Thursday, January 25, 2018

MAANIKYEA DAKSHAPEETIKA

 మాణిక్యే  దక్షపీఠికా

  " ద్రక్షావతి స్థితశక్తి విఖ్యాత మాణిక్యాంబికా
   వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయిని

     పంచభూతములు  సమతౌల్యమును పాటించు పవిత్ర ప్రదేశము "ఆరామము".అమరారామము,ఖీరారామము,సోమారామము,భీమారామము,దక్షారామము అను పంచారామములో "దక్షారామము" ఒకటి.ఆరామము అనగా అతిమనోహరము అను అర్థము కూడాకలదు.ఆరామ అనగా శ్త్రీ అనే అర్థము ఉండి.స్త్రీత్వముతో అనగా మాతృత్వముతో అనుగ్రహించెడి పవిత్ర క్షేత్రములు ఆరామములు అని భావించుటలో తప్పులేదేమో.మాయాసతి ఎడమబుగ్గ పడిన ప్రదేశము ఎనలేని వాత్సల్యమై
 మాణిక్యాదేవియై మనలను ఆశీర్వదించుచున్నది.పార్వతీ పరమేశ్వరులు కైలాసము నుండి,కాశికి ,కాశి నుండి దక్షారామమునకు విచ్చేశారని స్థలపురాణము చెప్పుచున్నది.దక్షుడు నిరీశ్వర యాగము చేసిన ప్రదేశము తిరిగి భీమేశ్వరునిచే సంస్కరించబడినది కనుక దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు.దక్షప్రజాపతి పుత్రిక దాక్షాయణి పేరుతో దాక్షాయిణి పురమని కూడా పిలుస్తారు.కాలక్రమేణ ఆరామము ఉద్యానవనముగా వ్యవహరింపబడుచున్నది.

    త్రిలింగ శైవ పుణ్యక్షేత్రాలుగా కీర్తింపబడుతున్న కాళేశ్వరము,శ్రీశైలము,భీమేశ్వరములలోని భీమేశ్వర పుణ్యక్షేత్రమే దక్షారామము.
దక్షారమము భోగ క్షేత్రము(అయ్యవారు) మరియు యోగ క్షేత్రము(అమ్మవారు).అర్థనారీశ్వరమైన స్వామి పక్కన అమ్మవారు యోగ ముద్రలో కూర్చుని దర్శనమిస్తారు.

    సూర్యభగవానుడు నిత్యము అతిపొడవైన భీమేశ్వర స్పటిక లింగమును అభిషేకించెడివాడని,అభిషేకము తరువాత
 సప్తర్షులు సైతము ఆ వేడిని భరించలేక,సమీపించలేక పోయెడివారని,పరమేశుడు వారిని అనుగ్రహించి,గోదావరినదీ ఏడుపాయల జలముతో చల్లబరచుకొనుచు వచ్చి తమను సేవించుకొనమని సెలవిచ్చాడట.అందు వలన
 ఏడుపాయలుగా చీలిన గోదావరి సప్తగోదావరిగా ప్రసిద్ధికెక్కినది.అందులో భరధ్వాజ,జమదగ్ని,విశ్వామిత్ర
 ఋషుల తపోశక్తులు అంతర్లీనముగా ప్రవహిస్తూ ఉంటాయట. సప్త
 గోదావరిగుండము తాను పునీతురాలై భక్తులను పునీతులను చేస్తుందట.

      అతి పొడవైన భీమేశ్వరస్వామి లింగము రెండు భాగములుగా ద్యోతకమగుతు,రెండస్థుల దేవాలయములో దేదీప్యమానముగా దీవెనలను ఇస్తుందట.తుండి గణపతి-నాట్య గణపతి ద్వారపాలకులుగా స్వాగతించు ఈ దేవాలయము వేంగీ రాజైన భీమునిచే పునర్నిర్మింపబడినదని అంటారు.

  మాణిక్యాంబను గురించి వేర్వేరు కథలు ప్రచారములో కలవు.

    చనిపోయిన తన కుమార్తె రూపమును  స్వర్ణప్రతిమగా చేయించుకొని,మణిమాణీఖ్యములను అలంకరించి ఒక విప్ర పూర్వ సువాసిని ఆరాధించెడిదట.ప్రసన్నురాలైన తల్లి అదేరూపములో ఆమెను కరుణించెనట.

   మరొక కథనము ప్రకారము భీమేశ్వరుని పతిగా ఊహించుకొనుచు కొలుచు ఒక వేశ్యను
 అనుగ్రహించిన తల్లి ఆమె పుత్రికగా జన్మించి,కరుణించినదట.

     ఇంకొక స్థలపురాణము ప్రకారము తారకాసురుడు పరమశివుని అర్చించి.వరముగా ఆత్మలింగమును పొందెను.దానిని తన కంఠమున ధరించి,వరగర్వితుడై అనేక
 దుష్కృత్యములు .సాధువులను,సజ్జనులను,దేవతలను హింసించ దేవతలు తల్లిని వేడుకొనగా తన తనయుడైన కుమారస్వామిచే తారకుని తుదముట్టించి శివుని ఆత్మలింగమును తన అరచేత ధరించి ఆదిశక్తిగా అమ్మ మనలను,శ్రీచక్రముపై అధిస్ఠించి అనుగ్రహిస్తున్నదని తలుస్తారు.

  "పృధ్వి పదునెనిమిది యోగశక్తి
   గణములలో నెంచ సర్వ శృంగారి యగుచు
   భీమ నాథుని సన్నిధి ప్రేమవెలయు
   మాణికాదేవి సకల కళ్యాణమూర్తి" అని కవి సార్వభౌమ శ్రీనాథ మహాకవి అమ్మను దర్శించినాడు.

  సంతానార్థము వచ్చినవారిచే నాగప్రతిష్టలను చేయించుకుని, వారిని అనుగ్రహించు మాణిక్యాదేవి మనలను కాపాడు గాక.

  శ్రీ మాత్రే నమః.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...