Thursday, January 25, 2018

ODHYAANE VIRAJAADEVI

1 ఓఢ్యాణే గిరిజాదేవి

" ఓఢ్యాణే గిరిజాదేవి పితృర్చన ఫలప్రదా
బిరజ పరా పర్యాయస్థిత వైతరిణితటే
త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణా
నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధని."
వైతరిణి నదీతీరమున కల ఓఢ్యాణపురములో మాయాసతి నాభిభాగము పడి వరప్రదాయిని గిరిజాదేవిగా కొలువైనది.ఒడిషా/ఒరిస్సా/ఒడియా/ఒరియా అని
పిలువబడుచున్న, ప్రదేశములోని జాజ్ పూర్ ప్రాంతమును జగజ్జనని తన నివాసముగా ఎంచుకున్నది.నాభి ప్రదేశమును నడుమును ఒడ్డానముతో ప్రకాశించు తల్లి ఉన్న ప్రదేశము కనుక ఓఢ్యాణపురము అని కూడా భావిస్తారు.హిమవన్నగము మేనకలను తల్లితండౄలుగా అనుగ్రహించిన తల్లి కనుక గిరిజాదేవి అని అమ్మను కొలుస్తారు.విరజ అనగా శుభ్రపరచు అను అర్థమును అన్వయించుకుంటే మన పాపములను శుభ్రపరచుచు మనలను పునీతులను చేయు తల్లికనుక విరజాదేవి అని పూజిస్తారు.ఆర్యా స్తోత్ర ప్రకారము ఉత్కళరాజ్యస్థులు విరజా దేవిని తమ కులదేవత గా ఆరాధించెడివారు.
తల్లి మహాలక్ష్మి-మహాశక్తి-మహా సరస్వతిగా పరిపాలిస్తుంటుంది.అమ్మ నాభి ప్రదేశము పడిన ప్రదేశము అని కొందరు భావిస్తే,గయాసురుని నాభి పడిన ప్రదేశమని మరికొందరు ఇక్కడ బావిదగ్గర పితృకార్యములను నిర్వహిస్తుంటారు దాని వలన ఇక్కడ ప్రవహిస్తున్న వైతరిణి నది వారిని యమలోకబాధలనుండి విముక్తిని ప్రసాదించి,తరింపచేస్తుందని నమ్ముతారు.
అమ్మ కిరీటము చంద్రరేఖ,గణేశుడు,లింగముతో ప్రకాశిస్తూ ఉంటుంది.అమ్మ ఒకచేతిని మహిషుని హృదయములో గండ్రగొడ్డలిని గుచ్చుతూ,మరొక చేతితో వాని తోకను పట్టుకుని దర్శనమిస్తుంటుంది.విరజాదేవితో పాటు భగళాముఖి అమ్మవారు కూడా ఇక్కడ నెలవైయున్నారు.గిరిజాదేవి లీలలను వివరిస్తు,సప్తమాత్రికలను సందర్శింప చేస్తూ ఇక్కడ అద్భుతమైన మ్యూజియము కలదు.
ఇంతకీ ఎవరా మహిషాసురుడు? ఏమా కథ?
కశ్యప ప్రజాపతికి దనదేవి యందు జన్మించిన దానవులలో రంబుడు-కరంబుడు అను ఇద్దరు అన్నదమ్ములు అత్యంత శక్తివంతమైన సంతానము కొరకు పరమేశ్వరుని ఈ క్రిందివిధముగా ధ్యానించసాగిరి.
రంబుడు దక్షిణాగ్ని,ఉత్తరాగ్ని,పశ్చిమాగ్ని,ప్రాగగ్ని ఉపరితలమున కల ప్రచంద సూర్యాగ్ని మధ్యమున నిలిచి ఘోరతపమును ఆచరించసాగెను.అతని తమ్ముడైన కరంబుడు జలదిగ్బంధనములో కఠోర తపమాచరించు చుండగా,దాని వలన కలుగు దుష్పరిణామ నివారణకై,ఇంద్రుడు మొసలిరూపమున దాగి,వానిని సంహరించెను.
విషయమును తెలిసికొనిన రంబుడు పగతో రగిలిపోతూ,శత్రువులను జయించాలంటే బలాఢ్యుడైన పుత్రుని సహాయము ఎంతో కలదని గ్రహించి,అగ్ని దేవుని ప్రార్థించ సాగెను.ఫలితము కానరాకున్న,తపమును మరింత ఉదృతమును కావించెను.అయినను అగ్నిదేవుడు కరుణించలేదని,తన తలను అగ్నికి సమర్పించగా ఉద్యుక్తుడాయెను రంబుని నిష్ఠనుకు సంతసించి అగ్ని వరమును కోరుకోమనెను.
