Sunday, August 20, 2017

USH----GAPCHIP


 ప్రాజ్ఙ్నన్నయ  యుగము నుండి
 ప్రస్తుత  సమయము వరకు

 పథకాలు తెలుగేనట
 పతకాలు  తెలుగుకేనట

 తెలిమంచు తెరలనుండి
 మలిసంజె గుంకు వరకు

 పెదవంచున తెలుగేనట
 నయవంచన  తెలుగుకేనట

 గుంజలు పాతుట నుండి
 గురిగింజలు మాటలతో

 పందిళ్ళు తెలుగేనట
 సందళ్ళు  తెలుగుకేనట

 పోకడలు తెలియువరకు
 లోకులు నమ్మే వరకు

 మైకులలో  తెలుగేనట
 పైకము తెలుగునకేనట

 జ్యోతి  ప్రజ్వలనము నుండి
 భరత వాక్యము వరకు

 ప్రసంగములు  తెలుగేనట
 ప్రచారము తెలుగుకేనట

 నోరు మాట్లాడుతుంటే
 నొసల వెక్కిరింపులేనట

 యాసలలో  తెలుగేనట
 ఆశలన్ని  తెలుగుభాషకేనట

 కూసింతైన వినబడని తెలుగు ఊసు
 అమ్మతో చెప్పింది  నమ్మరాని పలుకులని. 

Saturday, August 19, 2017

భూతల స్వర్గము -4

   కేరళ కేరింతలు-4

 వెనుకకు తిరుగు సరస్సుజలాల బలమేమో,మనసు వెనుకకు వెనుకకు పరుగిడుతుంటే దానిని  బంధించుటకు బుద్ధి బయలుదేరింది.వెంటనే..నేను ఇక్కడకు ఎలా రాగలిగాను?అవధులులేని నా ఆనందానికి కారకులెవరు?కళకళల కేరళ తలుపు తాళాన్ని నాకోసం తీసిందెవరు? అద్భుత ఆనందాల పల్లకీలో నేను కూర్చుంటే మోసిన బోయీలెవరు?మాకు కనువిప్పును కలిగించి మా అందరిమెప్పును శాలువగా కప్పుకున్న మేధావులెవరు?నాలో ప్రశ్నల పరంపరలు
జవాబులను వెతికి...తల్లితండ్రులకు అద్భుత అనుభూతులనిచ్చిన వారిని(మనసులోనైన)మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.వారికి వేయింతల ఆనందం కలగాలని...అది
పుత్రొత్సాహమో,పౌత్రోత్సాహమో,నిత్యోత్సాహము కావాలని భగవంతుని ప్రార్థించాను.మనవరాళ్ళు,మనవడు అడుగడుగునా కనిపెట్టుకుని కంటిపాపలా చూసుకుంటేనే కదా ఇదిసాధ్యం.వియ్యమునొందిన నెయ్యము ఆత్మబంధువై కొత్త ఇంధనమును ఇస్తేనే గదా
నేను కేరళ సౌధమున(సుధలుగలది)విహారముగావించినది.మందులే విందైన నాముందు అందాలసందడి చేయించిన ప్రతివారికి(వయసులో చిన్న-మనసులో మిన్న)మనసా,వచసా,శిరసా అంజలిస్తూ,మధురానుభూతులను మధించి,వ్యయ ప్రయాసలకు ఓర్చి మమ్మానందింప చేసిన ప్రతి ఒక్కరికి ,ఇంతై,ఇంతింతై,ఎంతెంతోగా ఆనందాలు చేరాలని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ......కొండంత చూసి గోరంత తెలిపిన
     భవదీయురాలు.

