Friday, January 26, 2018

TIRUPPAAVAI-30

వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు చేయిడైయార్ శిన్రిరైంజి
అంగప్పఱై కొండవాత్తై అణిపుదువై
ప్పైంగమల త్తణ్డెరియల్ బట్టర్పిరాన్ కోదైశొన్న
శంగత్ తమిళ్మాలై ముప్పదుం తప్పామే
ఇంగిపరిశురై పార్ ఈరిరండు మాల్వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాత్
ఎంగుం తిరువరుళ్పెత్తు ఇంబురువ రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-30
అనుగ్రహముగ నామది శ్రీరంగముగా మారినది
నిత్యకళ్యాణమైన గోదా కళ్యాణము చూడాలని కోరుతోంది.
శ్రీవిల్లిపుత్తూరుకు విచ్చేసి శ్రీవిష్ణుచిత్తీయుని అర్థించిన వారైన
అఖిలాండకోటి దేవతలు ఆ అర్చకస్వాములలో
ముముక్షువులు గోపికలకు ముక్తిని ప్రసాదించినదైన
ముద్దుగుమ్మ కూర్చున్న ఆ ముక్తపురుషులు ముత్యాలైన పల్లకిలో
పూలమాలలతో స్వామికి పూలంగిసేవలందిచినదైన
పూబోడికై స్వామి ఎదురుచూచు ఆ శ్రీరంగ పట్టణములో
అఖిలాండ బ్రహ్మాండనాయకుని అంగరంగ వైభవమైన
అమ్మతో జరుగుచున్న ఆ తిరు పాణి గ్రహణములో
వారి చెంతనున్న వారమమ్మ తరియించగ మనము
వైభవోపేతమమ్మ వారిరువురి అనుగ్రహము.
పరమ భాగవతోత్తముడైన శ్రీవిష్ణుచిత్తుని వలన భగవతత్త్వమును అవగతమొనరించుకొను చున్న మన ఆండాళ్ తల్లి,గోపికలు కాత్యాయినీ వ్రతమును ఆచరించి,స్వామి సాయుద్యమును పొందినారని తెలుసుకొని,తానును గోపికగా మారి(మనో వాక్కాయ కర్మలలో) చెలులతో ముప్పదిరోజులు,పామాలతో (పాశురములతో) పూమాలలతో మార్గళి వ్రతమును ఆచరించి మనకు మార్గదర్శకురాలైనది.ఏమీ తెలియని నాచే ముప్పది పారిజాత మాలలను స్వామికి సమర్పింప చేసినది.నా పూర్వ భాగ్యమేమో తెలియదు కాని నన్ను తన కళ్యాణోత్సవమునకు తీసుకుని వెళుచున్నది.ఒక్క నిమిషము.ఎవరో మహాత్ములు వచ్చారు.ఎందుకో? ఏమిటో నన్ను తెలుసుకోనివ్వండి.మీకు చెబుతాను ఆ విశేషాలన్నీ.
గోదా రంగనాథుల కళ్యాణార్థము తమ అదృష్టముగా భావిస్తూ,అఖిలాండకోటి దేవతలు అర్చక స్వాములై అయ్యవారి తరఫున ఆండాల్ తల్లిని వధువుగా అర్థించుటకు కానుకలను-పల్లకిని తీసుకుని వచ్చారు.అబ్బ!మౌక్తికాలంకృతమైన పల్లకి ఎంత బాగుందో.అసలెక్కడివి ఈ ముత్యములు సత్వగుణశోభితములై సత్చిత్ ప్రకాశముతో నున్నవి.తల్లిచెప్పిన ముక్త పురుషులు వీరే కాబోలు.ఎర్రటికెంపులు అమ్మ బుగ్గల ఎర్రదనపు కాంతి సోకిన ముత్యాలేమో.తెలుపు కాదు.ఎరుపు కాదు.నీలముగా తోచుచున్నవి.ఆ నీలమేఘ శ్యాముని కడకంటి చూపులను తోడ్కొని వచ్చినవేమో అందుకే ముత్యములు నీలాలై నాతో మేలమాడుతున్నవి.కాసేపు పచ్చలుగా,మరి కాసేపు గోమేధికములుగా,వజ్ర వైఢూర్యములుగా.ఎంతైన స్వామిదగ్గరకు అమ్మను తీసుకువెళుతున్నామనే భావోద్వేగము బహురూపులు సంతరించుకుంటున్నదేమో.