రంబుడు బాగుగా ఆలోచించి కామరూపి ,అజేయుడు,ముల్లోకములను జయించగల కుమారుని కోరుకొనెను.అందులకు అగ్ని రంబుడు వెనుదిరిగి వెళ్ళునప్పుడు దేనిని చూసి/లేదా ఎవరిని చూసి మోహవివశుడగునో వారికి జనించిన కుమారుడు రంబుని కోర్కెను తీర్చగలడని పలికి అంతర్ధానమయ్యెను.
వెనుదిరిగి చనునపుడు ఎందరో సౌందర్యవతులు,అప్సరసాంగనలు తారసపడినా రంబుడు ఎటువంటి మన్మధ వికారమును పొందలేదు.ప్రయాణమును కొనసాగించుచుండగా అక్కడ ఒక మహిష్మతి అను గంధర్వ కన్య మరీచి మహాముని శాపవశమున మహిషమును చూచినంతనే మోహితుడాయెను.తత్ఫలితముగా మహిషము గర్భమును ధరించినది.రంబుడు ఆ మహిషమును తన నగరమునకు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకొనసాగెను.ఒక ముహూర్తమున ఆ మహిషము దున్నపోతు తల-మానవ శరీరము గల ఒక దూడను ప్రసవించి ,శాప విమోచినియై తన గంధర్వ లోకమునకు పోయెను.
దైవ నిర్ణయ ప్రకారము మహిషుడు బ్రహ్మగురించి ఘోరతపమును చేయగా,సంతసించిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను.మహిషుడు తనకు మరణములేని వరమును ప్రసాదించమనెను.అందులకు తనకా శక్తి లేదని,కల్పాంత సమయమున తానును నిష్క్రమించువాడనని,మరేదైనా వరమును అనుగ్రహించెదననెను.మహిషుడు అహంకారముతో "అబలలను అరికాలితో అణచివేయగలను" అని తలచి స్త్రీలు తప్ప ఎవరు తనను సంహరించని వరమును పొందెను.
మహిషుడు లేని సమయానుకూలతతో దేవతలు అతని రాజ్యమును ఆక్రమించిరి.
క్రుద్ధుడైన మహిషుడు అనేకానే బలసంపన్నులగు సైన్యములతో,దేవతలపై దండెత్తిజయించి ఇంద్రునితో సహా అందరిని తరిమివేసెను.అకారణముగా నిస్సహాయులైన దేవతలను రక్షించుటకు త్రిమూర్తుల ముఖవర్ఛస్సు నుండి ఒక అధుతశక్తి ఉపన్నమైనది.సకలదేవతలు తమ వర్చస్సును ఆ తల్లియందు ప్రవేశ పెట్టిరి.ఆ శక్తి ఒక రౌద్ర స్త్రీమూర్తిగా పరిణామము చెంది,దేవతలందించిన వివిధ మహిమాన్విత ఆయుధములతో మహిషునిపై దండెత్తి,మంచి-చెడుల సంఘర్షణయైన మహాయుద్ధములో కాసేపు మహిషునితో ఆదుకొని,సమయమాసన్నమవగానే.ఒకచేతితో వాని మదమను హృఇదిపై తన గండ్రగొడ్దలి నుంచి.రెండవచేతితో వానితోకను పట్టుకుని,వాని రాక్షసత్వమును మర్దించెను.అమంగళమును ప్రతిహతముగావించినది ఆ గిరిజాదేవి.

అమ్మ వారికి శారదీయ దుర్గాపూజ మహాలయ కృష్ణపక్షమునుండి ప్రారంభమై ఆశ్వయుజ శుక్లనవమి వరకు అత్యంత వైభవముగా జరుగును.శుక్ల అష్టమినుండి శుక్ల నవమి మధ్య సమయములో (జంతు) బలిదానములుబలిదానములు జరుగుచుండును.పూరి జగన్నాధ యాత్ర వంటి వైభవోపేతమైన శోభారథయాత్రతో మనలను పులకింపచేయు ఆ గిరిజా దేవి మన మనోరథములను నెరవేర్చును గాక.
శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...