భూతల స్వర్గము-3

   కేరళ కేరింతలు-3
_
 సదాచారపాలన-సత్ప్రవర్తన ఉచ్చ్వాస-నిశ్వాసములుగా గల ఊయల కేరళ.పాండితీ ప్రకర్షకు,విజ్ఞాన విజయాలకు పట్టముగట్టే లక్షణము ఇక్కడి జగములోనే కాదు గజములలోను గోచరిస్తుంది.భర్తృహరి "సుభాషిత  త్రిశతి" తెలుగుచేసిన పాండితీ ప్రకర్ష రాజాదణను "గజారాహోణ"గా మార్చి పైడిపల్లి  లక్ష్మణకవికి "ఏనుగు లక్ష్మణకవి"గా నామకరణము కావించి,లబ్ధప్రతిష్ఠను ప్రసాదించినవి.చిన్నారులు కౌతాలు.శ్రీమను తమ ప్రతిభా పాటవములతో "పదముల రాణి"ని మెప్పించుటెరింగి వారిచే
"గజారోహణమే" కాదండోయ్ వనప్రదక్షిణము చేయించాయి మలయాళ మత్తగజములు.(పెద్దలు మొహమాట  పడతారని  కాని వారూ ధన్యులే సుమండీ) మరిన్నీ!!! మంచిని సాధించాలని మరీ మరీ దీవించాయి.
       "కళల పరిమళమే కేరళ" అనకుండా  ఉండగలమా! "కథాకళి"కలరి" ప్రదర్శనలనుచూశాక.నిర్జీవమైపోతున్న మనకళాప్రదర్శనలను పునరుద్ధరించాలని అనుకోకుండా ఉండగలమా.అవి ప్రదర్శనలు కావండీ" ప్రతిభా పురస్కారలకు ఆదర్శములు."
  మదర్పిత చందన తాంబులాదులు స్వీకరించి,మమ్మానంద పరచమని(డబ్బు కడితేనే) మంగళ హారతులతో,మల్లెల మాలలతో మనసారా ఆహ్వానించింది వైల్డ్ హోటలు సిబ్బంది.స్వాగత పానీయాలుగా సాటిలేని నారికేళ జలాలందిందించి.గలగలల సరిగమలతో వెనుతిరుగు జలాల
అందాలు మన మనసులను గతములోని మధురానుభూతుల దగ్గరికి తీసుకెళుతుంతే -అదిగో.తుళ్ళిపడే అలలతో పోటీపడుతు పరవశిస్తున్న ప్రయాణీకుల గళములు,
  "పచ్చ పచ్చని తోటల్లోన చందమామ
   పండువెన్నెల జాడల్లోన చందమామ
   వచ్చె వచ్చె అలలతోన చందమామ
   పసిడిపడవ పయనములోన చందమామ
   మిసిమినవ్వుల పువ్వులమ్మ చందమామ
   నచ్చి వచ్చేసాడమ్మచందమామ
  ఆనందాల నిచ్చెన వేస్తు చందమామ"

భూతల స్వర్గము-2


  కేరళ కరింతలు-2
 సంస్కారపు ఆకారము ఓంకారముగా,"భోజ్యేషు మాతగా'గా అందాల తనఒడిలో,అక్షయపాత్రనుంచుకుని ,పసందైన పాకశాకాలను,పళ్ళ పాయసాలను,మధురసాలను సిద్ధము చేసి,చక్కని సెలయేరులు మనపక్కగ మక్కువను కురిపిస్తుంటే,చల్లని చిరుగాలులు వీవనలు వీస్తుంటే,"మన గడపనున్నవారి కడుపు నింపమంటు"భారత భాగ్య విధాతను తలచుకుంటు,విందును-కనువిందును అందిస్తుంటే,ఆకలి చిరునామా అదృశ్యమైపోదా?వందలాది వందనాలు చిందులేస్తూ ముందుకురావా పోటీపడి[మూల్యము గురించి ఆలోచించి చిన్నబుచ్చకండి ఆ కన్నతల్లి ప్రేమను).
   "శశకముతో సిం హమే జంటకడితే"అంతే ఇదేమేమో అంటూ {ఆకారము కాదు ముఖ్యం-అందులోని ఆ కారం}ఆకుపచ్చ ముత్యాల హారాల్లా,ఆలంబనగా నిలువెత్తు సంస్కారానికి ప్రతీకలుగా నింగినితాకేలానున మహావృక్షాలను చేసుకుని అందాలొలకపోసే మిరియాలతీగలను చూడగానే చిన్న పెద్ద తేడాలు చిన్నాభిన్నమైపోతాయి.
   చూశారుగదండీ "అశ్విన్ టీ స్టాల్"బాషా ఇరానీ టీకి బాదుషాలము మేమంటూ తేయాకు మడులగడుల హడావిడులు.నీవెక్కడుంతే మేమక్కడంటూ పరిమళపు పలుకులతో మనలను పరవశింపచేయు సుగంధాల తోటలు .ఏ జన్మబంధమో మీతో మాది అని మోదముతో సేదతీర్చే తేనీరు.

