస్తూ,అనవసరమైన వాటిని తొలగించే సంస్థాపకుడు రుద్రుడు.

 అంతెందుకు మన శరీరములో ఎక్కడెక్కడ ఏ ఏ సప్తధాతువులను ,శబ్దము యొక్కనాలుగు రూపములను దాని గమనమును ,పది వాయువుల పనితనమును నిర్దేశించేవాడు స్థపతి.వ్యర్థమును తీసివేస్తూ శక్తిగా ఆహారమును మార్చు విచిత్ర అవయవములను చెక్కిన శిల్పి ఆ సదాశివుడు.

    భక్తుల విషయమునకు వస్తే ఇద్దరు.ఇద్దరిది ఒకటే సంకల్పము.స్వామికి వైభవోపేతముగా ఆలయమును నిర్మించుట.ఒకరు మహారాజు.అత్యంత సంపన్నుడు.సమర్థవంతుడు.

ప్రకటిత భక్తి ప్రాధాన్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు రాజసింహ  బిరుదాంకిత పల్లవరాజు కదవర్కన్.మోక్షక్షేత్రమైన కాంచీపురములో అత్యద్భుత కైలాసనాథర్ దేవాలయమును అత్యంత బ్రహ్మాండముగా కట్టించాడు.

 నాలుగంతస్థుల గర్భగుడి,అనేకానేక మంటపములు,పెద్ద పెద్ద ప్రాకారములు,వివిధభంగిమలలో వినూతన శివ మూర్తులు,విస్తీర్ణము నెంచలేని విశాలత్వము,అద్భుత శిల్పసంపదలు,అతిమనోహర నిర్మానములు,అట్టహాసమునకు ఆడంబరముగా అలకమ్రించుకుని స్వామి ప్రతిష్ఠకై సుముహూర్తమును కూడా సిద్ధము చేసుకుని ఉన్నది కంచీపురములోని కైలాసనాథుని దేవాలయము.


 ఆలయప్రారంభము తలచుచు నిద్రించుచున రాజు స్వప్నములో స్వామి కనిపించి,భక్తిని మెచ్చుకుని,తాను రాలేని అసహాయతతో నున్నాననెను.కారనమును అదేసమయములో మరొక భక్తునకు ఆలయ ప్రారంభమునకు-ప్రతిష్ఠాపనమునకు ఇచ్చిన మాటగా సెలవిచ్చెను.





శివలీలను గ్రహించగలుగుట సామాన్యమైన విషయమా?


ఆటను ప్రారంభించాడు ఆదిదేవుడు.


అదే రాజ్యములో,అదే కాలములో,అదే వేగముతో భిక్షాటనతో జీవనము చేస్తున్న అతి నిరాడంబరముగా నున్న, పూసలర్ మానసమందిర నిర్మాణమునకు నాంది పలికినాడు నందివాహనుడు.అదియే


"హృదయేలేశ్వరాలయము"

అంతా గోప్యము.అదియే దాని గొప్పతనము.


పూసలర్ నాయనర్ తొండైమండలములోని తిరునిన్రాపురములోని పరమ శివభక్తుడు.కాని సామాన్యుడు.మానసికోపాసన మహోత్కృష్టతను చాటిన మహనీయుడు.




తన మనసునే ఆసనముగా నిలిపి పరమేశుని ఆహ్వానము/ఆవాహనము చేసేవాడు.చల్లనినీటితో స్నానమును సమర్పించేవాడు.దివ్యమైన వస్త్రములను కట్టేవాడు..కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములతో కూడిన చందనమును అలదేవాడు.జాజి-చంపకములు మొదలగు దివ్య కుసుమములతో పాటుగా,


" త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం

త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పనం" అంటూ

బిల్వార్చనను భక్తితో చేసేవాడు.మంచితలపులను ధూపముగా,మించిన భక్తిని దీపముగా సమర్పించి సతుష్టుడయ్యేవాడు.స్వామియును సంబరముతో నిరాడంబర భక్తికి దాసుడయి,అరాధనమునకు ఆనందపడేవాడు.


