Thursday, January 25, 2018

MOORTI NAAYANAR



"న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః 
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం "

  చిదానందరూపా--మూర్తి నాయనారు
  ************************************
 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

 డెందమున భక్తిమరందము చిందులువేయుచునుండ
 ఆనందపుచందనపుసేవ  ఆ  కపర్దికి చేరుచునుండ

 శివద్వేషిగ రాజు మతమార్పిడికోరెనాయె
 వినలేదని చందనమివ్వరాదని శాసనమిడె

 కాలకంఠుని ఆనతో కాలము వింతగ కఠినమాయెగా
 చేతిని చందనపుచెక్కగ మలచిన పంతము జటిలమాయెగా

 చయ్యనబ్రోవగ దలచినచిదానందుని మాయగ
 భక్తితో తీసినరక్తచందనమే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలుగాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

   గంధము అనే భక్తిబంధమును భగవంతునికి బిగించిన భాగవతోత్తములో ఎందరో.ఉదాహరణకు"  గంధము పూయరుగా" అంటు త్యాగరాజు,"మృగమదా మోదాంకితం చందనం" అంటు
,"కుంకుమచందన లేపిత లింగము" అంటు ఆది శంకరులు,శ్రీకృష్ణునిచే "సుందరి" అని పిలువబడి
అతిలోక సుందరిగామారిన"కుబ్జ" మొదలగువారికి కైవల్యమును ప్రాప్తింపచేసినది వారు అలదిన చందనపు చందమే కదా!

 అసలు భగవంతునికిచందనమలదుటలోని అంతరార్థమేమిటి?గంధము పూయుటయేనా? అయితే ఆ గంధము ఎటువంటిది? ఎందువలన అంత మహిమాన్వితమైనది?

  కొంచము నిశితముగా పరిశీలిస్తే, లేడిపిల్లలా చెంగుచెంగున పరుగులు తీసే మన మనసును భక్తి అనే తాడుతో కట్టి స్థిరచిత్తమును చేయునదియే సాన.సర్వేశ్వరుని అనుగ్రహ గుణగణములు గంధపుచెక్క.నిత్య నిరంతర మననము అరగదీయుట.నిరంతర సాధనతో లభించిన సంస్కారములు సుగంధములై పరిమళములను వ్యాపింపచేస్తు,పరమేశ్వర సన్నిధికి మనలను చేరుస్తాయి.

  తన మోచేతిని గంధపుచెక్కనుచేసి నియమపాలను అను సానపై రక్తగంధమును తీసిన నాయనారును అనురక్తితో కరుణించిన చందనచర్చిత సాంబశివుడు మనందరిని కరుణించును గాక.

  ( ఏక బిల్వం శివార్పణము.)  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...