Friday, August 18, 2017

భూతల స్వర్గము

 కేరళ(లో)కేరింతలు  మొదటి భాగము
*******************************************
 పంచామృత ధారలలో,పంచభూత సంగమములో, పంచేంద్రియ పరిష్వంగమును
అనుభవించిన వారిదే భాగ్యము.చూడని వారికి సున్నాలు కాకూడదనే నా ఈ చిన్ని ప్రయత్నము."సర్వేంద్రియాణాం నయనం ప్రధానం".దాని వినయమేగా నాకందించ గలిగినది సౌందర్య నిధానము."కన కన రుచి(కాంతి)రా అన్నట్లు అన్నివయసుల వారి మనసులను కొల్లగొట్టినది కేరళ కుట్టి.
అమ్మా అవనీ నేలతల్లీ అని ఎన్నిసార్లు పిలిచినా తనివితీరదెందుకో..
 బాపూ గీతలా బాపురే అనిపించే మెలికల కులుకులతో,బండరాయిని కాను నేను,నిండుమనసున్న నీ అండను అనిపించే ఘాట్రోడ్లు కంటికి ఇంపుగా వంపులతో మురిపిస్తుంటే,చిరుగాలుల సవ్వడులు వీనులకు విందును చేస్తూ పయనిస్తున్నప్పుడు ఆనందడోలికలను ఊగిస్తుంటే,లెక్కలేనన్ని సుందర పుష్పాల సువాసనలతో పిలాగాలి తెమ్మెరలు అల్లరిచేస్తుంటే చర్మము తన ధర్మముగా నిక్కపొడిచి చూస్తుంటే,ముక్కు మనమదిలో పదిలముగా చెక్కుతోంది.చిన్నబుచ్చుకుందపుడు చిత్రాల నాలుక (నాలుగు) తనను వెనుకకు పడేసి గోలచేస్తున్నయని.అది గుర్తించిన ఆ నేల "నాలుకా నీకు నాపై అలుకా"వద్దమ్మా అంటూ "ఆచార్య దేవో భవ"అంటూ అక్షరాస్యతను సాధించిన నేర్పుతోనే 
"అతిధి దేవో భవ" అంటూ అమృత భాండమై,నాలుకను పంచేంద్రియ ఏలికను చేసింది అబ్బురపు కొబ్బరిబోండం.
   పంచేంద్రియములతో పాటు పరవళ్ళ పరుగు కొనసాగుతుంది.

Wednesday, August 2, 2017

RAKSHAABAMDHAN-2017

   రక్షాబంధన పండుగ శుభాకాంక్షలు
    ****************************

 1. కొంచము  ముందో మరికొంచం వెనుకో
    ఒకే తల్లిగర్భములో  ఒద్దికగా ఒదిగాము

     ఒదగనిచ్చినది బొడ్డుతాడు  సహాయము.

   అదియేగ నేను  నీ చేతికి  కట్టిన దారము.

 2. కొంచము తెలిసో  మరికొంచము  తెలియకో
    ఉమ్మనీటి మడుగులో  ఒడుపుగా  ఈదాము

    ఈదనిచ్చినది  ఉమ్మనీటి సం స్కారము
  అదియేగ మెరిసే నీ కంటినీటి  మమకారము.

 3.కొంచము  తడబాటో  మరికొంచం  పొరపాటో
   చిట్టిపొట్టి పాదాలతో అమ్మను గట్టిగా  తన్నాము.

   తన్ననిచ్చినది  తన్నినా తరగని  తల్లిప్రేమ ఒరవడి
 అదియేగ  రక్షాబంధనపు  ముడి.

 4. కొంచము నగవులతో  మరికొంచం  తగవులతో
    నీవే ముద్దంటు  నాకసలే వద్దంటు ఇద్దరము పెరిగాము

       వద్దన్నది చేసానని
  ఛెళ్ళుమనిపించినది  నా చెంపదెబ్బ ఎర్రదనము
 అదియేగ  నీ నుదుట మెరిసేటి తిలకము.

 5. కొంచము సేపు పచ్చి అంటు  కొండముచ్చు నీవంటు
    అగ్గిమీద గుగ్గిలమై  భగ్గుమన్నాము.

          రెచ్చిపోయి
   పచ్చగడ్డినే   భగ్గుమనిపించినది  ఆ చిచ్చు
   అదియేగ పచ్చగ ఉండాలని  హారతిని తెచ్చు.

 6. కొంచం సేపు అమ్మ అంటు మరికొంచం సేపు నాన్న అంటు
    అమ్మ ఒడి నాదంటు  నాన్న భుజం నాదేనంటు
        నిన్ను రానీయనని
    అన్నీ నావేనంటు  బైఠాయించే వాళ్ళం
  అదియేగ నీ నోటిలోని  తియ్యనైన  మిఠాయి.

 7.కొందరు అవుననినా  మరికొందరు కాదనినా
   ఆడపడచులందరి  అభిమానము  వెయ్యేళ్ళు
     అన్నదమ్ములందరికి  అవి
 ఆనాటి  ఆనవాళ్ళు   ఆనందపు లోగిళ్ళు
 విరోధాభాసములైన  విజయ దరహాసములు.  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...