అవధులు లేని ఆనందము మానసికభక్తిని మహోన్నతము చేయాలనుకున్నట్లుగా,పూసలర్ మనసులో పరమేశ్వర మందిరనిర్మాణమునకు తొందరచేసింది.

  రొక్కము అవసరములేని సొక్కపు భక్తి అది.

  ****************************

 భక్తునిచిత్తములో ఆలయనిర్మాణపు విత్తును నాటినవాడు,

మొలకెత్తి పెద్దదగుటకు తన కటాక్షమను గంగను కురిపించినాడు.అనుకూలతకు అన్ని హంగులను సరంజామలను పూసలారు తాను సమకూర్చుకున్నానని భావించేలా చేశాడు.

 భావనాబల భాగ్యమేమో యన స్థపతి 

మంచి సమయమున మానసికముగా శంఖుస్థాపన చేసి ,తనకు నచ్చిన విధముగా నందివాహన మందిరమును నిర్మించి,స్వామి ప్రతిష్ఠకు స్థిర ముహూర్తమును నిశ్చయించుకొని,స్వామికి విన్నవించాడు కరుణించి విచ్చేయమని స్వామిని పూసలారు.

కాదనగలడా కన్నతండ్రి.

  అప్రకటిత భక్తి అనిశము ఈశుని సేవిస్తుంటే నేనున్నానంటు ప్రకటిత భక్తి పందెము వేస్తూ కాడపరాజు రూపములో కంచిలో కైలాసనాథదేవాలయమును బ్రహ్మాండముగా నిర్మింపచేసి,స్వామి ప్రతిష్టకు అదే ముహూర్తమును సుముహూర్తముగా నిర్ణయింపచేసినది.


"పరీక్షపెట్టు పరమేశ్వరుడు వాడే- కటాక్షించు సర్వేశ్వరుడు వాడే"


ఆసక్తికరమైన ఆటను ప్రారంభించాడు.అభ్యర్థించిన తన భక్తుడైన రాజుకు స్వప్న సాక్షాత్కారమునందించి ముహూర్తమునకు రాలేని తన నిస్సహాయతను వివరించాడు.దానికి కారణము తాను అంతకు ముందే పూసలర్ నాయనర్ నిర్మించిన మందిరములో జరుగబోవు కుంభాభిషేకము నకు

ఉండవలసివచ్చుట.ఆడిన మాట తప్పలేని అడ్డంకి.


నిర్ఘాంతపోయాడు రాజు.


కాచేవాడి మాటను కాదనలేని వాడు.మేల్కొని తాను పూసలర్ నాయనారు నిర్మించిన ఆలయమును దర్శించవలెనని తిరునినాపురమునకు

వెళ్ళాడు.


ఆలయమెక్కడ కనపడలేదు.డమరుకనాథుడు కనపడలేదు.అటు-ఇటు చూశాడు.అటుగా వెళుతున్నవారిని అడుగగా వారు అపహాస్యముచేసారు పూసలరు వింతప్రవర్తనను.

     భక్తి-భగత్వము-భక్తుడు అను మూడుగా విభజించబడినవి మమేకమై ప్రకాశిస్తున్నవి.భవతాపపరిహారములైనవి.

  అభిషేకము సర్వము జారిపోవునదే అన్న సత్యమునకు సంకేతమే కదా.మహారాజు మాయపొరలు క్రమక్రమముగా జారిపోవుచున్నవి.

    కుంభాభిషేక నెపము మెల్లమెల్లగా తనపని తాను చేసుకుని పోతున్నది. 

 


" ఆత్మానాం గిరిజాపతి"  ఆశీర్వచనము  

.


భక్త హృదయములలో కరుణగంగను వర్షించింది.


పునీతులను గావించిన పరమేశుని కరుణగంగ సకలలోకములను సంరక్షించును గాక.


 మరొక కథాకథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.


( ఏక బిల్వం శివార్పణం.) 




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...