Thursday, January 25, 2018

TIRUMOOLA NAAYANAR

" అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న వా బన్దనం నైవ ముక్తి న బంధః
చిదానంద రూపః శివోహం శివోహం."
చిదానందరూపా-తిరుమూల నాయనారు
**************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అగణిత భక్తితత్పరుడు అగస్త్యమహాముని దర్శనార్థము
అడుగులు వేయసాగె దక్షిణదిశగ,మార్గ మధ్యమున
కావేరి స్నానమాచరించి,దేవర సేవకు బోవుచుండగా
కాపరిలేడని గొల్లుమను గోవులమందను చూచె జాలిగా
సకలదేవతా సాధుజీవులకు సంతసమును తానందీయగ
ప్రాణములేకయున్న మూలరు కాయము ప్రవేశించెగ
చెట్టున పెట్టిన సాధుకాయము కనికట్టుగ మాయమాయె
పరమపదంబును పొందగ పరకాయ ప్రవేశమె కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.
తిరునంది దేవారు ఎనిమిది మంది శిష్యులలో ఒకరు తిరుమూల నాయనారు.మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేసినందుకు తిరుమూలారు అయినాడు.తిరుమూలారు అగస్త్యముని సందర్శనార్థము దక్షిణ దిశగా బయలుదేరాడు.కావేరీనదీ స్నానమును చేసి దైవదర్శనమునకు వెళ్ళుచుండగా,కాపరిని కోల్పోయి ఒక ఆవులమంద విచారముగా కన్నీరు కారుస్తూ కనిపించింది. గౌవాగ్ని అనునది శ్రుత వాక్యము. అగ్నితో సమానమైన గోమాత ఎలా ప్రభవించింది?ఒక సారి బ్రహ్మదేవుడు ద్వాదశాదిత్యులను, ఏకాదశ రుద్రులను,అష్ట వసువులను పిలిచి ఒకసంవత్సరము పాటు తీవ్ర తపస్సును చేసిన, తత్ఫలితముగా ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడును గాక.ముప్పదిమూడు కోట్ల దేవతల యొక్క పవిత్రత దానియందు నిక్షిప్తము అగుగాక అని దీవించిరి.వారి అచంచల తపోవైభవ విశేషమే గోమాత జననము.నిష్ఠా గరిష్టతతో అగ్నికార్యమునుచేయలేని వారికి,సులభముగా సుసంపన్నులగుటకు గోసేవా భాగ్యము కల్పించబడినదన్న విషయమును తెలిసిన ,.నాయనారు ఆవులను దుఖః విముక్తులను చేయ దలిచాడు. ఆది శంకరుల వారిని స్మరించి,నిష్కాముడై తన శరీరమును చెట్టు తొర్రలో పెట్టి మూలాన్ శరీరములోనికి పరకాయ ప్రవేశము చేశాడు. కాపరిని చూసి గోవులు సంతసించాయి.గ్రామమునకు తిరిగి వెళ్ళిన నాయనారు,కాపరి భార్య చింతనను ఆధ్యాత్మికత వైపు మళ్ళించాడు.రావి వృక్షము క్రింద తీవ్ర తపమును ఆచరించాడు.సమాధి స్థితిలో మూడువేల సంవత్సరాలుండి,సంవత్సరమునకొకసారి బహిర్ముఖుడై ఒక పద్యమును చెప్పుచు,మూడువేల పద్యముల "తిరు మందిరము"ను అందించిన తిరుమూల నాయనారును అనుగ్రహించిన సదా శివుడు మనందరిని అనుగ్రహించు గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...