TIRUVEMBAVAY-11
తిరువెంబావాయ్-11
************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి"
సందర్భము
**********
"న అన్య పశ్యంతే" -పరమాత్మను తక్క అన్యమును చూచుటకు ఇష్టపడని స్థితిలోనున్న భాగ్యశాలురైన కన్నియలు ఒకరినొకరు మేల్కొలుపుకుని,ఆశీర్వాదముగా ఆత్మజ్ఞానమనే శివజ్ఞానమును అందుకుంటూ,శివనోము చేయు దీక్ష లోని భాగమైన స్నాన ఘట్తములోనికి ప్రవేశిస్తున్నారు.వారితో పాటుగా మనలను ప్రవేశింపచేస్తున్నారు.అదియే
వెణ్-నీర్-ఆడి తెల్లని స్వచ్చమైన నీటిలో మునిగి.
పరమాత్మ అనుగ్రహము జలములో ప్రకటనమగుతూ మనలను కరుణిస్తుంటే అదియే తీర్థము.మనము తరచుగా తీర్థయాత్రలకు వెళుతున్నాము అని వింటుంటేనే ఉంటాము.తీర్థ ప్రాశస్త్యమును తిరుమాణిక్యవాచగరు మనకు ప్రస్తుత పాశురములో అనుగ్రహిస్తున్నారు.
పాశురము
*********
ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న
కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్ పాడి
అయ్యా వళి అడియో వాళ్దోంకాణ్ ఆరళ్ పోర్
శయ్యా వెణ్ణిరాడి శెల్వా శిరు మరుంగుల్
మయ్యార్ తడంగన్ మడందై మణవాలా
అయ్యా నీరాట్కొండ అరుళుం విడయాట్రిన్
ఉయివార్గళ్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిదోం
ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలో రెంబావాయ్
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి అంటూ కలశములో జలస్థాపితమును చేస్తుంది సనాతనము.దానిని పవిత్రముగా భావిస్తుంది.
వేమన అన్నట్లు
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల
భాండ శుద్ధిలేని పాకమేల?
ప్రస్తుత పాశురములో ఉపాధిని భాండములో,ఉపాధిలో దాగి మనలను అధీనము చేసుకొనుచున్న ఇంద్రియములను శుద్ధిచేయునది ఈ స్నానము.
శివనోము లోని ఒక విధివిధానముగా వారు,
పొయిగై పుక్కి-పుష్కరిణిలో/కోనేటిలో మునుగుటకు సిద్ధపడుచున్నారు.స్వామిని అనుసరిస్తు తరిస్తున్నది ఆ పొయిగై.
అది కేవలము జలము కాదు.తెల్లని స్వచ్చత కలిగినది.సత్వగుణ సంశోభితమైనది.అందులో పద్మములుగా పార్వతీ పరమేశ్వరులు ప్రకాశిస్తున్నారు.
తండ్రి "భస్మోద్ధూళిత విగ్రహుడై-సన్నని నడుము గలిగిన బాలాంబికా (వయోవస్థా వివర్జితా)
సమేతుడై ఆశీర్వదిస్తున్నాడు.
వీరు భక్తితో చేతులతో నీటిని తాకుతూ నమస్కరిస్తూ పరవశిస్తున్నారు.ఇది కేవలము బాహ్యస్నానము కాదు.వారి నేత్రములో పద్మములుగా ప్రకాశించుచున్న పరమాత్మను చూడగలుతున్నవి.చేతులు వారి పాదములను తాకకలుగుచున్నవి.నోరు నొవ్వక కీర్తించుచున్నది.చర్మము వారి స్పర్శచే పునీతము అగుచున్నది.
అంతే కాదు ఆ మడుగు
ముయ్యార్ తడం పొయిగై-తుమ్మెదలతో నిండియున్నది.
ఆ తుమ్మెదలు చేయుచున్న ఝంకారము వారికి పరమాత్మచే ఆవిర్భవింపబడిన వేదములు చేయుచున్న నాదార్చనముగా వినిపించుచున్నది.
అంతే కాదు ఎందరో ముక్తసంగులు చేయుచున్న ప్రస్తుతులుగాను శ్రవణానందమును అందించుచున్నవి.
పంచేంద్రియములు పరిశుద్ధమై పరమాత్మ అర్చనమునకు పరుగులు తీయుచున్నవి.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment