ADITYAHRDAYAMU-19


 ఆదిత్యహృదయము-19

  **************


  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

   కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం

   అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం

   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి."

పూర్వరంగమ్ను

*************


పరమాత్మ తన ఉగ్రత్వ-వీరత్వ సారంగత్వముతో సమస్తమును జాగృత పరచుచున్నాడన్న అగస్త్య భగవానుడు,


ప్రస్తుత శ్లోకములో అదే ఉగ్రత్వ-వీరత్వ స్వభావమును మరింత తెలియచేస్తూ,

"నిత్య-అనిత్య,సత్య-అసత్య జ్ఞానమును అందించుచున్నాడు." పరమాత్మ ప్రకాశత్వ పరమార్థమే మనము తెలుసుకొనబోవు శ్లోక మర్మము.


శ్లోకము

*******

"బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చశే

"భాస్వతే" సర్వభక్షాయ" రౌద్రాయ వపుషే నమః ."


 భాస్వతే-వర్చసే అను పదములప్రయోగము

పరమాత్మ ప్రకాశత్వక పరమార్థ విశేషణములు.తేజసామపి తేజస్వి అనుగ్రహమే భాస్వత్వము-వివశ్వంతము.విస్తారముగా కాంతిని వ్యాపింపచేయుట.


1. ప్రస్తుత శ్లోక భావగ్రహణమునకు ముందుగా మనము ఒక్కసారి,స్తోత్రములోని ఇంతకుముందు చెప్పుకొనిన,

" ఏష బ్రహ్మాచ-విష్ణుశ్చ-శివ-స్కంద-ప్రజాపతిః

మహేంద్రో ధనదః కాల యమః సోమః అపాంపతిః" శ్లోకములో,

పరమాత్మను,

నీవే బ్రహ్మవు,

నీవే విష్ణువు

నీవే శివుడవు అంటూ,

సృష్టి-స్థితి-సంహార కార్య నిర్వాహక శక్తుల సంకేత నామములుగా /గౌణ (స్వభావ)నామములుగా పేర్కొనినారు.

ప్రస్తుత శ్లోకములో సైతము,

"బ్రహ్మేశానాచ్యుతేశాయ-సూర్యాదిత్య వర్చసే' అంటూ,బ్రహ్మ-ఈశానుడు-అచ్యుతుడు-ఈశుడు-సూర్యుడు-ఆదిత్యుడు" అంటూ అవే గౌణనామములను తిరిగి/మరల ప్రయోగించారు.


వారు-వీరు ఒక్కరేనా అయితే మరల పదములను ప్రయోగించటములోని మర్మమేమిటి? అన్న సందేహము మనకు కలుగవచ్చును.

విశ్వరచనా ప్రారంభదశలో సృష్టి-స్థితి-సంహార నిమిత్తము నియమించిన శక్తులు వారు.

కాని,ప్రస్తుత శ్లోకమును గమనిస్తే,

మంత్రపుష్పములో చెప్పినట్లు,

" ఈశానస్సర్వ విద్యానాం-ఈశ్వరః సర్వ భూతానాం" (వీరత్వము-ఉగ్రత్వము)

బ్రహ్మాదిపతిః బ్రహ్మణోధిపతిః బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం' "

ఓ పరమాత్మ! నీవు,

1.ఈశానుడను గౌణ నామముతో సర్వవిద్యలకు అధిపతిగా నున్నావు.

2.ఈశ్వరుడు అన్న గౌణ నామముతో సర్వభూతములను సృష్టిస్తున్నావు.

3.అచ్యుత అన్న గౌణ నామముతో చ్యుతి /నాశము లేకుండా కాపాడుతున్నావు.

4.బ్రహ్మము/పరబ్రహ్మము గా నీవు,నీవు సృజించిన బ్రహ్మకు-బ్రహ్మజ్ఞులకు శాసకునిగా కొనియాడబడుతున్నావు అని స్పష్టపరుస్తున్నది.

మొదటి బ్రహ్మ శబ్దము నియామకమును సూచిస్తే-ప్రస్తుత శ్లోకములోని "బ్రహ్మ శబ్దము" నిర్వహణను సన్నుతిస్తున్నది.

కనుకనే లింగాష్టకము ,

"బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మ భాసిత శోభిత లింగం" అని శ్లాఘిస్తున్నది.


" రౌద్రాయ వపుషే నమః-సర్వ భక్షకాయ నమః"

రక్షణము-శిక్షణము-తత్క్షణము -లక్షణము-భక్షణము అన్న పదములలో కేవలము మొదటి అక్షరము మాత్రమే భేదము.క్షణికము అన్న పదమును కూడ మనము వింటుంటాము.అనగా సమయము/ కాలము ఒకటిగానే ఉంటుంది.కాని అదే సమయము కొందరికి సంతోషమును-మరికొందరికి విచారము,కొందరికి జ్ఞానము-మరికొందరికి అజ్ఞానము కర్మఫలితములను బట్టి కలిగిస్తుంటుంది.పరమాత్మ కర్మల-కర్మఫలముల సారమును అందించుటయే ఈ సర్వభక్షకత్వము.

పరమాత్మ రౌద్ర ఆకారుడై /రౌద్ర ఆలోచన పరుడై సర్వభక్షణమును చేస్తాడని వాచ్యార్థము.

ఇదే అభిప్రాయమును రుద్రనమకము 11 వ అనువాకములో,

" యే అన్నేషు వివిధ్యంతి-పాత్రేషు పిబతో జనాన్" అంటూ,

రుద్రుడు అనేకానేక రుద్రులను ఉత్పన్నముచేసి,వారిని ఆహారములోనికి-జలములోనికి,వాయువు లోనికి,ప్రవేశింపచేసి,అనారోగ్యమును-అజ్ఞానమును,అనుచిత క్రియలను జరిపిస్తున్నాడని కీర్తిస్తున్నది.అది సర్వ భక్షకత్వము కాదా మనము వాతావరణకాలుష్యము-జల ఆహార అపరిశుభ్రత అంటూ అనుకునేది.సైతము సర్వభక్షకత్వమే.


పంచభూతములసమతౌల్యత లోపిస్తే సంభవించే,వాయుకాలుష్యము,జలకాలుష్యము,దావాగ్ని-బడబాగ్ని-పిడుగులు పడటం,వడగాలులు-వరదలు,అంటువ్యాధులు ఇవన్నీ పరమాత్మ సర్వభక్షకత్వమే.


మానవ పరముగా అన్వయించుకుంటే పరమాత్మ,


మనశైశవ దసను భక్షించి-బాల్యమునిస్తాడు.

బాల్యమును భక్షించి యవ్వనమునిస్తాడు

యవ్వనమును భక్షించి వార్ధక్యమునిస్తాడు

వార్థక్యమును సైతము భక్షించి, అయ్యో,

కాల స్వరూపుడై,మనము తప్పించుకోలేని,

కాలపాశమువేసి మరణమును ఇస్తాడు.

ఓ జీవా ! మనలో జరుగుచున్న శారీరక-మానసిక మార్పులే గురువులై

మనలో నిత్యానిత్య-సత్యాసత్య జ్ఞానమును కలిగించుచున్నవేళ,


తం సూర్యం ప్రణమామ్యహం.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI