Thursday, January 25, 2018

AMMAA ADINEEVENAA

జననీ జోహారులు
ఒదిగి ఒదిగి అందించే,ఒద్దికైన ప్రేమను
పొదుగుతున్న కోడిలో,నీలో నే చూస్తున్నా
చక్కని రూపమునిచ్చిన ఓర్పుకు నా జోహారులు
..............
హారము రిపుసం హారమనే అపురూపపు ప్రేమను
ఎగురుతున్న కాకిలో,నీలో నే చూస్తున్నా
చల్లని జీవితమును ఇచ్చిన ఉక్తికి నా జోహారులు
.....................
బుద్ధులను నేర్పించే సత్యబద్ధమైన ప్రేమను
పూజిస్తున్న గోవులో,నీలో నే చూస్తున్నా
విచక్షణను ఇచ్చిన శిక్షణకు నా జోహారులు
....................
సందు సందు మారుచున్న అందమైన ప్రేమను
దాస్తున్న పిల్లిలో,నీలో నే చూస్తున్నా
అప్రమత్తతను ఇచ్చిన ఉదాత్తతకు నా జోహారులు
......................
వీక్షణమున రక్షించే లక్షణమైన ప్రేమను
ఒడ్డునున్న తాబేటిలో,నీలో నే చూస్తున్నా
కరుణను వర్షించే కన్నులకు నా జోహారులు
.......................
వెనుకంజయే లేని వెన్నంటు ప్రేమను
ఎగురుచున్న కంగారులో,నీలో నే చూస్తున్నా
విడువక ముడిపడిన కడుపుతీపికి నా జోహారులు
.......................
గుడ్లను గూటికి మార్చిన గుండెకోత ప్రేమను
రాగాల కోకిలలో,నీలో నే చూస్తున్నా
అనురాగము వెదజల్లు త్యాగమునకు నా జోహారులు
..........
ఎన్నెన్నో రూపాలలో ఎన్నలేని ప్రేమను
పరిమాణము కొలువలేని ప్రణామముల కోవెలను
మొక్కుబడి తీర్చినట్లు ఒక్కరోజు మొక్కుటేల
ఎదగుడిలో ప్రతిష్టించి
పదిలముగా పూజిద్దామొ
జగమంతా నిండిన జననీ జోహారులు.
అమ్మా అన్నింటిలో నీవే కనిపిస్తున్నావు
కమ్మని నీ ప్రేమతో నన్నే మురుపిస్తున్నావు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...