Thursday, January 25, 2018

KOLHAPURE MAHALAKSHMI

  కొల్ హాపురే  మహాలక్ష్మి


   " స్థూల సూక్ష్మే మహారౌద్రే  మహాశక్తి ప్రదాయిని
     మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే."

     మహారాష్ట్ర పన్ హాల పర్వత సమీపమున,భోగవతి,తులసి,కుంభి,కసరి,దమని అను పంచ గంగా తీరమున మాయాసతి నేత్రద్వయము పడి మహాలక్ష్మి గా మనలను పరిపాలించుచున్నది.దేవీ భాగవత పురాణ దేవీగీతలో కొల్ హాపురి మహలక్ష్మి గురించి ప్రస్తుతించ బడినది.కొండజాతులచే ఈ తల్లి కొల్లమ్మ గా పూజింపబడుచున్నది.శిలాహార రాజుల ఇలవేల్పు మహాలక్ష్మి.
 
     మహాలక్ష్మి పీఠము మణిద్వీప సమానము.వజ్రశిలారూపిణిగా  అనుగ్రహించుతల్లి ఒకచేత మదీఫలము,మరొక చేత గద,వేరొక చేత కేటకము అను ఆయుధము,నాల్గవచేత అక్ష్య పాత్రతో కాంతులీనుతుంటుంది.తలపై కుండలినీశక్తి ప్రతిరూపముగా పాము,సర్వజగతికి సంకేతముగా పానవట్ట్,త్రిశక్త్యాతగా లింగమును ధరించి యుండును.పద్మాసనమునకు మారు సిం హవాహినిగా చిద్విలాసముతో ఉంటూంది.శాంతలక్స్మి సంకేతములైన పద్మసనే పద్మకరే మహాలక్ష్మిదేవి రౌద్రరూపియై అసురత్వమును  అరికట్టుతుంటుంది.

       షట్శక్తి క్షేత్రములలో ఒకటైన ఈ శక్తిపీఠమున హరి నివాసముగాను పేరుపొందినది.కొల్ హాపురము గాను,కొల్లాపురము గాను,కరవీరపురముగాను ప్రసిద్ధిచెందుటకు ఒక ఇతిహాసము కలదు.దాని ప్రకారము బ్రహ్మ మానసపుత్రులు గయ-లవణ-కొల్ హ.వారు పరమశివుని అనుగ్రహమునకై ఘోరతపములు చేసి,వరప్రసాదులైరి.గయ-లవణౌలు ఇంద్రుని-యముని జయించి,దేవతలను స్వర్గమునుండి తరిమివేసిరి.దేవతలు తమ అసహాయతను విష్ణువునకు విన్నవించుకొనగా హరి వారిని యుద్ధములో అంతమొనరించెను.ఈ విషయము తెలుసుకొనిన కొల్ హ దేవతల సంతోషమునకు లక్ష్మీదేవి వారి అండనుండుట అని తెలుసుకొని ఆమెకై ఘోరతపమాచరించి తనరాజ్యమునందుండునటూల వరమును పొందెను.తన తమ్ములను చంపిన వారిపై పగతీర్చుకొనుటకు వారిపై దండెత్తెను.కొళ అను రాక్షసునకు డోల అను మరొక పేరు కలదు.వాని కుమారుడు కరవీరుడు.లక్ష్మీదేవి 100 సంవత్సరములు తనరాజ్యమును వీడదన్న అహంకారముతో వాని దుష్కృత్యములు హద్దుమీరగా ధర్మసం రక్షణార్థము తల్లి లంక భైరవుడు-కాల భేతాళుడు మొదలగు భారీ సైన్యముతో,పద్దెనిమిది చేతులతో సిం హవాహినియై దండెత్తగా,అమ్మ ఆయుధములు తాకిన కొల్ హ శరీరము పునీతమై పశ్చాతప్తుడై అమ్మను శరణు వేడి,మూడు వరములు కోరెను.అవి ఆ స్థమును పవిత్రమైన పుణ్యక్షేత్రముగా దీవించుట,తన పేరున,తన కుమారుని పేరున ఆ స్థలము పిలువబడుట,అమ్మ తన నిజరూపమున అక్కడనే ఉండి అందరిని ఆశీర్వదించుట.అమ్మ వానిని అనుగ్రహించినది.నిర్హేతుక కృపాకటాక్షమంటే ఇదేనేమో.

   పశ్చిమాభిముఖియైన పరమపావనిని  ఆదిశంకరులు,చత్రపతి శివాజి అగస్థ్యులవారు ఇంకా ఎందరో సేవించి తరించిరి.భక్తులు అమ్మను అంబాబాయి అని ప్రేమతో పిలుస్తారు.
   మహావిష్ణుహృదయస్థానమైన లక్ష్మీస్థానమును భృగుమునిని అవమానపరిచాడని తల్లి ఇక్కడ వెలిసిందని,అమ్మవారికి ప్రతి దసరా ఉత్సవములలో అమ్మవారికి పట్టువస్త్రములను తిరుమల తిరుపతి దేవస్థానము వారు సమర్పించుకుంటారు.

    శివసాయుజ్యమును పొందిన కరవీరుని నామముగల కరవీరపురమున చైత్రమాసములో బ్రహ్మరథోత్సవములు వైభవముగా అందమైన రంగవల్లులతో అంగరంగ వైభవముగా జరుగును

  అమ్మవారికి జరిగే సూర్యకిరణాభిషేకము ఈ పుణ్యస్థల ప్రత్యేకత.
  
     జనవరి చివరి నుండి నవంబరు మధ్యవరకు గల సమయములో సాక్షాత్తు సూర్యభగవానుడు స్వయముగా తన అమృత కిరణములో అమ్మ పాదాలను,హృదయమును,ఆపాదమస్తకమును అభిషేకించి ఆనందపరవశుడవుతాడట. నిత్యకళ్యాణోత్సవమైన మహాలక్ష్మిదేవికి వరలక్ష్మీవ్రత పూజలు ప్రత్యేక ఆకర్షణ,
  డోలాసుర సం హార ఘట్టములో ప్రధానపాత్ర వహించిన తనను భక్తులు గుర్తించలేదని "జంబోరాదేవి" అలిగి కొందమీదకు వెళ్ళి వెలిసిందని,మహాలక్ష్మీదేవి శరన్నవరాత్రులందు వచ్చు లలితాపంచమి రోజున మేళతాళములతో కొండమీదికి వెళ్ళి ప్రత్యేక పూజలను చేసి వస్తారట.జ్ఞానపథ జానపద కథ.

   మహాప్రళయమునందు సైతము శ్రీ మహావిష్ణువు-మహాలక్ష్మి శాశ్వతస్థావర క్షేత్రము కనుక ఈ శక్తిపీఠము "అవిముక్త క్షేత్రముగా" అలరారుచున్నది.

  శివ-శాక్తేయ-విష్ణు తత్త్వాలతో విరాజిల్లుతున్న  మహాలక్ష్మీదేవి మనలను కరుణించును గాక.

  శ్రీ మాత్రే నమ:

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...