Thursday, January 25, 2018

KALIKAMBA NAAYANAR

" చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగ తలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపుచేటు."
చిదానందరూపా-కలికాంబా నాయనారు
*******************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
కపర్ది భక్త విధేయుడు కలికాంబా నాయనారు
కడుభాగ్యము కలిగినదని కల్మషమెరుగక కొలుచువాడు
వానిభక్తి పరీక్షించ తలిచాడు పరమేశుడు
వాని పూర్వ సేవకుని అతిధిగా పంపించాడు.
తన-పర భేదమును మరచినాడు తన్మయత్వములోన
అతని భార్య సేవకుడని అతిధిపూజ చేయలేదు
అమాంతముగా ఆమెచేతులు నరికి తనపూజను కొనసాగించాడు
అహమును తొలగించుటకు అవిటితనము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక
" సభాభ్యో సభాపతిభ్యో నమోనమ:" సభను నిర్వహించేవాడు-సభాసదులు రెండుగా మనకు తోచు చున్నను రెండింటిలో నున్న వాడు శివుడొక్కడే అని నమ్మి కొలుచువాడు పెన్నగడం లోని కలికాంబ నాయనారు.ఆయన ధర్మపత్ని కూడ పరమ శివభక్తురాలు.అనుకూలవతి.
నంది-భృంగి తన ద్వారపాలకులుగా సేవిస్తుంటే, తాను బాణుని శోణపురికి కాపరిగ ఉన్న పరమేశుని లీలలు పరమ మనోహరములు."విశ్వేభ్యో-విశ్వ పతేభ్యో" అయిన సామి తన లీలను పునర్వ్యక్తీకరించుటకు పావులను కదపసాగాడు.మహామాయ కలికాంబ మదిలోని విజ్ఞతను కప్పివేసింది హృదయ రాజీవము రజోగుణ పూరితమైనది..కపిలేశ్వరుడు కదిలాడు నాయనారు ఇంటిలో పనిచేసి మానేసిన సేవకుని ఆకృతిలో.రసవత్తరమైన ఆట మొదలైనది.అతిధినిసేవిస్తూ అమితానందమును పొందుతున్నాడు నాయనారు.కాని అదేమి చిత్రమో యజమానురాలినన్న భావము సామ్రాజ్యమేలుచుండగా అతిథిని, సేవకుడిగా గుర్తించి,సేవకుని అర్చిచుటకు అహము అడ్డుగోడగా మారింది.ఈశ్వరభావము ఆమె కన్నులకు ఇసుమంతైనను కలుగనీయలేదు అమెలో ఆ మూడు కన్నుల వాడు..కలిగితే కథ మరోలా ఉండేది కదూ." బుద్ధిః కర్మానుసారిణి" అని అంటారుకదా.భర్త మాటను పెడచెవినిపెట్టి, శివభక్త పూజలో పాల్గొనలేదు.కమలాక్షునర్చించు కరములు కరములు-చేయనప్పుడు అవి నిష్ప్రయోజనమేనని తక్షణమే ఆ చేతులను నరికివేసి తన పూజను కొనసాగించెను నాయనారు. నిశ్చలభక్తికి సంతసించి నాయనారు దంపతులను అనుగ్రహించిన నాగాభరణుడు మనలనందరిని అనుగ్రహించుగాక.
(ఏక బిల్వం శివార్పణం.).

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...