విష్ణుచిత్తులవారు అతిథులను సత్కరించారు.పాండ్యరాజు ఆడపెళ్లివారి బాధ్యతను అన్నయై ఆనందంగా స్వీకరించారు.ఇదేమి చిత్రమో నా మనసు శ్రీరంగములో అమ్మకై ఎదురుచూచు చున్న రంగనాథుని పక్కకు చేరింది.ఆడపెళ్ళివారు-మగ పెళ్ళివారు రెండూ తానై ఆనంద డోలికలూగుతోంది.
ఆ ఆనందోత్స వాన్ని ,తిరు (పవిత్రమైన) కళ్యాణాన్ని కనులారా దర్శించి,తిరుగులేని వారిరువురి దయను పొందుదాం.నాతో బాటు మీరు రండి.
శ్రీ రంగే గరుడాచలే ఖగ గిరౌ సిం హాచలే మందిరే
వైకుంఠే కనకాచలేచ నిషధే నారాయణాఖ్యాచలే
లోకాలోక మహాచలేచ నిషదే పుణ్యాచలేష్టా శ్రియ:
పాయాత్ ఓ భగవాన్ పురాణ పురుష: కుర్యాత్ సదా మంగళం".
భగవత్ బంధువులారా! మీరు
కుప్పల తప్పులు అనినా ! కుప్పిగంతులే అనినా
చొప్పదంటు పలుకులనినా నప్పిన్నాయ్ కరుణతో
ఫలశృతి
ముద్దుమోము చూడమంటు అద్దము చూపిస్తాడు
విసనకర్రను ఇస్తాడు ఆ ముసిముసి నవ్వులవాడు
మనతో జలకములాడుతాడు జలజనాభుడు చూడు
పఱ ను అందిస్తాడు ఏ అరమరికలు లేనివాడు
ఆడతాడు-పాడుతాడు వీడలేను అంటాడు
సరసను కూర్చుంటాడు పరమాన్నము తింటాడు
యమునకు రమ్మంటాడు మనసును ఇమ్మంటాడు
పట్టు విడుపు లేనివాడు మనలను పట్టుకునే ఉంటాడు
మాయను తెలిసిన వాడు సాయము చేస్తుంటాడు
చెంతనే ఉంటాడు చింతలు తీర్చేస్తాడు
కొండను ఎత్తిన వాడు మన గుండెలోన ఉంటాడు
నెమలి ఈక నిస్తాడు నెనరులు చూపిస్తాడు
దాసోహమనగానే తను దాసుడిలా మారతాడు.
అమ్మ చేయి విడువకుంటే అన్నీ తానే అవుతాడు.
కాయేన వాచా మనసే ఇంద్రియైర్వా
బుద్ధి ఆత్మమానా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యద్ యత్ సకలం పరస్మై
నారాయణా! ఇతి సమర్పయామి.
మనో వాక్కాయ కర్మలతో చేసిన సకలము నారాయణుని పాద పద్మములను చేరుగాక.
( ఓం తత్ సత్.)
సాహితీభూషణులు-సరస్వతీ పుత్రులు గుంపు నిర్వాహకులు, ఎంతో పెద్దమనసుతో, నా ఈ చిన్ని ప్రయత్నమును మనసారా ప్రోత్సహించి,వారి గుంపులోనికి అనుమతించినందులకు,మిత్ర సోదర సోదరీ మణులు సహృదయతతో తమ అమూల్యమైన సమయమును వెచ్చించి స్పందించినందులకు పేరుపేరునా నా సవినయ నమస్కారములు మరియు కృతజ్ఞతలు. మీ సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.
జై శ్రీమన్నారాయణ తవ చరణమేశరణము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...